'పల్లెటూరి పిల్ల' అనే సినిమా వచ్చింది. దానికి మూలం 'పిజారో' అనే నవల. దానిలో ఎన్టీయార్ ఓ ప్రభువుకి నమ్మకమైన బంటు. ఆయన తరఫున ప్రజలను పీడించి పన్నులు వసూలు చేస్తూంటాడు. అప్పుడు అంజలి అతన్ని ఎదుర్కొంది. 'పొట్టకూటి కోసం యిలాటి పనులు చేయాలా? వచ్చి మాతో కలిసి పొలం దున్ని బతకకూడదా?' అని గడ్డి పెట్టింది. అతనిలో పరివర్తన వచ్చింది. వచ్చి సామాన్యజనంతో చేతులు కలిపాడు, అంజలితో కళ్లు కలిపాడు. మొదటిదానివరకూ ఫర్వాలేదు కానీ రెండోదానివల్ల అప్పటిదాకా అంజలిని మూగగా ప్రేమిస్తున్న నాగేశ్వరరావు యిబ్బంది పడ్డాడు. వెళ్లి యిదేమిటన్నాడు. అంజలి దులిపేసింది – నీ భావాలను మనసులోనే వుంచుకుంటే ఎలా? ఎప్పుడైనా చెప్పావా? అని. ఇంతలో రామారావు పాతప్రభువు అతని మీద పగ సాధించబోయాడు. నాగేశ్వరరావు ప్రాణత్యాగం చేసి రామారావును, అతని కుటుంబాన్ని కాపాడాడు. ఈ కథలో లవ్ ట్రయాంగిల్ వున్నా, ప్రజాపీడకుడి కొమ్ము కాసేవాడిలో ప్రేమ కారణంగా పరివర్తన రావడం అన్న అంశం కూడా మిళితమై వుంది. సినిమా హిట్ అయింది. హిందీలో రీమేక్ చేశారు. దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వేశారు.
'జయసింహ' కథ కూడా యింతకుముందు ఓ సారి చెప్పాను. రాజుగారి తమ్ముడే అన్న కొడుకుని చంపించబోవడం అదీ. ఇవన్నీ ఊహల్లోంచి రావక్కరలేదు. మన రాజుల కథలు తీసుకుంటే చాలు, పేర్లు మార్చి కథ కల్పించవచ్చు. 'సింహాసనం' అని కృష్ణ తీసిన, డైరక్టు చేసిన సినిమా వచ్చింది. మంచి పొలిటికల్ సినిమా. 'కంచుకోట' భలే కాంప్లికేటెడ్ రాజనీతి ప్రధానమైన సినిమా. చాలా బాగుంటుంది. దుష్టుడైన ఓ సేవకుడు రాజుగారి మాస్క్ వేసుకుని రాజుగా చలామణీ కావడం, అసలు రాజు పరారీలో వుండడం, రాణిని ఎక్కడో బంధించడం.. ఇంత క్లిష్టంగా వున్నా ఆబాలగోపాలం ఆ సినిమాను అర్థం చేసుకున్నారు, ఆదరించారు. అది రచయిత, దర్శకుడి ప్రతిభ.
'బండరాముడు' సినిమా వుంది. అందులో హీరో కులవృత్తి చేత దొంగ. ఓ స్వామీజీ వచనాల వల్ల మారతాడు. కానీ అతని కంటె పెద్ద దొంగలు రాజ్యంలో వున్నారు. ఆ విషయం మారువేషంలో వున్న రాజుగారికి అర్థమవుతుంది. ఆ వేషంలో రాజుగారు, బండరాముడు కలిసి రాజుగారి కోటలోకి దొంగతనానికి వెళతారు. మంత్రి మహాశయుడు తను చేసే దొంగతనాలను కూడా బండరాముడి నెత్తికి చుట్టేస్తున్నాడని రాజుకి అర్థమవుతుంది. ఇలాటి సినిమాల్లో హీరోతో ప్రేక్షకుడు మమేకమవుతాడు. హీరో అండర్డాగ్ కదా. వీణ్ని దొంగ అంటారు కానీ పెద్దమనుష్యుల్లా చెలామణీ అయ్యేవారే అసలు దొంగలు అని చూపిస్తే వాడికి నచ్చకుండా ఎలా వుంటుంది?
