హిందీ సినిమా వాళ్ల విశేషాల కోసం యింగ్లీషు సినిమా పత్రికలు ఆశ్రయించాలి. వాటిలో చిక్కేమిటంటే నేపథ్యం రాయరు. అది మనకు అంతకుముందే తెలుసు అనుకుని రాస్తారు. 'ది లెజెండరీ నబేందు ఘోష్ వన్స్ ఫాట్ విత్ మానిక్‌దా..' అంటూ ఏదో వుంటుంది. ఈ నబేందు ఘోష్ ఎవడో తెలియదు. ఏ విషయంలో లెజెండో తెలియదు. మానిక్‌దా అంటే సత్యజిత్ రాయ్ అని తెలియదు. ఎవరైనా ఏదైనా చెపితే మనకు పరిచితమైన పరిమిత విషయాలనుంచి ఓపిగ్గా విస్తరిస్తూ పోతేనే మనకు సుఖం. తెలుగువాళ్లకోసం అంటూ ప్రత్యేకంగా వాళ్లు పత్రికలు నడపరు కదా. యూసుఫ్భాయ్ అంటే దిలీప్‌కుమార్ అని ఎంతమంది తెలుగువాళ్లకు తెలుస్తుంది? ఆ మాటకొస్తే చాలామంది తెలుగు జర్నలిస్టులకు కూడా చాలా విషయాలు తెలియవు. అందువల్ల ఎవరైనా పోయినప్పుడు న్యూస్ ఏజన్సీ రిపోర్టును యథాతథంగా అనువదించేస్తారు. సినిమా పేర్లు ఇంగ్లీషులో చదివి తప్పులు తడకలుగా తెలుగులో రాసేస్తారు. అన్నీ కరక్టుగా రాసిన అసలు సమాచార సేకరణ అనేది ఎంత కష్టమో చెప్పడానికి ఓ సంఘటన చెప్తాను.
''రామ్ ఔర్ శ్యామ్'' (1967) అని దిలీప్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన ఓ హిందీ సినిమా వచ్చింది. మన ఎన్టీయార్ ''రాముడు-భీముడు''(1964) సినిమా తెలుసుగా, దాన్ని తమిళంలో ''ఎంగవీట్టు పిళ్లయ్'' అనే పేరుతో ఎంజీయార్తో తీశారు. సూపర్ హిట్ అయింది. దాన్ని హిందీలో తీద్దామనుకుని విజయా ప్రొడక్షన్స్ (నాగిరెడ్డి – చక్రపాణి) వాళ్లు దిలీప్ కుమార్‌ని బుక్ చేసుకున్నారు. తెలుగు, తమిళ వెర్షన్లు డైరక్టు చేసిన తాపీ చాణక్యే హిందీ వెర్షన్ కూడా డైరక్టు చేశారు. ''రాముడు-భీముడు'' సినిమాకు రచన చేసినది డి.వి.నరసరాజుగారు. ''రామ్ ఔర్ శ్యామ్'' షూటింగు మద్రాసులో జరిగింది కాబట్టి దిలీప్ కుమార్ భార్యాసమేతంగా మద్రాసులోనే కాంప్ వేశాడు. అతనికి నాగిరెడ్డిగారు నరసరాజు గార్ని పరిచయం చేసి ఆ సినిమా నిర్మాణం జరిగేటప్పుడు సహకరించమన్నారు కాబట్టి దాని గురించి జరిగిన అనేక తమాషాలు తన 'తెర వెనుక కథలు' పుస్తకంలో గ్రంథస్తం చేశారు రాజుగారు.
''రాముడు – భీముడు'' సినిమాలో జమున వేసిన పాత్రను ''రామ్ ఔర్ శ్యామ్'' సినిమాలో వహీదా రెహమాన్ వేశారు. అసలు ఆ పాత్రకు బుక్ చేసినది వైజయంతీమాలను. కానీ ఆవిడ ఆ సినిమానుండి తప్పుకుంది. ఆవిడ స్థానంలో వహీదా వచ్చింది. ఇంతవరకు అందరికీ తెలుసు. అయితే వైజయంతీమాల ఎప్పుడు తప్పుకుంది, ఎందుకు తప్పుకుంది అన్నది తెలుసుకోవడం మనకు ఉత్సుకత కలిగిస్తుంది కదా. దాని గురించి దిలీప్ కుమార్‌పై పుస్తకం రాసిన సంజిత్ నార్వేకర్ అనే ఆయన రాసిన దాని ప్రకారం –
'దిలీప్‌కుమార్ మొట్టమొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు కాబట్టి హీరోయిన్లుగా వైజయంతీమాల, మాలా సిన్హాలను బుక్ చేయమన్నాడు. నిర్మాత నాగిరెడ్డి చెరొకరికీ లక్ష రూపాయలు సైనింగ్ అమౌంట్ యిచ్చి బుక్ చేశారు. కానీ ఎక్కడో ఏదో గడబిడ జరిగి షూటింగ్ షెడ్యూలు తారుమారయింది. అప్పుడు నాగిరెడ్డి దిలీప్‌తో కూచుని మళ్లీ సరికొత్తగా అతని కాల్షీట్లతో ఓ షూటింగు షెడ్యూల్ తయారుచేసుకుని అది చేతబట్టి వైజయంతీమాల వద్దకు వెళ్లారు. 'ఈ తేదీల్లో దిలీప్ కాల్షీట్లు యిచ్చారు కాబట్టి మీరూ యివ్వండి' అన్నారు. తన డేట్లను దిలీప్‌కుమార్ డేట్లతో అడ్జస్టు చేసుకోమంటున్నందుకు కోపం వచ్చిన వైజయంతీమాల 'ఇఫ్ దిలీప్ కుమార్ యీజ్ దిలీప్ కుమార్, దెన్ ఐ యామ్ వైజయంతిమాలా' అని డేట్స్ యివ్వననేసింది. దాంతో ఫైనల్‌గా వహీదాను తీసుకున్నారు. తర్వాత మాలా సిన్హాకు బదులు ముంతాజ్‌ను తీసుకున్నారు.' ఇదీ సంజిత్ నార్వేకర్ కథనం.
