మోహన మకరందం: గోయింగ్‌ ప్లేసెస్‌

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement గోయింగ్‌ ప్లేసెస్‌  విజయం సాధించడాన్ని 'గోయింగ్‌ ప్లేసెస్‌' అంటారు ఇంగ్లీషులో. మనం దాన్ని అక్షరాలా అనువదించుకుని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడం అనే అర్థం…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

గోయింగ్‌ ప్లేసెస్‌ 

విజయం సాధించడాన్ని 'గోయింగ్‌ ప్లేసెస్‌' అంటారు ఇంగ్లీషులో. మనం దాన్ని అక్షరాలా అనువదించుకుని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడం అనే అర్థం తీసుకున్నా తప్పు లేదంటాను. వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు హోదాలలో పనిచేస్తేనే ఎత్తులకు ఎగరగలం, ఇతరుల కంటె వేగంగా, మెరుగ్గా సాధించగలం అని అనుకుంటాను. న్యూటన్‌ మొదటి చలన సూత్రం చాలామందికి వర్తిస్తుంది. ఏదో ఒక ఫోర్సు (శక్తి అనడం కంటె ఇంగ్లీషులో మాట వాడడమే మేలు – దానిలో వుండే ధ్వని కారణంగా) ఫోర్సు అప్లయి చేస్తే తప్ప వున్న చోట నుండి ఎవరూ కదలరు, కదలబుద్ధి కాదు. ఏదో ఉన్నచోట బాగానే వుంది కదా, నడిచిపోతోంది కదా, అలవాటైన చోటు, అలవాటైన వాతావరణం, కొత్త చోటకు వెళితే బాగుండవచ్చు, బాగుండకపోవచ్చు, ఎందుకొచ్చిన రిస్కు అనుకోవచ్చు. ఢిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వంలో పని చేయడానికి ముందు నేను కూడా అలాటి ఆలోచనల్లో వుండడం అబద్ధం కాదు. 

1994 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నేను అప్పుడు రాష్ట్రప్రభుత్వంలోనే ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ డిపార్టుమెంటులో సెక్రటరీగా వున్నాను. సెంట్రల్‌ గవర్నమెంటుకి నా పేరు పంపిస్తామన్నారు. సరేనన్నాను. కానీ వెళదామా వద్దా అన్న ఊగిసలాటలో వున్నాను.  

ఇంతలో ఎన్నికలు వచ్చి విజయభాస్కర్‌రెడ్డిగారు ఓడిపోయారు. కాంగ్రెస్‌ అధికారం పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్‌టియార్‌ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కార్యాలయంలో స్పెషల్‌ సెక్రటరీగా చేసివున్నాను కాబట్టి ఆయన నన్ను వెళ్లవద్దంటే వుండిపోదామా అనుకున్నాను.

xxxxxx

ఉండిపొమ్మన్నా వుండిపోవద్దని జె.పి.మూర్తి అనే జూనియర్‌ హితవు చెప్పారు. ''ఉన్నచోటే వుండిపోవడం అనేది టిపికల్‌ సౌత్‌ ఇండియన్‌ బుద్ధి. ఏదో కారుంది కదా, ఫోన్‌ ఉంది కదా, ఇల్లు ఉంది కదా, హాయిగా గడిచిపోతోంది కదా, కడుపులో చల్ల కదలకుండా గడప దాటకుండా వుందామని మీరు చూడకండి. ఇక్కడ ఎంత చేసినా అది ఒకరకమైన అనుభవం. ఢిల్లీలో సెంట్రల్‌ సెక్రటేరియట్‌ వేరేలా వుంటుంది. ఢిల్లీలో పని చేయడమంటే జాతీయ స్థాయిలో చేయడం. ఒక విధమైన టేకాఫ్‌. అది అనుభవించి చూస్తేనే తప్ప తెలియదు. అఫ్‌ కోర్స్‌, అక్కడ యిమడడం అంత సులభం ఏమీ కాదు. అక్కడి కష్టాలు భరించాలంటే కాస్త కూస్తా ఓపిక చాలదు. కానీ అది ఈ వయసులోనే (అప్పుడు నా వయసు 50) చేయగలరు. లేకపోతే మళ్లీ అది రానే రాదు. మంచి అవకాశం వస్తోంది జారవిడుచుకోకండి'' అని ఆయనా, మరికొందరు నన్ను ఢిల్లీ వైపు తరుముతున్నారు.

రామారావుగారు తిరిగి అధికారంలోకి వచ్చేటప్పటికి చాలా మారారు. పరిస్థితులూ మారాయి. ముఖ్యమంత్రి అయ్యాక మర్యాదపూర్వకంగా ఓ సారి కలిశాను. ఇలా కేంద్రం వెళ్లే అవకాశం వుందని చెప్పలేదు. అప్పుడు ఆయన కార్యాలయంలో సెక్రటరీగా వున్న జయప్రకాశ్‌ నారాయణ్‌కు చెప్పాను – 'ఏమయ్యా, సెంట్రల్‌కి పెట్టుకున్న నా అప్లికేషన్‌ అలాగే వుంచాలా, విత్‌డ్రా చేసుకోవాలా ఓ సారి కనుక్కో' అని. అతను రామారావుగార్ని అడిగాడు. ఆయన విని ''మోహన్‌ నాకు చిన్నప్పణ్నుంచీ తెలుసు'' అన్నారుట.