ఇలా చెప్పుకొస్తే 'బందిపోటు' కథ గుర్తుకువస్తుంది. ఆ సినిమా వచ్చినపుడు ప్రజలు పక్కఊళ్లనుంచి ఎడ్లబళ్లమీద సినిమా హాళ్లకు వచ్చి 'బందిపోటుకు జై' అని నినాదాలు చేసేవారు. బందిపోటుకు జై ఏమిటి? వాడేమైనా మహాత్మా గాంధీయా? ఇక్కడ గమనించ వలసినదేమిటంటే ఒక మంచివాడు బందిపోటుగా ఎందుకు మారాడో కన్విన్సింగ్గా చూపించాడు రచయిత, దర్శకుడు. బందిపోటు అయిన తర్వాత రాజరికానికి ఎలా బుద్ధి చెప్పేడో ప్రేక్షకుడి కసిదీరా చూపించాడు. అందువల్ల ఆ సినిమా ప్రజలను ఆట్టుకుంది. ఆ సినిమా కథ క్లుప్తంగా చెప్తాను – 'బందిపోటు' సినిమాలో 'రాజుగారు గుమ్మడి స్వతహాగా మంచివాడే. కానీ కాళ్లుపోయి అవిటివాడయిపోయాడు. రాజ్యపాలన అతని బావమరిది, సేనాపతి అయిన రాజనాల చేతిలోకి వెళ్లిపోయింది. అతను ప్రజా కంటకుడు. రాజుగారి పేర పన్నులు దారుణంగా వసూలు చేస్తూ, ప్రజలను పీడిస్తున్నాడు. ఈ పరిస్థితికి రాజుగారి కొలువులో విశ్వాసంగా పనిచేసి రిటైరయిన నాగయ్య బాధపడుతున్నాడు. అతని తమ్ముడు మిక్కిలినేని బాధపడి ఊరుకోలేదు. పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాడు. బందిపోటు దొంగగా మారి ప్రభుత్వ ఖజానాను దోచుకుని ప్రజలకు పంచుతున్నాడు. నాగయ్య కొడుకే హీరో, ఎన్టీ రామారావు!
ఆ బందిపోటును వెంటాడి పట్టుకోబోయాడు. అప్పుడు అతను ఫలానా అని చెప్పాడు. వచ్చి తండ్రి నడిగాడు. తండ్రి కథంతా చెప్పి అతను ప్రభుత్వానికి లొంగిపోతే రాజుగారి నుండి క్షమాభిక్ష యిప్పించే బాధ్యత తనది అన్నాడు. మిక్కిలినేనికి నమ్మకం లేకపోయినా అన్నగారి మాట కొట్టేయలేక ఆయనతో బాటు రాజువద్దకు శాంతి చర్చలకై బయలుదేరాడు. మధ్యలోనే సేనాపతి మనుష్యులు ఇద్దరినీ హత్య చేశారు. ఇద్దరి శవాలూ యిల్లు చేరాయి. ఇది చూడగానే రామారావు కుతకుతలాడిపోయాడు, గుండె మండిపోయింది. రాజుగారు నిస్సహాయుడని, అతనికి ప్రజలకు మధ్య అడ్డుగోడలా సేనాని నిలిచాడనీ గ్రహించాడు. ఇక అప్పటినుండి అతను తన చిన్నాన్న స్థానంలో బందిపోటుగా అవతార మెత్తాడు.
