‘చంద్రుల’ను విదేశీ పిచ్చి వదలదా?

'పిచ్చి పిచ్చి పిచ్చి..రకరకాల పిచ్చి..ఏ పిచ్చీ లేకుంటే అది అచ్చమైన పిచ్చి'…అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ప్రతి మనిషికీ ఏదో ఒక పిచ్చి ఉంటుంది. సామాన్యుడే కావొచ్చు, రాజకీయ నాయకుడే…

'పిచ్చి పిచ్చి పిచ్చి..రకరకాల పిచ్చి..ఏ పిచ్చీ లేకుంటే అది అచ్చమైన పిచ్చి'…అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ప్రతి మనిషికీ ఏదో ఒక పిచ్చి ఉంటుంది. సామాన్యుడే కావొచ్చు, రాజకీయ నాయకుడే కావొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 'విదేశీ పిచ్చి' పట్టింది. అంటే  విదేశాల్లో స్థిరపడాలనే పిచ్చి కాదు. విదేశాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పిచ్చి.  వాస్తు, సెంటిమెంట్ల పిచ్చికి విదేశీ పిచ్చి తోడైంది. కేసీఆర్‌ తెలంగాణను, బాబు ఆంధ్రాను ఏం చేస్తారో తెలియడంలేదు. ఇద్దరూ కూడా ఆ దేశంలా మారుస్తాం, ఈ దేశంలా తీర్చిదిద్దుతాం అని ఊదరగొడుతున్నారు. వీరిద్దరూ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ ఊకదంపుడును  పనిగా పెట్టుకున్నారు. ఇద్దరూ ఎంతగనం కొట్లాడుకుంటున్నా, ఎన్ని విమర్శలు చేసుకుంటున్నా జనాన్ని విదేశాల పేరుతో మభ్యపెట్టడం మర్చిపోవడంలేదు.         

ఇద్దరూ ఇద్దరే…

తెలంగాణ రాజధాని (ప్రస్తుతం ఉమ్మడి రాజధాని అనుకోండి) హైదరాబాదును విశ్వనగరం చేస్తా అని కేసీఆర్‌ చెబుతుంటే, ఏపీలో కట్టబోతున్న రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామని, నెంబర్‌ వన్‌ చేస్తామని బాబు చెబుతున్నారు. కాని రెండు రాష్ట్రాల్లో ఇప్పటికీ మౌలిక సమస్యలే తీర్చలేకపోతున్నారు. ఊళ్లకు రవాణా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. పాఠశాల భవనాలు చక్కగా కట్టలేకపోతున్నారు. ఉన్నవాటిని నిర్వహించలేకపోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతున్నారు. ఎరువులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఏ పథకమూ సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ముందు వీటి గురించి మాట్లాడకుండా సింగపూర్‌ చేస్తాం, లండన్‌ చేస్తాం, న్యూయార్క్‌ చేస్తాం…అంటూ చెవుల్లో జోరీగల్లా అదే పనిగా చెబుతున్నారు. ఇద్దరు సీఎంలు చెబుతున్నది వింటుంటే భవిష్యత్తుల్లో ఈ నగరాల్లో సామాన్యులు బతగ్గలరా అనే అనుమానం కలుగుతోంది. గోదావరి పుష్కరాలకు ప్రచారం చేసి, పన్నెండు రోజులపాటు రాజమండ్రిలో ఉండి ఏర్పాట్లు చూసుకొని, తొక్కిసలాటలో ఇరవైఏడు మంది చనిపోవడంతో మానసికంగా కలత చెందిన చంద్రబాబు కుటుంబంతో సహా ఆగస్టు మొదటి వారంలో విశ్రాంతి కోసం టర్కీ వెళ్లారు. దాని రాజధాని ఇస్తాంబుల్‌ని చూసిన బాబు 'వావ్‌' అని డంగైపోయారు. వారం తరువాత తిరిగి రాగానే ఏపీ రాజధాని అమరావతి ఇస్తాంబుల్‌ తరహాలో నిర్మిస్తామన్నారు. అప్పటివరకు సింగపూర్‌ జపం చేసిన బాబు ఇస్తాంబుల్‌ను చూడగానే దాని మాదిరిగా చేస్తానన్నారు. ఈమధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి 'హైదరాబాద్‌ను డల్లాస్‌ నగరం మాదిరి చేస్తా' అని చెప్పారు. తాను నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఆ వివరాలన్నీ ఏకరువు పెట్టారు. మల్టీలెవెల్‌ ఫ్లైఓవర్లు కడతామన్నారు. శాటిలైట్‌ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేస్తామన్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మిస్తామన్నారు. ఇంకా చాలా చెప్పారు. ఆవేశంతో అనేక ప్రకటనలు చేస్తున్నారుగాని చివరకు ఏం చేస్తారో తెలియదు.

ఎన్ని దేశాలుగా మారుస్తారు?

