మొత్తానికి బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు యాభై రోజుల తరువాత బయటకు వస్తున్నారు. అనారోగ్య కారణాలు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ ఎలా తెచ్చుకున్నా, న్యాయం గెలిచింది.. నిజాయతీ నిలిచింది అనే అంటారు ఇప్పుడు. అది కాదు విషయం.
ఇప్పుడు ఈ విషయాన్ని జగన్ మరింత సాగదీస్తారా? ఇక్కడితో వదిలేస్తారా? అన్నది. నిన్నటికి నిన్న పెట్టిన మరో కేసు అయితే జగన్ మొండి వైఖరిని చాటి చెబుతోంది. కానీ ఎందుకొచ్చిన రగడ అనుకుంటే కోర్టులకు, లాయర్లకు ఈ వ్యవహారాన్ని వదిలేయవచ్చు.
కానీ ఒకటి మాత్రం వాస్తవం. జగన్ వదిలేస్తారా? పట్టుకుంటారా? అన్నది చంద్రబాబు అండ్ కో చేతలోనే వుంది. అనారోగ్యకారణాల వల్ల బయటకు వచ్చి, ఇప్పుడు బస్తీమే సవాల్ అంటూ మాటలు విసిరితే, కవ్విస్తే జగన్ కచ్చితంగా పంతాలకు పోతారు. అలా కాకుండా సైలంట్ గా తన పార్టీ, తన పనులు తాను చేసుకుంటూ వెళ్తే అది వేరుగా వుంటుంది.
కానీ పరిస్థితులు అవలోకిస్తే చంద్రబాబు మరోసారి లోపలకు వెళ్లడం అన్నది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి వాయిదాలు, వాదనలు, తీర్పులు ఇంకా ముందు ముందు వున్నాయి. ఈ కేసు విషయంలో లీగల్ గా కొన్ని తప్పులు చేసారు కనుక ఈసారి మిగిలిన కేసుల విషయంలో జాగ్రత్తగా వుంటారు అన్నది కూడా వాస్తవం. అందువల్ల జగన్ పట్టుపట్టినా మరోసారి చంద్రబాబు లోపలికి వెళ్లడం అన్నది కాస్త అసాధ్యమైన సంగతే.
ఎటొచ్చీ దీని వల్ల చంద్రబాబు తప్పులు బయట పెట్టడానికి జగన్ ప్రయత్నాలు సరిపోవచ్చు తప్ప మరోసారి జైలులోకి పంపడానికి కాకపోవచ్చు.