మనిషికి కోతి అంటే భయం, భక్తి. మనిషంటే కోతికి ఇష్టం, లోకువ. డార్విన్ చెప్పినా చెప్పకపోయినా కోతి నుంచే పుట్టామని మనకి తెలుసు. ఈ విషయాన్ని మన రాజకీయ నాయకులు నిరూపిస్తుంటారు కూడా! కోతి పెంపుడు జంతువు కాదు. సొంత అభిప్రాయాలు ఎక్కువ. గతంలో గారడీ వాళ్ల దగ్గర కనిపించేది కానీ, ఇప్పుడు మనిషే కోతిలా ఆడుతున్నాడు. కోతుల్ని ఆడించే వాళ్లు లేరు.
మనిషిలాగే కోతి కూడా వలస జీవి. మనం అడవులు, కొండలు ధ్వంసం చేయడం ప్రారంభించేసరికి కోతులన్నీ ఊళ్లకి వలస వచ్చాయి. ఒక్క తెలంగాణలోనే 35 లక్షల కోతులున్నట్టు అంచనా. ఏటా 10 వేల మందిని కరుస్తున్నాయి. 2018లో 30 కోట్లు ఖర్చు చేసినా కోతుల సంఖ్య తగ్గకపోగా పెరిగింది. దీనిపైన ఒక కమిటీని వేశారు. అది నివేదిక ఇచ్చేసరికి కోతులన్నీ మనుషులై పోయినా ఆశ్చర్యం లేదు.
తెలంగాణలోనే కాదు, అన్ని వూళ్లలో ఈ సమస్య ఉంది. అడవులు, గుట్టలకి దగ్గరగా వుండే వాళ్లలో మరీ ఎక్కువ. మా వూళ్లో (అనంతపురం జిల్లాలోని ఒక పల్లె) కోతుల వల్ల పెద్ద యుద్ధమే జరిగింది గతంలో.
కోతులు కూడా ఫాసిస్టుల టైప్. మెల్లిగా ప్రవేశించి కట్టూబొట్టూ, తినే తిండి, భాష అన్నిట్లో దూరుతాయి. మా వూళ్లలోకి రెండు కోతులు మొదట వచ్చాయి. అది రెక్కీ అని మాకు తెలియదు. ఆంజనేయా అని దండం పెట్టి కొబ్బరి ముక్కలు ఇచ్చారు. తర్వాత నాలుగు వచ్చాయి. బంధువులు అనుకున్నాం. రెండు రోజుల తర్వాత ఒక గుంపు పిల్లాపాపలతో కిచకిచ నినాదాలు చేస్తూ ప్రవేశించి మర్రిచెట్టుని అపార్ట్‌మెంట్‌లా విభజించుకుని కాపురం పెట్టాయి.
మనుషుల్లాగే అవి కూడా ఉదయాన్నే పొలం పనులకు వెళ్లేవి. పంటలు తినేయడం, పండ్లను పీకడం, కూరగాయల మొక్కల్ని లోడడం స్టార్ట్ చేసేవి. దాంతో రాయీరప్ప విసిరారు.
కోతులకి ఒక నాయకుడు ఉండేవాడు. పుతిన్‌లా ముక్కోపి. ఇగో దెబ్బతింది. యుద్ధ ప్రకటన చేశాడు. కోతులు ఇళ్లలోకి దూరి , కనిపించిన ప్రతిదీ ఎత్తుకెళుతూ శాంపిల్‌గా ఒకరిద్దరిని కరిచాయి. వానర శక్తి ముందు మానవ శక్తి చాలడం లేదు. అవి వాయు మార్గంలో వచ్చి కూడా దాడి చేయగలవు. వాటి శక్తి దైవదత్తం. ఎగరాలంటే మనిషికి యంత్ర సాయం కావాలి.
ఊళ్లో రక్తపాతం జరిగితే వెంటనే కబురు వెళ్లేది ఆర్ఎంపీ డాక్టర్‌కి. ఆయనకి సూదయ్య అని ఇంకో పేరు కూడా ఉంది. సూదితో పొడవడమే ఆయనకి తెలిసిన ఏకైక వైద్యం. రెండు చేతులతో మూడు ఇంజక్షన్లు ఇవ్వగలడు.
సరంజామాతో పాత స్కూటర్‌లో వచ్చాడు. ఆయనలాగే స్కూటర్ కూడా ఓల్డ్ మోడల్. స్పీడ్ తక్కువ, పొగ ఎక్కువ. రాగానే కోతి బాధితులకి పిర్రలకి రెండు, జబ్బకి ఒకటి సూది పొడిచాడు. రోగులు అరిచిన అరుపులకి మర్రిచెట్టు మీద ఉన్న కోతులు కూడా జడుసుకున్నాయి.