 కేసీఆర్‌ అధికారానికి వచ్చిన కొత్తల్లో హైదరాబాదును  సింగపూర్‌ చేస్తానన్నారు. కౌలాలంపూర్‌ చేస్తానన్నారు. ఆయా దేశాలకు వెళ్లి వచ్చాక ఈ ప్రకటనలు చేశారు. కొన్నాళ్ల క్రితం పాత బస్తీకి వెళ్లి దాన్ని ఇస్తాంబుల్‌ నగరంలా చేస్తానన్నారు. ఓసారి కొందరు బ్రిటన్‌ ప్రతినిధులు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వెంటనే ఈయన తెలంగాణను చదవుల్లో లండన్‌ మాదిరిగా చేస్తానన్నారు. కొద్ది రోజుల కిందట టునీషియా ప్రతినిధులు కేసీఆర్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్‌ను టునీషియాలా చేస్తానని ప్రకటించారు. ఏదో ఒక నగరంలా చేస్తానని దానికి కట్టుబడితే బాగుండేది. కాని అన్ని నగరాల్లా చేస్తామంటున్నారు. 2050 నాటికి హైదరాబాద్‌ కుండపోత వర్షాలతో అల్లకల్లోలంగా, గందరగోళంగా మారుతుందని  కొంతకాలం కిందట ఓ అధ్యయనం వెల్లడించింది. నిజానికి ఈ విషయమై కొన్నేళ్ల క్రితమే ఇండియా టుడే (తెలుగు)లో ఓ వ్యాసం ప్రచురితమైంది. ఇప్పుడు అదే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. జర్మనీ విద్యావిభాగం సహకారంతో జిహెచ్‌ఎంసీ, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన 'క్లయిమెట్‌ అసెస్‌మెంట్‌ టూల్‌ ఫర్‌ హైదరాబాద్‌' అనే అధ్యయనం అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఈ పరిశోధన నాలుగేళ్లపాటు జరిగింది. ఇక ముందు హైదరాబాదద్‌లో వర్షాలు కూడా పెరుగుతాయట…! ఎండలు కూడా అధికమవుతాయట…! ఇదీ క్లుప్తంగా హైదరాబాద్‌ భవిష్యత్తు దృశ్యం. ఈ అధ్యయన నివేదిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరేవుంటుంది. ముందు ఇలాంటివాటి గురించి ఆలోచించాలి. హైదరాబాద్‌ ధనిక నగరమంటారు. నిజాముల కాలం నుంచే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని చెబుతారు. కాని అప్పుడప్పుడు మీడియాలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవని వార్తలు వస్తుంటాయి. నాయకులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు, మీడియాలో వస్తున్న వార్తలకు పొంతన లేదు.

ఏ దేశం చూస్తే ఆ దేశంలా చేస్తారా?

చంద్రబాబు అధికారంలోకి  వచ్చాక రాజధాని ఎలా ఉండాలి? ఎలా నిర్మించాలి ? అనేది తెలుసుకోవడానికి అనేక దేశాలు తిరిగారు. సింగపూర్‌, చైనా,జపాన్‌…ఇలా చాలా దేశాలు తిరిగొచ్చారు. ఓ పక్క సింగపూర్‌ మంత్రం పఠిస్తున్నారు. మరో పక్క జపాన్‌ జపం చేస్తున్నారు. ఆ రెండు దేశాలను నేరుగా ఆంధ్రాలో దింపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రను సింగపూర్‌ చేస్తానని ఎన్నికల సమయం నుంచి చెబుతున్న బాబు  జపాన్‌ వెళ్లగానే ఆంధ్రలో టోక్యోవంటి నగరాలు నిర్మిస్తామన్నారు. చంద్రబాబు జసాన్‌లోని ప్యుకువోకా నగరానికి వెళ్లారు. దాన్ని చూడగానే డంగైపోయారు. ప్రపంచంలోని 38 అత్యుత్తమ నగరాల్లో ఇది కూడా ఒకటని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అంత అద్భుతంగా ఉందీ నగరం. బాబుతో మాట్లాడిన ఆ నగరం మేయర్‌, అధికారులు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో తాము పాలుపంచుకుంటామన్నారు. చైనా వెళ్లినప్పుడు అక్కడి నగరాలను, ఫ్లైఓవర్లను, రోడ్లను చూసి పరవశించిపోయారు. అలాంటివన్నీ ఏపీలోనూ నిర్మించాలన్నారు. తాజాగా ఇస్తాంబుల్‌ దగ్గర ఆగారు. మరో దేశానికి వెళితే కొన్నాళ్లు ఆ దేశం జపం చేస్తారు. చంద్రబాబుగాని, కేసీఆర్‌గాని విదేశాల నుంచి స్ఫూర్తి పొందడం మంచిదే. అభివృద్ధిలో ఆయా దేశాల సహకారం తీసుకోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. అదే సమయంలో మన ఆర్థిక పరిస్థితి ఏమిటనేది చూసుకోవాలి. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం ఎంతవరకు అదుతుందో చూడాలి. మన ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో ఆలోచించాలి. ఊరికే మాటలతో ఎంతకాలం మభ్య పెడతారు?

-మేనా