మొన్న జహీర్‌ఖాన్.. నిన్న వీరేందర్ సెహ్వాగ్.. రేపు ఇంకెవరో.! ఒకరి తర్వాత ఒకరు క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు. క్రికెట్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫిట్నెస్ వుండాలి. 30 ఏళ్ళు పైబడ్డాయంటే, ఇక వారి కెరీర్ ఏడాదికో, రెండేళ్ళకో, నాలుగేళ్ళకో ముగియాల్సిందే. 34 దాటాక ఏ క్షణాన అయినా క్రికెట్‌కి వీడ్కోలు పలకాల్సిందే. ఎందుకంటే, 35 దాటిన తర్వాత శరీరం పూర్తిగా సహకరించదు. అతి కొద్ది మంది మాత్రమే 36, 37 ఏళ్ళ వరకూ క్రికెట్ ఆడగలుగుతారు. చాలా అరుదుగా 38 నుంచి 40 వరకు క్రికెట్ ఆడిన సందర్భాలూ చూశాం. 40 తర్వాత ఇక క్రికెట్లో ఆడతామని ఎవరైనా ఆశిస్తే, అది అత్యాశే అవుతుంది.
వయసుకన్నా క్రికెట్‌కి మనసుతో పని ఎక్కువ. మానసిక బలం వుంటేనే పాతికేళ్ళ ఆటగాడైనా, పూర్తి ఫిట్నెస్తో, పూర్తి కాన్ఫిడెన్స్‌తో మైదానం ఆడగలుగుతాడు. మానసికంగా ఇబ్బందుల పాలైతే అంతే సంగతులు. కెరీర్ పట్టుమని పది మ్యాచ్‌లు కూడా ఆడకుండానే అటకెక్కుతుంది. కానీ, ఆ మానసిక స్థయిర్యం దెబ్బతినడంలో అనేక కారణాలుంటాయి. ప్రధానంగా బోర్డు (బీసీసీఐ) నిర్ణయాలు భారత క్రికెటర్లకు శాపంగా మారుతున్నాయి.
కొందరికి పదే పదే ఛాన్సులొస్తాయి. కొందరికి అసలు ఛాన్సులే రావు. కొందరికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంది బీసీసీఐ. అసలు సెలక్టర్లు ఎలా జట్టుని ఎంపిక చేస్తారో అర్థం కాక జనం తల పట్టుక్కూర్చుంటారు. బాగా ఆడుతున్న క్రికెటర్ని రిజర్వ్ బెంచ్‌కి పరిమితం చేయడం, వన్డే ఆటగాడ్ని టెస్టుల్లో, టెస్టు ఆటగాడ్ని టీ20ల్లో ఆడించి, ఆయా ఆటగాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంటారు.
ఇక, కెరీర్లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుని టీమిండియాకి వెన్నుదన్నుగా నిలిచిన ఆటగాళ్ళను సైతం 'వైట్ ఎలిఫెంట్' అనే మద్ర వేసి, క్రికెట్‌కి దూరం చేయడంలో మన బీసీసీఐ ప్రదర్శించే తెలివితేటలు అన్నీ ఇన్నీ కావు. గంగూలీని ఎలా ఇంటికి పంపించేశారో అందరం చూసేశాం. ఇర్ఫాన్ పటాన్ సంగతీ అంతే. కెప్టెన్ కన్నెర్రజేస్తే, అది బీసీసీఐకి నచ్చితే, ఏ ఆటగాడైనా సరే, చిన్న ఫిట్నెస్ సమస్యతో క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. యువీ విషయంలో అదే జరిగింది. సెహ్వాగ్ కూడా అంతే. జహీర్‌ఖాన్ సంగతీ సరే సరి.
అసలు గంభీర్‌కి ఏమయ్యింది.? టీమిండియాకి డాషింగ్ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్న గంభీర్, సెహ్వాగ్లది ఒకటే పరిస్థితి. సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత అందరి దృష్టీ గంభీర్‌పై పడింది. రేపో మాపో గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆటగాళ్ళు ఏమనుకుంటున్నారు.? అన్న ఆలోచన బీసీసీఐకి వుండటంలేదు. భారత జట్టుకి తిరుగులేని విజయాలు అందించిన ఆటగాళ్ళ విషయంలో బీసీసీఐ నిర్లక్ష్యం అనేక విమర్శలకు తావిస్తోంది.
ఏ ఆటగాడూ యాభయ్యేళ్ళొచ్చేదాకా క్రికెట్ ఆడాలనుకోడు. సచిన్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. 'ఉరితీసే ముందూ చివరి కోరిక ఏంటో అడుగుతారు.. క్రికెట్లో అలా కాదు, తమ ఘనత తెలిసీ, అవమానిస్తారు, తమంతట తాముగా క్రికెట్ నుంచి తప్పుకునేలా చేస్తారు..' అని ఎందరో క్రికెటర్లు తమ సన్నిహితుల వద్ద వాపోవడం చూస్తూనే వున్నాం. సెహ్వాగ్, జహీర్‌ఖాన్ విషయంలోనూ ఇదే జరిగిందనే ప్రచారం తెరపైకొచ్చింది. ఇక, బీసీసీఐతో వేగలేమనే నిర్ణయానికి వచ్చి వీరిద్దరూ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశారన్నదే నిజమా.? నిజమైతే మాత్రం బీసీసీఐ క్షమించరాని నేరం చేస్తున్నట్టే.