‘గాజుల మోత’ల వెనుక కడుపు కోతలు!

‘కేజీ టు పీజీ’. వినటానికి బావుంది. అనటానికీ బాగుంది. ప్రాస బాగుంది. నినాదాలన్నీ ఇలాగే వుంటాయి; ఇంతే జనరంజకంగా వుంటాయి. ఇలాంటి నినాదాలను ఇస్తే జనాకర్షక నేతలే ఇవ్వాలి. సాధారణ నేతలు ఇస్తే, అంతగా…

‘కేజీ టు పీజీ’. వినటానికి బావుంది. అనటానికీ బాగుంది. ప్రాస బాగుంది. నినాదాలన్నీ ఇలాగే వుంటాయి; ఇంతే జనరంజకంగా వుంటాయి. ఇలాంటి నినాదాలను ఇస్తే జనాకర్షక నేతలే ఇవ్వాలి. సాధారణ నేతలు ఇస్తే, అంతగా మోగవు. కేసీఆర్ జనాకర్షక నేత. తెలంగాణలో ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్యానని విద్యార్థుల మీద ‘ఒట్టే’ సిచెప్పార. (‘ఒట్టు’ అశాస్త్రీయమని కొట్టి పారెయ్యటానికి వీలులేదు; ‘వాస్తు’ ను నమ్మిన నేత ‘ఒట్టు’ నమ్మరా, ఏమిటి?) 

తెలంగాణలో బీద విద్యార్థులు ‘కేజీ’ల్లో ఎప్పుడు చేరతారో తెలియదు కానీ, ‘కేజీ’ల కొద్దీ బరువులెత్తుతున్నారు; ‘గాజుల’కు మెరుగులద్దుతున్నారు. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేవి కడిగిన ‘ముత్యాలే’ కాదు, ‘మెరిసే గాజులు’ కూడా. హైదరాబాద్ లో చార్మినార్‌కు ఎంతటి చరిత్ర వుందో, గాజులకూ అంతే చరిత్ర. చరిత్ర అంటే కేసీఆర్‌కు ఎంత మోజో చెప్పనవసరంలేదు. ఆ చరిత్ర ను కళ్ళ ముందు చూపించాలని భావిస్తారు. నిజాం పాలనలోని( క్రౌర్యాన్ని పక్కన పెట్టి) ఘనతల్ని చాటటానికి చిన్న అవకాశం వచ్చిన వదలరు. అది ఘుమ ఘుమ లాడే బిర్యానీ కావచ్చు; లేదా ఎండిపోయిన చెరువులు కావచ్చు. ఆ మాట కొస్తే ఆయన జీవించేది చరిత్రలోనే జీవిస్తారు. తనను తాను గోల్కొండ ప్రభువులాగా భావించుకోబట్టే, ఆయన గోల్కొండ ఖిల్లా మీద ముఖ్యమంత్రిగా ‘పంద్రాగస్టు’ నాడు, మువ్వన్నె పతాకాన్ని ఎగురు వేశారు. ప్రధాని మాట్లాడానికి ఢిల్లీలో ఎర్రకోట బురుజులు వుంటే, తనకు సగం కూలిన గోలకొండ కోట గోడలు లేవా అని ఒక నేతగా తన ఆత్మగౌరవ ప్రకటన చేశారు. 

ఆయన ఇచ్చిన హామీలు ఎన్నో..! అందులో ఒకటి ‘కేజీ నుంచి పీజీ’ విద్య. నిజానికి ఈ విద్య మొత్తాన్ని ఉచితం చేసేసినా, బడులకు రాలేని వాళ్ళు చాలా మంది వున్నారు. వాళ్ళలో గాజుల పరిశ్రమలో పనిచేసే బాల కార్మికులు వున్నారు. వారం క్రితం పోలీసులు రంగంలోకి దిగి, దాదాపు 330 మందికి పైగా బాల కార్మికులను విముక్తం చేశారు. వీరిలో అధిక శాతం బీహార్ నుంచి వచ్చిన వారు. దారిద్య్రం తాళ లేక కన్న తల్లదండ్రులే పిల్లల్ని మూడు వేల నుంచి అయిదు వేల రూపాయిలకు దాదాపు విక్రయించేశారు.  కొందరు పిల్లలయితే తామే స్వయంగా ఏజెంట్ల సాయింతో ఇక్కడ చేరారు. రోజుకు 14 గంటల చొప్పున పని చేస్తుంటే, వారికి నెలకు దేక్కది రు.3000 కూడా వుండటం లేదు. అయితే ఈ దారిద్య్రానికి కారణం బీహార్ ప్రభుత్వం. కాబట్టి అక్కడ నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రిగా వున్న నితిష్ కుమార్‌నో లేదా, ఆయన ఎంపిక చేసి కూర్చోబెట్టిన జితన్ రామ్ మంజి నో బాధ్యుల్ని చెయ్యాలి. 

కానీ చిత్రమేమిటంటే, బాలకార్మికులంటే దొరికిన ఈ 330 మంది  మాత్రమే కాదు. మొత్తం 10 వేల వరకూ వుండ వచ్చిన ఒక అంచనా. ఓ పదేళ్ళ క్రితం ‘ప్రపంచ కార్మిక సంస్థ’కు  ఓ ఎన్జీవో అందచేసిన నివేదిక ప్రకారం 954 బాల కార్మికులు వున్నారు. రాను రాను వీరి సంఖ్య పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గ లేదు. బీహార్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు తక్కువే వుంటారు. అధికశాతం హైదరాబాద్ లోని వారే. ఉమ్మడి రాష్ర్టంగా వున్నప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ వీరిని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా విడిపోయింది. హైదరాబాద్‌ను సుందర నగరంగా మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఈ నగరాన్ని ‘డల్లాస్’ గామార్చేస్తానంటున్నారు. ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామంటున్నారు. కానీ ఈ నిరుపేద బాల కార్మికులను ఎలా విముక్తం చేస్తారన్నది ప్రశ్న. వీరిలో సగం మంది పిల్లలు కుటుంబ పోషకులుగా వున్నారు. వీరిని విముక్తం చేసి బలవంతంగా బడిలో వేసినా, కుటుంబాలు వీధి పాలవుతాయి; కుప్ప కూలి పోతాయి. కుటుంబాల్ని ఆదుకుంటూ ఈ పిల్లలకు చదువు చెప్పించాలి. నేరుగా ఇంగ్లీషు విద్యే చెప్పించాలంటే, ఇంకెంత కష్టమో యోచించాలి.

నినాదం ఇచ్చినంత సులువు కాదు, అమలు జరపటం. ఒకప్పుడు దేశాన్నేలిన ఇందిరా గాంధీ వంటి జనాకర్షక నేతలు సైతం, ఇంతే జనరంజక నినాదాలు ఇచ్చారు. ‘గరీబీ హఠావో’ ( పేదరికమా పారిపో) అన్నారు.పేదరికం పారిపోలేదు కానీ, పేదలు మాత్రం పారిపోయారు.. గల్ఫ్ దేశాలకు.  ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇలాంటి నినాదాలే ఇస్తున్నారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటున్నారు. ఆచరణకు నోచుకోని నినాదాలు ఇవ్వటం వల్ల  పెద్ద ప్రయోజనం వుండదు. నినాదాలు, విధానాలు కావాలి; విధానాలు ఆచరణకు నోచుకోవాలి. కేసీఆర్ నిర్మించ బోయే బంగారు తెలంగాణలో ఈ బాలలు కూడా వున్నారని ఆయన గుర్తిస్తే చాలు. అందుకు తగ్గ విధానాలు వాటంతటవే రూపం దాల్చుతాయి.  

 సతీష్ చందర్