ఒక సినిమా అవకాశం వస్తే ఆ పాత్ర ,అది తనకు తెచ్చే పేరు వగైరాలను ఎంచుకుని అత్యంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు తారలు. ఈ విషయంలో స్టార్స్ మరింత జాగ్రత్తగా ఉంటారు. తమని వరించి వచ్చిన పాత్రల్ని విపరీతంగా స్క్రూటినీ చేసి మంచి పాత్రల్ని కూడా వదులుకున్న దృష్టాంతాలు ఎన్నో.
ఇలాంటి పరిస్థితుల్లో… టాలీవుడ్ సగటు స్టార్ హీరో ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించాడు అల్లు అర్జున్. ఒక మంచి పాత్ర కోసం తనే ఒక మెట్టు దిగాడు. తనే అడిగి మరీ ఆ పాత్రను వరించాడు. ఇప్పుడా పాత్రనే ఆ సినిమాకు ప్రాణవాయువుగా మార్చాడు.
రుద్రమదేవి సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. అందులో హీరోగా నటించాలనంటే కూడా పెద్దగా స్టార్‌డమ్ లేని హీరోలు మాత్రమే సిద్ధపడతారు. ఇది గతంలో వచ్చిన అరుంధతి సహా ఎన్నో సినిమాల్లో మనం చూశాం.
అలాంటిది ఒక కధానాయిక ప్రాధాన్యమున్న సినిమాలో అదీ హీరోగానూ కాక మరో పాత్ర. దీనిని కోరి వరించినప్పుడు బన్నీ గురించి ఎవరేం అనుకున్నారో, దీనికి పారితోషికం కూడా అడగలేదని చెప్పినప్పుడు ఇంకేం అనుకున్నారో తెలీదు గాని, ఈ చిత్రం విడుదలైన తర్వాత అర్ధమవుతోంది అందరికీ బన్నీ ఏమిటో… అతనిలో ఎంత గొప్ప విజ్ఞత దాగి ఉందో.
రుద్రమదేవి సినిమా చూసి వస్తున్న ప్రతి ఒక్కరినీ వెంటాడే పాత్ర గోనగన్నారెడ్డి. ఆ పాత్రను అద్భుతంగా పండించాడు బన్నీ. మనస్ఫూర్తిగా ఒక మంచి పాత్రను చేయాలని కోరుకుంటే ఎంత బాగా మెప్పించవచ్చో చేసి చూపించాడు. నాల్రోజులుగా సినిమా గురించి జనం మాట్లాడుతున్న మాటల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు.
ఇలా ఎంతైనా చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో అతని నటన, అది జనాల్ని మెప్పించడం… వీటికన్నా… ఇక్కడ ముఖ్యంగా టాలీవుడ్ హీరోల్లో చాలా మంది నేర్చుకోవలసింంది పాత్రల ఎంపిక కోసం తమ ఇమేజ్ చట్రాల్ని వదిలించుకుని బయటకు రావాలనేది.
కనీసం ఒక పాట కూడా తన మీద లేకపోయినా పట్టించుకోకుండా అప్పుడప్పుడు మెరిసి మాయమైపోయే పాత్రే అయినా పాత్ర సరైనదైతే..దాని నిడివితో, దానికి చేసే అదనపు అలంకారాలతో పనిలేదని నిరూపించాడు గోన గన్నారెడ్డి. బేష్ బన్నీ.