రోమ్‌లో జండా వున్న ఓ యింటి కిటికీ చూపించి యిక్కడే ముస్సోలినీ నిలబడి ప్రసంగాలు చేసేవాడు అన్నారు. అతనెవడో తెలిస్తే కదా, మనం ఆ కిటికీ కేసి ఆసక్తిగా చూసేది. ఇంకో యిల్లు చూపించి నెపోలియన్ తల్లి యిక్కడే వుండేది అన్నారు. నెపోలియన్ ఎవరో తెలియాలి, తెలిస్తే అతను ఫ్రాన్సు వాడు కదా, తల్లి ఇటలీలో వుండడమేమిటి? అన్న సందేహం వస్తుంది. ఆవిడ కథ అప్పటికప్పుడు ఎవరు చెప్తారు? ఇంకో చిక్కేమిటో చెప్పనా – నగరంలో ప్రముఖ భవనాలన్నీ ఒకే చోట కుప్పపోసినట్లు వుంటాయి. బస్సు అక్కడ ఆపడానికి వుండదు. ఒక్కో దాని గురించి వివరంగా చెప్పలేరు. హింట్లు యిచ్చినట్లు చెప్పేస్తారు. బోధపడినవాడికి బోధపడినంత మహదేవా! జన్మానికో శివరాత్రిలా ఎంతో ప్లాను చేసుకుని మనం ఆ దేశం వెళ్లాక అన్నీ చూసి రాకుండా మొద్దు రాచ్చిప్పలా తిరిగి వచ్చామనుకోవడం సిగ్గుచేటు అనుకునేవాళ్ల కోసం యీ సీరీస్ రాస్తున్నాను. సిగ్గు పడనివాళ్లు బేఫర్వాగా వుండవచ్చు. తిరిగి వచ్చాక 'అక్కడ మనుషులు తెల్లగా వున్నారు, బిల్డింగులు ఎత్తుగా వున్నాయి, రోడ్లు శుభ్రంగా వున్నాయి' అని యింటి పక్కవాళ్లకు చెప్పుకుని తృప్తిపడవచ్చు.
పరదేశాల్లో అనేక మ్యూజియాల్లో పెద్దపెద్ద పెయింటింగ్స్ వుంటాయి. వాటిల్లో గ్రీకు, రోమన్ పురాణగాథలు చిత్రించి వుంటాయి. కొందరి కథలైనా తెలియకపోతే ఆ బొమ్మల్లో కనబడే భావాలు అర్థం చేసుకోలేం. రవివర్మ వేసిన మేనకా విశ్వామిత్రుల పెయింటింగ్‌ను హిందూమతం గురించి తెలియనివాళ్లు పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. అలాగే మనకు ఆ గ్రీకు, రోమన్, హీబ్రూ పురాణపాత్రల పెయింటింగ్స్ అయోమయం, గందరగోళం. ఎంత పెద్దగా వుందో అనుకుంటూ ముందుకు సాగిపోతాం. బైబిల్ కథలు సీరీస్‌లో బైబిల్ కథలకు సంబంధించిన కొన్ని ప్రఖ్యాత పెయింటింగ్స్ యిచ్చాను. మ్యూజియంలో అవి కనబడినపుడు గుర్తు పట్టవచ్చు. ఈ సీరీస్‌లో యూరోప్‌లో నేను చూసిన స్థలాల చరిత్ర గురించి, స్థలాల గురించి చెపుదామని వుంది. స్పందన బాగా వుంటే కొన్ని ప్రఖ్యాత చిత్రాలను, కళారూపాలను కూడా పరిచయం చేద్దామని వుంది. ఆ తర్వాత నేను ఎలా వెళ్లానో స్వీయానుభవాలతో ట్రావెలాగ్ రాస్తాను. దానిలో ఏదైనా పేరు ప్రస్తావిస్తే యీ సీరీస్‌లో దాని గురించి రాసిన భాగం కనబడేట్లా హైపర్ లింక్ యిమ్మనమని వెబ్‌సైట్ వారిని కోరతాను. అప్పుడు పాఠకులకు యిది ఉపయోగపడుతుంది. ఈయన వెళ్లిన వూరే మనమూ వెళతామనేముంది, యిదెందుకు చదవడం అనుకుని సందేహించేవారి కోసం ఓ ఉదంతం చెప్తాను.