అంతకు మించి ఏమీ అనలేదు. ''అబ్బే అతను వెళ్లిపోతే ఎలా, ఇక్కడే వుండమను'' అని అనివుంటే ఎలా వుండేదో గానీ అనలేదు. ఆయనకు ఎటువంటి ప్రాధాన్యతలున్నాయో, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు వున్నాయో తెలియదు. రాజకీయంగా అనేక అంశాలు ముడిపడిన కాలమది. కుటుంబపరంగా కూడా చాలా చిక్కులు ఎదుర్కుంటున్నారు. మన గురించి ఆలోచించేటంత సమయం లేదేమో! ఏది ఏమైనా నా గురించి పట్టుబట్టలేదు. నాకు ఆ మాత్రం సంకేతం చాలు – ఢిల్లీ వెళ్లిపోవడానికి గట్టిగా నిశ్చయించుకోవడానికి. 

xxxxxx

ఢిల్లీ ఎలాగూ వెళుతున్నాం కదా, మంచి శాఖకి వెళదాం అనుకుని అప్పటి ప్రధాని పి వి నరసింహారావు గారి వద్ద సెక్రటరీగా వున్న పివిఆర్‌కె ప్రసాద్‌కి ఫోన్‌ చేసి 'ఏమయ్యా నాకు పోస్టింగ్‌ ఎక్కడిస్తున్నారు?' అని అడిగాను. ఆయన నాకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి. గతంలో నేను ఇజ్రాయేల్‌ డెలిగేషన్‌లో వెళ్లడానికి ఏర్పాటు చేశాడు.

'అగ్రికల్చర్‌ అనుకుంటాను.' అన్నారాయన.

''అగ్రికల్చర్‌ నాకు యిష్టమే కానీ ఇక్కడా అగ్రికల్చర్‌లోనే వున్నాను కదా, బతుకంతా దానిలోనే ఎందుకు? రాష్ట్రంలో లేని శాఖలు కొన్ని కేంద్రంలో వుంటాయి కదా – కోల్‌, స్టీల్‌, ఇన్‌కమ్‌టాక్స్‌, డిఫెన్స్‌.. ఇలాటివాటిల్లో వేస్తే నాకు మంచి ఎక్స్‌పోజర్‌ వస్తుంది కదా. ఇవన్నీ రాష్ట్రంలో వుండగా మన కెప్పుడూ చేసే అవకాశం వుండదు. ఎలాగూ ఢిల్లీ వస్తున్నాను కాబట్టి  వాటిల్లో ఏమైనా అవకాశం వుంటుందేమో చూడకూడదా?'' అని అడిగాను. 

ప్రసాద్‌ వెళ్లి పివి గార్ని అడిగారు. ''ఇలా మోహన్‌ వస్తున్నాడు. ఫలానా శాఖల్లో ఏమైనా వీలుపడుతుందా అని అడుగుతున్నాడు'' అని.

''మొదట రానీ,  తర్వాత ఏదో ఒకటి చూద్దాం.'' అన్నారు పివి.

ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌లోనే పోస్టింగ్‌ వచ్చింది. వెళ్లి 1995 జనవరిలో చేరాను. నాలుగేళ్ల పై బడి అక్కడే వున్నాను. పివి గారు చూస్తూనే వున్నారు! నా కోరిక నెరవేరలేదు.

కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఆ శాఖలో ఎన్నో అద్భుతమైన, ఉత్సాహభరితమైన సంఘటనలు జరిగాయి. ఒకదాని నుండి మరొక దానికి దారి తీసింది. వ్యక్తిగతంగా విశేషానుభవం గడించడానికి, దేశానికి అనేక విధాలుగా సేవ చేయడానికి అవకాశం వచ్చింది. ఎనిమిదేళ్లు అక్కడే వుండి చీఫ్‌ సెక్రటరీగానే రాష్ట్రానికి తిరిగి వచ్చాను. ఢిల్లీకి వెళ్లడం ఆ విధంగా ఎంతో లాభించింది. 

అయితే ఢిల్లీలో పని వాతావరణం వేరేలా వుంటుందన్న మిత్రుల హెచ్చరికల మాటేమిటి? అని మీరడగవచ్చు. అదీ చెప్తాను.

నేను 1969లో సర్వీసులో చేరిన నాటి నుండి ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా గారికి సెక్రటరీగా పని చేసిన రెండేళ్లు (1981-83) తప్ప విడిస్తే తక్కిన కాలమంతా – అంటే పాతికేళ్లు – రాష్ట్రంలోనే చేశాను. ఇక్కడ మనవాళ్ల పనితీరు అదీ బాగా తెలుసు. దానికి బాగా అలవాటు పడిపోయాను. అందుకని ఢిల్లీలో మొదటిరోజు షాక్‌ తిన్నాను.

