పూరి ఇలా చెప్పాడా చిరుకి సారీ…

పుట్టిన‌రోజు ఇంట‌ర్వ్యూల్లో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి తాను చేసిన కామెంట్ల ఘాటు ఎక్కడ ఎలా తాకిందో, దాని రిజ‌ల్ట్ ఎలా ఉందో గాని…  డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాధ్ మాట‌ల్ని దిద్దుకునే ప‌నిలో ప‌డ్డట్టున్నాడు.…

పుట్టిన‌రోజు ఇంట‌ర్వ్యూల్లో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి తాను చేసిన కామెంట్ల ఘాటు ఎక్కడ ఎలా తాకిందో, దాని రిజ‌ల్ట్ ఎలా ఉందో గాని…  డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాధ్ మాట‌ల్ని దిద్దుకునే ప‌నిలో ప‌డ్డట్టున్నాడు.  విప‌రీత‌మైన‌ మెగా భ‌క్తిని ప్రద‌ర్శిస్తూ కొత్త స్టేట్‌మెంట్లు గుప్పించాడు. 

తాజాగా బుధ‌వారం పూరి చేసిన కామెంట్లలో… చిరంజీవి 150వ సినిమా తానే చేస్తాన‌నే న‌మ్మకం ఉంద‌న్నాడు. అస‌లు ఆ సినిమా చేసే హ‌క్కు కూడా త‌న‌కే ఉందంటూ విచిత్రమైన ప్రయోగం చేశాడు. ఎందుకంటే ఒక సినిమా ద‌ర్శక‌త్వం చేసే విష‌యంలో చేస్తే అర్హ‌త‌ల గురించి మాట్లాడ‌తారు గాని హ‌క్కులన‌డం ఏమిటో… 

అంతేకాదు… ఒక హీరో ఏం చేస్తే బావుంటుందో అనేది అత‌ని అభిమానికే స‌రిగ్గా తెలుస్తుంద‌ని, ఆ ర‌కంగా చూస్తే త‌న‌ను మించి చిరంజీవికి పెద్ద అభిమాని ఎవ‌రున్నారంటూ త‌న హ‌క్కు వాక్కుల‌కు నేప‌ధ్యాన్ని విడ‌మ‌రిచి వివ‌రించాడు. ఎలాగైనా చిరంజీవిని మెప్పించే క‌ధ రాసి 150 వ సినిమాకు డైరెక్షన్ చేసేందుకు ప్రయ‌త్నిస్తాన‌న్న ఈ టాప్ డైరెక్టర్‌… ప్రస్తుతం రాసిన క‌ధ న‌చ్చక‌పోతే, దాన్ని ప‌క్కన ప‌డేసి మ‌రో క‌ధ రాస్తాన‌న్నాడు. అదీ కుద‌ర‌క‌పోతే… మ‌రో క‌ధ‌తోనైనా ఒప్పించి చిరంజీవి 151వ సినిమాకైనా స‌రే ద‌ర్శక‌త్వం వ‌హిస్తానంటూ దాదాపు శ‌ప‌ధం చేసినంత ప‌నిచేశాడు. 

ట్వీట్లతో బుధ‌వారం సంద‌డి చేసిన పూరి… తాను చేసిన కామెంట్ల కార‌ణంగా చిరంజీవి నొచ్చుకుంటే… ఇలా సారీ చెప్పిన‌ట్టున్నాడు. ఇంత‌కీ మెగా స్టార్‌… మొన్నటి పూరి మాట‌ల‌నే గుర్తుంచుకుని గుర్రు మంటూనే ఉండిపోతాడో, నేటి పూరి ప‌ట్టుద‌ల చూసి ముచ్చట‌ప‌డి మ‌రో  ఛాన్సిస్తాడో వేచి చూడాలి.