సినిమా రివ్యూ: జాదూగాడు

రివ్యూ: జాదూగాడు రేటింగ్‌: 2/5 బ్యానర్‌: సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: నాగశౌర్య, సోనారిక, అజయ్‌, జాకీర్‌ హుస్సేన్‌, రవి కాలే, ఆశిష్‌ విద్యార్థి, కోట శ్రీనివాసరావు, సప్తగిరి, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, సత్య తదితరులు కథ,…

రివ్యూ: జాదూగాడు
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నాగశౌర్య, సోనారిక, అజయ్‌, జాకీర్‌ హుస్సేన్‌, రవి కాలే, ఆశిష్‌ విద్యార్థి, కోట శ్రీనివాసరావు, సప్తగిరి, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, సత్య తదితరులు
కథ, మాటలు: మధుసూదన్‌
సంగీతం: సాగర్‌ మహతి
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాత: వి.వి.ఎన్‌. ప్రసాద్‌
కథనం, దర్శకత్వం: యోగేష్‌
విడుదల తేదీ: జూన్‌ 26, 2015

లవర్‌బాయ్‌ పాత్రలతో పరిచయమై, పేరు తెచ్చుకున్న హీరోల్లో చాలా మందికి తమని తాము మాస్‌ క్యారెక్టర్‌లో చూసుకోవాలని, ఒక నాలుగైదు ఫైట్‌ సీన్లు చేయాలని వుంటుంది. అలాంటి ఎటెంప్ట్స్‌లో ఫెయిల్‌ అయిన వాళ్లు చాలా మంది ఉన్నా కానీ తమకి అలాంటి సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదులుకోరు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాల్లో సాఫ్ట్‌ క్యారెక్టర్లు చేసి మెప్పించిన యువ హీరో నాగశౌర్య ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలోనే ఫైట్లు ట్రై చేసాడు. ఈసారి ‘జాదూగాడు’గా ఫుల్లీ మాస్‌ అవతారమెత్తాడు. ఒక రాజు ఒక రాణి, చింతకాయల రవిలాంటి ఫెయిల్యూర్స్‌ తీసిన యోగి తన పాత తప్పుల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని చూపించాడు. 

‘జాదూగాడు’ మొదలవడం ఇంట్రెస్టింగ్‌గానే మొదలవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్‌, అతని అడ్వంచర్స్‌ ఫర్వాలేదనే అనిపిస్తాయి. మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ బతకలేనని, కొడితే జాక్‌పాట్‌ కొట్టాలనే మెంటాలిటీ ఉన్నోడు (శౌర్య) లోన్‌ రికవరీ బిజినెస్‌ మొదలు పెడతాడు. తనకి పెద్ద రౌడీ అండ వుంటే పని సులువైపోతుందని అలాంటోడి (జాకీర్‌ హుస్సేన్‌) దగ్గర చేరతాడు. అయితే ఇతడినే బినామీగా పెట్టుకుని రెండు వేల కోట్ల ప్లాన్‌ వేస్తాడా రౌడీ. టైటిల్‌ని బట్టి ఫైనల్‌గా ఏం జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

పది, పదిహేను నిముషాల పాటు వినోదాత్మకంగానే వున్నా ఆ తర్వాతే మొదలవుతుంది నస. ఏ సీన్‌ ఎందుకుందో, ఏ క్యారెక్టర్‌ వల్ల ఉపయోగం ఏంటో అర్థం కాకుండా తెర నిండా వివిధ రకాల విచిత్రమైన పాత్రలతో, అర్థం లేని సంభాషణలతో ‘జాదూగాడు’ ఇంటర్వెల్‌ కోసం డెస్పరేట్‌గా ఎదురు చూసే స్కూల్‌ పిల్లల పరిస్థితి తీసుకొస్తుంది. సినిమా అంతటినీ క్లయిమాక్స్‌ ట్విస్ట్‌ మీద బేస్‌ చేసుకుని తీసారు. అయితే ఆ ట్విస్ట్‌ పండడానికి తగ్గ ప్లాట్‌ఫామ్‌ మాత్రం సెట్‌ చేసుకోలేదు. హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూనే చాలా కన్నింగ్‌ అని చూపించేసారు. అతని ఇంటెన్షన్స్‌, క్యారెక్టరైజేషన్‌ అన్నీ క్లియర్‌గా ఎస్టాబ్లిష్‌ చేసిన తర్వాత సడన్‌గా తన పాత్ర చిత్రణలో మార్పు తీసుకొచ్చి, పాసివ్‌గా మార్చేసి.. క్లయిమాక్స్‌లో ట్విస్ట్‌ ఇవ్వగానే సర్‌ప్రైజ్‌ అవ్వమంటే ఎలా అవుతారు. అసలు టైటిల్‌లోనే జాదూగాడు అని చెప్పేసిన తర్వాత అతను చేస్తున్న జాదూ ఏంటనేది ఆమాత్రం ఊహించలేరని ఎలా అనుకుంటారు? 