నేను కలకత్తాలో వుండగా ప్రఖ్యాత ఫ్రెంచ్ శిల్పి రోదా (స్పెల్లింగ్ ఆర్‌ఓడిఐఎన్) శిల్పాల ఎగ్జిబిషన్ చూశాను. ఆయన శిల్పాలు పారిస్‌లోని మ్యూజియంలోనే వుంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వున్న ఆయన అభిమానుల కోరిక మేరకు 1983లో కొన్ని శిల్పాలను ప్రపంచమంతా దేశానికి ఒక్క నగరం చొప్పున తిప్పి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇండియాలో కళాభిమానులు కలకత్తాలో ఎక్కువ వున్నారనుకున్నారేమో అక్కడకు తెచ్చారు. టిక్కెట్టు కూడా ఎక్కువే. ఆయన గీసిన థింకర్ (బొమ్మ పక్కన యిస్తున్నాను) చాలా మంది చూసే వుంటారు. అదే కాకుండా చాలా గొప్ప శిల్పాలు చెక్కాడాయన. బాపు గారు పరిచయమయ్యాక ఆయనతో రోదా ప్రదర్శన చూశానని చెపితే 'అది చూసినందుకు మీ పాదాలకు నమస్కారం పెట్టాలండి' అన్నారు. (కంగారు పడవద్దు, బాపుగారు వెక్కిరించలేదు, నచ్చిన విషయంలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అలాగే వుంటాయి). 'అబ్బో రోదా' అనుకున్నాను. పారిస్‌లో కండక్టడ్ టూరులో గైడ్ అన్నిటి గురించి చెప్తున్నాడు కానీ యీ మ్యూజియం గురించి చెప్పటం లేదు. (పారిస్ నిండా మ్యూజియాలే, ఎన్నిటి గురించి చెప్తాడు పాపం!)
ఓ చోట బస్సు దిగినప్పుడు దగ్గరకు వెళ్లి అదెక్కడ అని అడిగాను. ఆయన ఎంతో సంతోషించాడు. కాస్సేపు పోయాక దాని పక్కనుంచి వెళ్లినపుడు 'ఒకాయన రోదా గురించి అడిగాడు, ఆయన మ్యూజియం కుడిపక్కన కనబడుతోంది చూడండి, ఆయన ప్రఖ్యాత శిల్పం 'థింకర్' బయటి కాంపౌండులోనే వుంది, చూడండి' అన్నాడు. అందరం చూశాం. నేను అడిగి వుండకపోతే ఆ విగ్రహాన్ని మా బస్సులో వాళ్లు ఎవరూ చూసి వుండేవారు. గైడ్‌తో మాట్లాడేటప్పుడు మా ఆవిడ తన అభిమాన రచయిత అలెగ్జాండర్ డ్యూమా రచనల గురించి, పాత్రల గురించి మాట్లాడితే ఆయన పులకించిపోయాడు. బస్సులో అందరికీ డ్యూమా గురించి కాస్త చెప్పాడు. పారిస్‌లో ఆయన విగ్రహం వుందని, ప్రస్తుతం మనం అటువైపు వెళ్లడం లేదనీ చెప్పాడు. శ్రోతల్లో కాస్త తెలిసుండి, యింకా తెలుసుకోవాలన్న ఉత్సుకత గలవారు ఒకరున్నా గైడ్‌కు హుషారు వస్తుంది. మరో నాలుగు విషయాలు చెప్తాడు. ఇచ్చిన ఫీజు కిట్టుబాటవుతుంది. ఏమో ఎవరు చూడవచ్చారు, అలాటి ఆసక్తి రగిలించే టూరిస్టు మీరే కావచ్చు.
ఇక ఫారిన్ టూరు యోగం వుందా లేదా అన్నది ఎవరూ చెప్పలేరు. నేను ఫారిన్ వెళతానని అనుకోలేదు. 2013లో తానా సమావేశానికి విశిష్ట అతిథిగా రమ్మనమని పిలుపు వచ్చింది. పాస్‌పోర్టయినా లేదు అని చెప్పి తప్పించుకోబోయాను. అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఎమ్వీయల్ ప్రసాద్ గార్లు వదిలిపెట్టలేదు. మొహమాటానికి పాస్‌పోర్టు తీసుకుని వీసాకు అప్లయి చేశాను. అమెరికా వాడికి ఏం పుట్టిందో ఏమో వీసా తిరస్కరించాడు. చింతించలేదు. ఇండియా చుట్టబెట్టినా చాలనుకున్నాను. అలాటిది 2014లో ఒకసారి, 2015లో యింకోసారి యూరోప్ వచ్చాను. ఏది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. వెళితే గిళితే… అనుకుని అన్నీ తెలుసుకుని పెట్టుకుంటే ఎప్పటికో అప్పటికి పనికి రావచ్చు. ఈ సీరీస్‌లో నేను ప్రస్తావించబోయే పేర్లు మీ తలలో ఎక్కడో అక్కడ అతుక్కుంటాయి. మీరు ఫారిన్ వెళ్లినపుడు ఆ పేర్లు తగిలితే 'ఏదో విన్న పేరులా వుందే' అని తోచినా దీన్ని చదివిన శ్రమ కిట్టుబాటయినట్లే. ఎందుకంటే ఒకేసారి అప్పటిదాకా వినని కొత్త పేర్లు పుంఖానపుంఖాలుగా వచ్చి పడుతూ వుంటే మైండ్ రిసీవ్ చేసుకోవడం మానేస్తుంది.
దీనిలో ఒక్కో వూరు గురించి క్రమపద్ధతిలో రాసుకుని వద్దామని అనుకోవటం లేదు. ఎప్పుడు దేని గురించి చెప్పాలనిపిస్తే చెప్పేస్తాను. పారిస్‌తో మొదలుపెడతాను. ఐఫిల్ టవర్ ఎత్తు యింత, ఫలానా సంవత్సరంలో కట్టారు లాటివి చెప్పడం కంటె రాజులు, రాజద్రోహులు, కుట్రదారులు, విప్లవకారులు పరంగా చరిత్ర చెప్పుకుంటే ఆసక్తికరంగా వుంటుంది. పేర్లు గుర్తుండకపోయినా కథ మనసులో నాటుకుంటుంది. ఆ చరిత్రతో సంబంధం వున్న ప్రదేశాలకు వెళ్లినపుడు కుతూహలంగా వింటాం. అందుకని ఫ్రెంచ్ విప్లవంతో మొదలుపెడతాను. తప్పులుంటే చెపుతూ వుండండి. ముఖ్యంగా పేర్ల ఉచ్చారణ విషయంలో ఆ యా దేశాలలో వుండే పాఠకులు పొరపాట్లు సవరిస్తే నాతో పాటు యితర పాఠకులూ సంతోషిస్తారు. విప్లవానికి కారణం ఏమిటి, ఎలా సంభవించింది, ఎందుకు విఫలమైంది, దానిలో జరిగిన మంచేమిటి, చెడేమిటి యివన్నీ విపులంగా అర్థమయ్యేందుకు చార్లెస్ డికెన్స్ రాసిన కాల్పనిక నవల ''ద టేల్ ఆఫ్ టూ సిటీస్'' కథను చివర్లో జోడిస్తాను. (సశేషం)
ఫోటో – రోమ్‌లో నెపోలియన్ తల్లి వున్న భవనం, ముస్సోలినీ ప్రసంగించిన కిటికీ (జండా వున్నది), పారిస్‌లో రోదా మ్యూజియంలో థింకర్ విగ్రహం, డ్యూమా విగ్రహం
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)