కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకునే గొప్ప అవకాశం విరాట్ కోహ్లీకి కాస్త దూరంలో వుంది. ఆ అవకాశాన్ని కోహ్లీ దక్కించుకుంటాడా.? లేదా.? అన్నది రేపు తేలిపోతుంది. లంకలో లంక జట్టు మీద గెలవడం అంటే చిన్న విషయమేమీ కాదు. వాస్తవానికి ఇప్పటికే టీమిండియా సిరీస్ విజయాన్ని దక్కించుకుని వుండాల్సింది. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్ విజయాన్ని లంకకు పువ్వుల్లో పెట్టి అందించింది టీమిండియా. గెలవాల్సిన మ్యాచ్‌ని టీమిండియా చేజార్చుకుంది మరి.
తొలి టెస్ట్ కోల్పోయినా రెండో టెస్ట్ గెలిచిన టీమిండియా, మూడో టెస్ట్‌లో లంకపై పట్టు సాధించింది. టీమిండియా సిరీస్ విజయాన్ని అందుకోవాలంటే కావాల్సింది ఏడు వికెట్లు మాత్రమే. 67 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయిన లంక, ఇంకా 319 పరుగులు సాధించాల్సి వుంది. ప్రస్తుత పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువ. కానీ వరుణుడు దెబ్బ కొడితే, టీమిండియా బౌలర్లు పట్టు సడలిస్తే మాత్రం పరిస్థితులు తారుమారైపోతాయి.
మొన్నటికి మొన్న తొలి టెస్ట్ విషయంలోనూ భారత అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలు కాదు, జట్టు మీద అతి విశ్వాసం పెట్టుకున్నారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ టీమిండియా పరాజయం చవిచూసింది. ఒకటి పోతేనేం, రెండు మిగిలాయి అప్పటికి. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అనే పరిస్థితుల్లో వుంది టీమిండియా. రెండు దశాబ్దాలుగా లంకపై, టీమిండియా సిరీస్ విజయాన్ని అందుకోలేదు. ఆ అద్భుత అవకాశం ఇప్పుడు కోహ్లీ సేనకు దక్కేలా వుంది.
వరుణుడు దెబ్బ కొట్టకుండా వుంటే, టీమిండియా బౌలర్లు పట్టు సడలించకుండా వుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం టీమిండియాదే. 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..' అన్న కసితో టీమిండియా రేపు బరిలోకి దిగితే, టీమిండియా విజయానికి తిరుగు లేదు. ఆ అద్భుత క్షణాల కోసం టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు టీమిండియా.