అతి సామాన్యంగా బతికిన గొప్ప నటుడు

తెలుగు సినిమాల్లో బాబాయ్‌గా, కాలేజ్‌ ప్రిన్సిపల్‌గా, ఇంటి ఓనర్‌గా, హోటల్‌ ప్రొప్రయిటర్‌గా అనేక పాత్రలలో ఒదిగిపోయిన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన దూరదర్శన్‌ ప్రోగ్రామ్స్‌తో జీవితాన్ని ప్రారంభించి సినిమాల్లో గొప్ప హాస్యాన్ని పండిరచి, స్వర్గీయ…

తెలుగు సినిమాల్లో బాబాయ్‌గా, కాలేజ్‌ ప్రిన్సిపల్‌గా, ఇంటి ఓనర్‌గా, హోటల్‌ ప్రొప్రయిటర్‌గా అనేక పాత్రలలో ఒదిగిపోయిన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన దూరదర్శన్‌ ప్రోగ్రామ్స్‌తో జీవితాన్ని ప్రారంభించి సినిమాల్లో గొప్ప హాస్యాన్ని పండిరచి, స్వర్గీయ వైఎస్సార్‌ హయాంలో సాంస్కృతిక శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మవరపు సుబ్రహ్మణ్యంది విలక్షణ శైలి. అలాగే ఆయన జీవన విధానం కూడా అతి సామాన్యంగా వుండేది. 

సినిమాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చాక కూడా ఆయన దిల్‌షుక్‌నగర్‌లోని సరూర్‌నగర్‌ కాలనీలోనే వున్నారు తప్ప, జూబ్లీహిల్స్‌కో, మణికొండకో మకాం మార్చలేదు. అంత దూరం నుండి షూటింగ్స్‌కి హాజరయ్యేవారు. అలాగే ఆయన లుంగీ కట్టుకుని కిరణా దుకాణాలకు, కూరగాయల మార్కెట్‌కీ సంచితో వెళ్ళి బేరం చేసి సామాన్యుడిలా తనకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేవారు. ప్రశాంతంగా ఓ మధ్యతరగతి ఇల్లులా కనిపించే ఇంట్లోనే చివరిదాకా వుండిపోయారాయన.

 నటించేటప్పుడు కూడా తోటి నటుడు డామినేషన్‌ చేస్తున్నా విసుగు చెందక ఎంకరేజ్‌ చేసి నటించేవారు. స్వతహాగా రచయిత అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం షూటింగ్‌ స్పాట్‌లో దర్శకుడికి సూచనలు ఇచ్చి, రచయితగా సహకరించారు. ఆయన ఆఖరి రోజుల్లో సాక్షి టీవీ కోసం చేసిన ‘డిరగ్‌ డాంగ్‌’ ప్రోగ్రామ్‌ ఎంతో హైలైట్‌. గొప్ప రేటింగ్‌తో నడిచేది ఆ కార్యక్రమం. ఆయన తర్వాత ఆ స్థాయి ప్రోగ్రామ్స్‌ చేసేవాళ్ళు దొరకలేదని సాక్షి ఛానల్‌ ఒప్పుకోవడం ఆయన గొప్పతనం. నటుడిగా ఎంతో రిచ్‌గా వున్నా, జీవితంలో అతి సామాన్యంగా బతికిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం చరిత్ర చెరిగిపోని గొప్ప పేజీ.