ఇక నరసరాజుగారి కథనం ప్రకారం వైజయంతిమాల షూటింగుకి వచ్చింది. అప్పటికే దిలీప్‌కుమార్ దర్శకుణ్ని తోసిరాజని తానే డైరక్టు చేసే పద్ధతి మొదలెట్టేసేడు. ''రామ్ ఔర్ శ్యామ్'' లో కూడా చాణక్యను హీరో స్థానంలో నిలబెట్టి, బార్ట్లే చేత లైటింగ్ చేయించి, తను కెమెరా వెనుక కూర్చుని ట్రాలీ తోయించి, దర్శకుడు చేయవలసిన పని తను చేసేవాడు. మొదటిరోజు షూటింగు తర్వాత వైజయంతిమాల నాగిరెడ్డిగారి గదికి వచ్చి ''ఈ పిక్చర్‌కి డైరక్టరు చాణక్యా? దిలీప్కుమారా?'' అని అడిగింది. నాగిరెడ్డిగారు బదులు చెప్పలేకపోయారు. ''ఇలా దిలీప్‌కుమార్ దర్శకుడిగా పనిచేస్తే యీ పిక్చర్లో నేను నటించను'' అని ఖచ్చితంగా చెప్పి వెళ్లిపోయింది. దిలీప్‌కు యీ విషయం తెలిసింది. రెండోరోజు షూటింగ్ కాన్సిల్ అయింది. ఆ తరువాత వైజయంతిమాల నాగిరెడ్డిగారికి చెప్పి బొంబాయికి విమానం టిక్కెట్టు తెప్పించుకుని వెళ్లిపోయింది. హిందీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేత ఒక తీర్మానం పాస్ చేయించింది – 'రామ్ ఔర్ శ్యామ్' సినిమాలో అసోసియేషన్ సభ్యులెవరూ నటించగూడదు అని. నాగిరెడ్డిగారు బొంబాయి వెళ్లి సినీరంగ ప్రముఖులను కలిశారు. 'రెడ్డిగారూ, యీ సినిమా మీరు డ్రాప్ చేసుకుంటే మేలు' అన్నాడు ఫెడరేషన్ చైర్మన్.
నాగిరెడ్డి మద్రాసు తిరిగి వచ్చి హైకోర్టులో కేసు వేసి స్టే తీసుకున్నారు. బొంబాయి నిర్మాతలు, ఆర్టిస్టులు కలుగజేసుకుని రాజీ కుదిర్చారు. దాని ప్రకారం వైజయంతీమాలకు సినిమాలో నటించక పోయినా పారితోషికం మొత్తం యిచ్చేయవలసి వచ్చింది. అప్పుడే అసోసియేషన్ సభ్యులు సినిమాలో నటించారు. దీనివల్ల నిర్మాతకు అదనపు భారం కదా! అంతా దిలీప్ కుమార్ నిర్వాకం వల్లనే కదా! ఈ విషయాన్ని దిలీప్ కథను గ్రంథస్తం చేసినతను దాచాడు. బహుశా దిలీప్ చెప్పి వుండడు. ఈ సంఘటన రెండూ వెర్షన్లూ మనకి తెలిస్తే నరసరాజుగారు చెప్పిన ఉదంతమే కరక్టని తెలుస్తుంది. తెలుగు రానివాడికి యీ సంగతి తెలియదు కదా, ఇంగ్లీషు, హిందీల్లో దిలీప్ కథ చదివినవాడు వైజయంతిమాల పొగరుబోతుతనంతో సినిమా వదులుకుందని అనుకుంటాడు, తప్ప డైరక్టరే సినిమాకు కెప్టెన్ అన్న సిద్ధాంతానికి కట్టుబడిందని అనుకోడు. (సశేషం)
ఫోటో – ''రామ్ ఔర్ శ్యామ్''లో దిలీప్, వహీదా
-ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)