వానరమానవ యుద్ధం వల్ల సూదయ్య పంట పండింది. ఇలా వుండగా ఆటో ఓబులేసు మీద దాడి జరిగింది. టైంకి రాకపోవడం ఆర్టీసీ బస్సు ధర్మం కాబట్టి, వాటి మీద అవిశ్వాసంతో మా వూరి జనం ఓబులేసు ఆటోని నమ్ముకుని ప్రయాణించేవారు. ఎవరు ఎవరి మీద కూచున్నారో తెలియకపోవడమే ఆటో ప్రత్యేకత. డ్రైవర్ మీద కొందరు, కొందరి మీద డ్రైవర్ కూచొని వుండగా ఆటో కదిలేది. ఒకరోజు ఒక కోతి ముచ్చట పడి డ్రైవర్ పక్కన కూచుంది. రోడ్డు మీద ఉన్న అనేక గోతులు తప్పించే క్రమంలో ఓబులేసు ఇది గుర్తించలేదు. గుర్తించే సరికి మీద పడి కరిచేసింది. ఆటో అష్టవంకరలు తిరిగే సరికి జనం దూకి కకావికలై పారిపోయారు.
సమస్య సర్పంచ్ వరకూ వెళ్లింది. సర్పంచ్‌లకి నిధులు లేకపోవడం యుగధర్మం కాబట్టి, ఊళ్లో తలా ఇంత వేసుకుంటే కోతులు పట్టేవాన్ని రప్పిస్తానని చెప్పాడు. వాడు రానే వచ్చాడు. సమస్యని గ్రహించి “దెయ్యం పట్టినప్పుడే చెప్పుతో కొట్టాలి” అనే పల్లెటూరి సామెత ఆధారంగా వాడు నోటికొచ్చింది అడిగాడు. సర్పంచ్ తిట్టాడు. కోతులకే ఇగో వుంటే, కోతుల్ని పట్టేవాడికి ఎంతుండాలి? వాడు పక్క వూళ్లో పట్టిన కోతుల్ని మా వూళ్లో వదిలి వెళ్లాడు. భీకరమైన సరిహద్దు యుద్ధాలు జరుగుతూ వుండగా తాగుబోతు మల్లిగాడు కథని మలుపు తిప్పాడు.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రిళ్లు మాత్రమే తాగడం అతని అలవాటు. ప్రభుత్వాన్ని నమ్మే మనిషికాదు. అందుకని సొంతంగా సారా చేసేవాడు. ఒకరోజు కోతుల యుద్ధంలో సారాబానలు పగిలిపోయాయి. కోతులు కూడా కొంత ద్రవం స్వీకరించడంతో ఉపద్రవం మరింత పెరిగింది.
ఎవరో ఇచ్చిన ఉచిత సలహా మేరకు మల్లిగాడు బైక్ మీద కడప జిల్లా గండి అడవులకు వెళ్లి, అక్కడి యానాదుల సహకారంతో ఒక కొండ ముచ్చును బైక్ మీద ఎక్కించుకుని వచ్చాడు. ముచ్చును చూసిన భయంతో కోతులు తాత్కాలికంగా పారిపోయాయి.
ఆనందంతో ఊళ్లో వాళ్లు వుండగా ఫారెస్ట్ వాళ్లు వచ్చారు. కొండ ముచ్చుని పెంచడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్టం మీద గౌరవం లేదన్నాడు మల్లిగాడు. ఈ వాదాన్ని వాళ్లు ఒప్పుకోలేదు. దుడ్డు కర్రతో నాలుగు ఉతికాడు మల్లిగాడు. ఊళ్లో వాళ్లు తలో చెయ్యి వేశారు.
సాయంత్రానికి పోలీసులు వచ్చారు. భయంతో జనం పారిపోయారు. అదే సమయానికి కొండ ముచ్చుని ఎదుర్కొనే కార్యాచరణపై కోతులు సమావేశం జరుపుకుంటున్నాయి. పోలీసుల ప్రవర్తన వాటికి నచ్చక ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లని కరిచాయి. చాలా కాలం ఓబులేసు ఆటోలో మల్లిగాడితో సహా అనేక మంది కోర్టులకి తిరిగారు. కోతులు ఏమైనాయి అంటారా? ఊళ్లలో కోతులే శాశ్వతం. మనుషులు అశాశ్వతం.
జీఆర్ మహర్షి