మీరే ప్రేక్షకులనుకోండి. ఈ పరిస్థితిలో హీరో బందిపోటుగా మారితే సమర్థిస్తారా? లేదా? అందుకే 'బందిపోటుకు జై' అనే కేకలు. ఇక ఇప్పటినుండి అతను సేనానిని ముప్పుతిప్పలు పెడతాడు. మారువేషాల్లో వస్తాడు, నామాలు పెడతాడు, అతన్ని ఆటపట్టిస్తాడు, హేళన చేస్తాడు, ప్రేక్షకుడి దృష్టిలో అతన్ని చులకన చేస్తాడు, దానితో వినోదం కలుగుతుంది. ఇక శృంగారం అంటారా, అది రాకుమారి రూపంలో వుంది. ఆమె బందిపోటు పేరు విని అసహ్యించుకుంటుంది. సేనాపతి పట్టుకోవడం లేదని అతన్ని తిట్టిపోసి, తనే బయలుదేరుతుంది. చివరకు బందిపోటుకు బందీగా చిక్కుతుంది. అతనేం చేస్తాడోనని భయపడుతూంటే అతను తీసుకెళ్లి ఆమె తండ్రి రాజ్యం ఎంత అధ్వాన్నంగా సాగుతోందో, ఆ బాధితులందరినీ పెరేడ్ చేయించి మరీ చెప్తాడు. ఇక ఆమె తన తప్పు గుర్తిస్తుంది. హీరో మంచితనాన్ని ఆరాధిస్తుంది. ప్రేమిస్తుంది. తొలుత ఘర్షణతో ప్రారంభమైన ప్రేమ కాబట్టి మరింత ఘాటుగా ప్రేమిస్తుంది. అయితే ఆమెపై కన్నేసిన సేనాపతికి ఈ ఘాటు ఇంకోలా తగిలింది. విషయం తెలిసి రక్తం పోటెత్తింది. రాజుగారిని బందీ చేసి ఆమెను పెళ్లిచేసుకొనబోయే వేళకు హీరోగారు ప్రజాబలంతో తిరుగుబాటు చేసి అతన్ని తుదముట్టిస్తాడు.
ఇలా చెప్పుకుపోతే చాలా సినిమాలే తేలతాయి. మనం ఈ తరహా విశ్లేషణాత్మకంగా చూడం కాబట్టి 'స్టంటు సినిమాలన్నీ ఒకటే మచ్చు' అని తీసిపారేస్తాం. కానీ చూస్తే గండికోట రహస్యం, అగ్గిబరాటా యివన్నీ రాజనీతిని ప్రబోధించేవే! వీటన్నిటిలోనూ కథానాయకుడు ప్రజల పక్షాన నిలిచి పాలకులతో పోట్లాడతాడు. సామాన్యుడు గద్దె కెక్కి సాధారణ ప్రేక్షకుడి జేజేలు అందుకుంటాడు. అయితే 'రాజమకుటం' ఇంకో తరహా సినిమా. దీనిలో హీరో రాజకుమారుడు. విలన్గా ముద్రపడ్డవాడు. హీరోయిన్ అతన్ని చంపాలని ప్రతిన బూనిన విప్లవ వనిత. ఆ సినిమా గురించి కాస్త విపులంగా చెప్తాను. ముందే చెపుతున్నాను – నాకీ సినిమా అంటే వ్యామోహం. నీకు నచ్చిన బెస్ట్ జానపద సినిమా ఏది అంటే 'రాజమకుటం' అని ఘంటాపథంగా చెప్తాను. దీనిలో హీరో చిక్కుల్లో పడడం వుంది. దాన్ని సాల్వ్చేయడంలో యుక్తి వుంది. మాయలూ, మంత్రాలూ, అడ్డుదారులూ లేవు. కథలో లోపాలు లేవు. తారాగణం అంతా పరమాద్భుతంగా నటించారు. మెదడుకు పదును పెట్టే సినిమా యిది. సావధానంగా చదవండి-(సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)