గతంలో వేరే భాషలో ఒక సినిమా హిట్ అయిందంటే దానిని రీమేక్ చేసేయడానికి చాలా మంది హీరోలు పోటీ పడిపోయేవారు. కానీ ఇప్పుడు రీమేక్ చేయండర్రా అంటూ వెంట పడుతున్నా కానీ హీరోలు ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ధనుష్ నటించిన ‘వేల ఇల్లా పట్టదారి’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది.
దీనిని తెలుగులో రీమేక్ చేయాలని ఎంతగా ప్రయత్నించినా కానీ కుదర్లేదు. రామ్ ఈ చిత్రం చేయాలా వద్దా అంటూ తర్జనభర్జనలు పడి ఫైనల్గా నో చెప్పేసాడు. దాంతో ‘విఐపి’ని తెలుగులోకి ‘రఘువరన్ బిటెక్’ పేరుతో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. ధనుష్కి ఇక్కడ అంత మార్కెట్ లేదు కాబట్టి ఈ సినిమా నుంచి సంచలనాలేమీ ఆశించక్కర్లేదు.
మరోవైపు విజయ్ నటించిన బ్లాక్బస్టర్ ‘కత్తి’కి కూడా మన హీరోలు మూకుమ్మడిగా నో చెప్పారు. పవన్, ఎన్టీఆర్, బన్నీ, మహేష్ అందరూ కాదనడంతో ‘కత్తి’ ఇంకా అలాగే పెండింగ్లో ఉంది. చివరకు దీనిని కూడా అనువదించి విడుదల చేసేస్తారేమో అనిపిస్తోంది. మన హీరోలకి సడన్గా రీమేక్ సినిమాలపై ఇంత ఎవర్షన్ ఎందుకొచ్చిందో మరి.