ఆ బినామీల వ్యవహారమేంటో, దానికి వాళ్లు వేసే స్కెచ్చులేంటో, మధ్యలో పోలీసుల హడావిడి ఏంటో, ఇవన్నీ చాలవన్నట్టు హీరోగారి సిన్సియర్‌ లవ్వేంటో.. యోగేష్‌ దర్శకుడిగా మరోసారి తన బలహీనతలన్నీ బయట పెట్టుకున్నాడు. ఇంతకుముందు స్టార్స్‌తో చేసాడు కాబట్టి తన తప్పులు కొంతవరకు కవర్‌ అయ్యాయేమో కానీ ‘జాదూగాడు’ మాత్రం వాటిని మాగ్నిఫయింగ్‌ గ్లాస్‌లో హైలైట్‌ చేసింది. నాగశౌర్య మంచి నటుడే కానీ ఇలాంటి మాసీ పాత్రలని మోసే అనుభవం, ఆహార్యం తనకి లేవు. తన శాయశక్తులా కృషి చేసినా కానీ ‘హీరోలా’ అనిపించాల్సిన చోట తేలిపోయాడు. తన స్ట్రెంగ్త్‌కి స్టిక్‌ ఆన్‌ అయితే నాగ శౌర్యకి ఈ యాక్షన్‌ కష్టాలు తప్పుతాయి. 

సోనారికకి నటించడం రాదు. బేసిక్‌ ఎమోషన్స్‌ కూడా ఎక్స్‌ప్రెస్‌ చేయలేదు. జాకీర్‌ హుస్సేన్‌ బఫూన్‌లాంటి పవర్‌ఫుల్‌ విలన్‌. అజయ్‌ది అగమ్య గోచర క్యారెక్టర్‌. తన పాత్ర స్వభావం ప్రతి సన్నివేశానికీ మారిపోతూ వుంటే అతను చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. కోట, ఆశిష్‌, రవి కాలే ఇలా చెప్పుకోవడానికి బోలెడంత మంది టాలెంటెడ్‌ యాక్టర్లు ఇందులో పూర్తిగా వృధా అయ్యారు. సప్తగిరితో మామూలు కామెడీ పండడం లేదని వయాగ్రా స్టంట్‌ చేయించినట్టున్నారు. చీప్‌. వర్కవుట్‌ అవలేదు. సాగర్‌ మహతి నేపథ్య సంగీతం, సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రహణం మాత్రమే అంతో ఇంతో మెచ్చుకోతగ్గ అంశాలు. 

లాజిక్‌ మాట అటుంచి కనీసం ముందు సీన్లో ఏం జరిగిందో, తర్వాతేం కంటిన్యూ చేస్తున్నామో అనే బేసిక్‌ కామన్‌సెన్స్‌ కూడా చూపించలేదు. ఉదాహరణకి ఆ ముందు సీన్లోనే హీరో కాలికి బుల్లెట్‌ గాయమవుతుంది. నెక్స్‌ట్‌ సీన్లో సాంగ్‌ వేసుకుని బ్రేక్‌ డాన్స్‌ వేసేస్తాడు. కన్వీనియంట్‌గా డ్రీమ్‌ సాంగ్‌ అయినా పెట్టుకోకుండా సిట్యువేషనల్‌ డ్యూయెట్‌ ప్లాన్‌ చేసుకున్నారక్కడ. రవి కాలే తన వెంట పడతాడని ఊహించలేదంటాడు హీరో. కానీ అతడిని ఉసికొల్పేదే తను ప్లాంట్‌ చేసిన అజయ్‌ అన్నది ముందే చూపించారు. ఏం రాసుకున్నారో, ఏం తీస్తున్నారో కూడా తెలీకుండా సీన్‌కో రకంగా అనిపించే ఈ చిత్రం స్టార్టింగ్‌ సీన్స్‌ తర్వాత ఏ పాయింట్‌లోను బెటర్‌ అవలేదు సరికదా ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతుంది. హీరో చేసే జాదూకి థ్రిల్‌ అవ్వాల్సింది పోయి దీనికోసం థియేటర్‌కి వచ్చినందుకు మనపై మనమే జాలి పడేట్టు చేస్తుంది. 

బోటమ్‌ లైన్‌: ఈ జాదూ.. మన వల్ల కాదు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri