నేతల మాటలు అర్థవంతంగా వుండాలి.సమయానికి తగు మాటలాడెనె..అన్నట్లు అందంగా, గౌరవ ప్రదంగా వుండాలి. కానీ అధికారం సంపాదించిన వారి మాటలు అలా వుండడం లేదు.
'చంద్ర'శేఖర రావు, 'చంద్ర'బాబు నాయుడు అటు తెలంగాణకు, ఇటు సీమాంధ్రకు కాబోయే కొత్త, తొలి ముఖ్యమంత్రులు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో, అధికార సింహాసనం అధిరోహించబోతున్న నేతలు. అంతవరకు బాగానేవుంది. కానీ ప్రజా తీర్పు విలువడిన దగ్గర నుంచి వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ఎందుకిలా అనిపిస్తోంది. వారి మాటల తీరు మాత్రం ఆశించిన మేరకు లేదన్నది వాస్తవం.
ముందుగా కేసిఆర్ తీరు చూదాం. తెరాసకు సరీసరిపడని స్థానాలు వచ్చాయి. జంప్ జిలానీలు రెడీ అవుతున్నారని వార్తలు వినవచ్చాయి. వెంటనే కెసిఆర్ అన్న మాట..చింతకు కట్టి కొడ్తరు..ఓ ముఖ్యమంత్రి, పార్టీ నేత ఇలా అనొచ్చా. పార్టీ మారితే ప్రజలు సహించరు అని అనడం వేరు, చెట్టకు కట్టి కొడతారు అనడం ప్రజల్ని రెచ్చ గొట్టడమే అవుతుంది. ప్రజాస్వామ్య యుగంలో పార్టీ మారే స్వేచ్ఛ రాజకీయనాయకులకు వుండనే వుంది. ఆ మాటకు వస్తే, కెసిఆర్ పార్టీ మారినప్పుడు ఏ తెలుగుదేశం కార్యకర్తలైనా ఆ పని చేసారా..కేసిఆర్ పార్టీలోకి ఇంత మంది పరాయి పార్టీ వాళ్లు వస్తే, ఇలాంటి కార్యక్రమం ఏమైనా జరిగిందా..లేదే?
సరే, అదయిపోయింది. ఆ తరువాతి నుంచి అయినా ఆయన ఏమన్నా ముఖ్యమంత్రిని అన్న రేంజ్ లో మాట్లాడారా అంటే అదీ లేదు. ఉద్యోగుల విభజన వ్యవహారంలో మళ్లీ ఎప్పటిలా ఉద్యమనేత మాదిరిగానే మాట్లాడుతున్నారు. చిత్రంగా ఎన్నికల వరాల గురించి కానీ, తొలి సంతకం గురించి కానీ కేసిఆర్ ప్రస్తావించడం లేదు. రెండు బెడ్ రూమ్ ల ఇళ్లు కట్టిస్తామన్నది తెలంగాణ ప్రజలను బాగా ఊరింపచేసింది. వెనుకబడిన తెలంగాణ ప్రాంత ప్రజలకు రెండు బెడ్ రూమ్ ల ఇల్లు అంటే అంత చిన్న విషయం కాదు.
హీనంలో హీనం అయిదారు లక్షల రూపాయిలు ఖర్చు అయ్యే పని. కెసిఆర్ ఎప్పుడు ఆ కార్యక్రమం చేపడతారా అని చూస్తున్నారు. అదే సమయంలో సుమారు ముఫై, నలభై కోట్ల వరకు వ్యవసాయ రుణాలు వున్నాయి. వీటిని మాఫీ చేయాల్సి వుంది. అవి చేస్తే తప్ప, కొత్త రుణాలు రావు. కానీ కెసిఆర్ వాటి గురించే ఇంకా మాట్లాడడం లేదు. కొత్త రుణాల సంగతి, ఆ తరహా హామీల సంగతి దేవుడెరుగు. మరి ప్రమాణ స్వీకారం చేసాకన్నాకెసిఆర్ స్టయిల్ మారుతుందేమో చూడాలి
ఇక సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెజార్టీ సాధించిన తరువాత చంద్రబాబు రెండురకాలుగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదే పదే ప్రజలు, తనను గెలిపించిన వర్గాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కూడా ఊహించని విజయం లభించింది. దానికి దోహదం చేసిన వర్గాలను తాను మరచిపోనని పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, బ్రాహ్మణుల ఓట్లు తొలిసారి తనపార్టీకి లభించాయని ఆయన గుర్తించారు. ఆ మేరకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుకోవడం వరకు బాగానేవుంది.
కానీ అదే సమయంలో ఈ విజయంతో తృప్తి చెందక పదే పదే తెలంగాణ గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఎందుకో బాబుకు తెలంగాణ పై మమకారం పోవడం లేదు. విడిపోయిన తెలంగాణలో కూడా తెలుగుదేశం అధికారం సాధించాలన్నది పరమార్థంగా కనిపిస్తోంది ఆయనకు. 2019నాటికి తెలంగాణలో అధికారం సాధిస్తామని పదే పదే చెప్పడం ఆయనకు పరిపాటి అయింది. అదేసమయంలో తెలంగాణ ప్రజలన్నా తమకు అభిమానం అని చాటుతున్నారు. సీమాంధ్ర ప్రజలు మెజార్టి ఇచ్చి గెలిపిస్తే, వారి సంగతి మాట్లాడడం మానేసి, తెలంగాణ జపం ఎందుకో? అర్థం కాదు. పైగా ఇలా పదేపదే తెలంగాణలో అధికారం మాదే అనడం వల్ల అటు తెలంగాణ నేతలను కిర్రెక్కించినట్లు అవుతుంది.అంటే సీమాంధ్ర అధికారంతో బాబు సంతృప్తి చెందలేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది.
ఇప్పటికీ ఇంకా ఆయన కాంగ్రెస్ ను తిడుతున్నారు. ఆ చాప్టర్ ముగిసింది. ఇప్పడు జరగాల్సింది, బాబు మాట్లాడాల్సింది సీమాంధ్ర దశ, దిశ ఎలా అన్నదాని గురించి, అది వదిలేసి విమర్శలు, భవిష్యత్ ఆశయాలు వల్లె వేయడం ఎంతవరకు సబబు? చాన్నాళ్లుగా పించన్లు అందడం లేదు. పైగా బాబు ఫించన్లు పెంచుతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఈ దిశగా ముందు ఆయన ప్రయత్నించాలి.నిజానికి రాజధానికి ఇంకా పదేళ్ల సమయం వుంది. కానీ చంద్రబాబు ఎలాగైనా మూడేళ్లలో కొత్త రాజధానికి ఓ రూపు తేవాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అయితీ ఈ రంథిలో పడితే, ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చెట్టెక్కేస్తాయి. తొందరపడి విజయవాడ ప్రాంతాన్ని రాజదానిగా సూచన ప్రాయంగా వెల్లడించడం కూడా ముప్పుగానే వుంది.
కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేయగానే వెంకయ్యా నాయుడు చేసిన పని కూడా అదే. గుంటూరు-విజయవాడ ప్రాంతాల్ని జంట నగరాలు చేస్తామని, మెట్రో తెస్తామని. ఇలా చెప్పడం తప్పు కాదు. కానీ ఈ దశలో. అసలే గుంటూరు-బెజవాడ మధ్య రాజధాని అని భయంకరంగా నమ్మకం పెరిగిపోయింది. దీనికి బాబు ప్రమాణ స్వీకారం, వెంకయ్య మాటలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యపారం అమాంతం పెరిగిపోయింది. రేపు ఏదన్నా తేడా జరిగితే వేల కోట్లు ఢమాల్ మంటాయి. అదో పెద్ద స్కామ్ అయి కూర్చుంటుంది.
అందువల్ల ఏతా వాతాచెప్పేదొకటే. నాయకులు అనేవారు కాస్త ఆచి తూచి మాట్లాడాలి. నిన్నటి వ్యవహారాలు, తమ రాజకీయ అజెండాలు పక్కన పెట్టి, సంక్షేమంపై దృష్టి పెట్టాలి. ఇంకా ప్రత్యర్ధులపై మాటల తూటాలతో విరుచుకుపడుతూ ప్రజల్ని అదే మత్తులో వుంచడం కాదు. అలా ఎంతో కాలం వుంచలేరు కూడా.
చాణక్య