సాయంత్రం ఐదుంముప్పావుకి పక్కగదిలో వున్న పర్శనల్‌ సెక్రటరీని పిలుద్దామని ఫోన్‌ బజర్‌ నొక్కితే అవతల ఎవరూ ఫోన్‌ తీయలేదు. ఏ బాత్‌రూమ్‌కో వెళ్లాడేమోనని కాస్సేపు ఆగి మళ్లీ నొక్కి చూశాను. అబ్బే, దానికీ సమాధానం లేదు. 

ఏమైందో అని ఆశ్చర్యపడుతూ పక్కగదే కదా, వెళ్లి చూశాను. ఎవరూ లేరు. 

ఈయన ఏమయ్యాడు అని ఎవర్నో అడిగితే 'ఐదున్నరై పోయింది కదండీ, ఇంకెక్కడ వుంటాడు?' అన్నారు వాళ్లు.

అదేమిటి, ఐదున్నరవగానే వెళ్లిపోవడమా, అదీ చెప్పా పెట్టకుండా – అని బోల్డంత ఆశ్చర్యపోయాను.

ఎందుకంటే మన స్టేటు గవర్నమెంటులో అలా ఎప్పుడూ జరగదు. అంటే అందరూ రోజూ టైముకి వచ్చి తీరతారని కాదు. ఓ రోజు ఆలస్యంగా రావచ్చు, మరో రోజు పెందరాళే వెళ్లిపోవచ్చు. కానీ చెప్పకుండా, మనకు తెలియకుండా జరగవు. రెవెన్యూ డిపార్టుమెంటులో కావచ్చు, జిల్లాలో, హైదరాబాదు ఆఫీసుల్లో, సెక్రటేరియట్‌లో -ఎక్కడైనా సరే, యిది గోల్డెన్‌ రూల్‌. అంతేకాదు, రెండో శనివారం, ఆదివారం అధికారికంగా సెలవులే అయినా 'రమ్మంటారా, పనుందా?' అని అడిగే మర్యాద వుంది. రమ్మంటే వస్తారు కూడా. మనం చెప్పాక రాకపోవడమంటూ వుండదు. 

xxxxxx

అలాటి సంస్కృతిలోంచి వచ్చినవాడికి యిలా చెప్పా పెట్టకుండా మాయమయ్యే పి యస్‌ ని చూస్తే గుండె ఎలా ఆగిపోతుందో ఊహించుకోండి. 

ఇక టైపిస్టు వుండేవాడు. చెత్త కాగితం మీద తప్పు తప్పు ఇంగ్లీషులో టైపు చేసేవాడు. టైపురైటరు కూడా డబ్బా టైపురైటరు. కొన్ని అక్షరాలు పడేవే కాదు. టైపిస్టు ఇంగ్లీషు బూతుల్ని ఎలాగూ మార్చలేం టైపురైటరైనా మార్పిద్దామని చూస్తే అదంతా సులభంగా అయ్యే పని కాదని తెలిసింది. 17 మంది జాయింటు సెక్రటరీలున్న మినిస్ట్రీ మాది. మా అందరికీ కలిపి యిలాటి వ్యవహారాలు చూసేందుకు ఒక జాయింట్‌ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్‌) ఎక్కడో వుండేవాడు. అతనికి చెప్పుకున్నా లాభం వుండేది కాదు. ఇవన్నీ కనీస వసతులు. వీటికే దిక్కు లేదు. పనిచేసే ఉత్సాహం ఏం కలుగుతుంది చెప్పండి.

ఇక డ్రైవర్‌. మన దగ్గర టైముకి రాకపోవడం కానీ అసలు రాకపోవడం కానీ ఊహించలేం. ఢిల్లీలో మాత్రం అంతా దైవాధీనం. అతడు ఏ రోజైనా రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కోరోజు ఇంపార్టెంటు మీటింగు పెట్టుకున్నపుడు డ్రైవర్‌ వచ్చేవాడు కాదు. ఇతడు యిన్నింటికి వస్తాడు కాబట్టి ఇంత సేపట్లో ఆఫీసు చేరగలుగుతాం అని కరక్టుగా టైము లెక్కవేసుకుని ప్లాన్‌ చేసుకున్నామంటే మునిగిపోతాం. అతగాడు ఆలస్యంగా రావచ్చు, ఎగ్గొట్టవచ్చు.

పార్లమెంటు సెషన్‌లో వున్నపుడు మరీ ఇబ్బంది. అక్కడికి ప్రెస్‌వాళ్లు వచ్చేముందే మనం చేరాలి. డ్రైవర్‌ పుణ్యమాని వాళ్లు వచ్చాక మనం అక్కడికి చేరితే మేటర్‌ చాలా సీరియస్‌ అవుతుంది. సంజాయిషీలు చెప్పుకోవాల్సి వస్తుంది. అంతా ఓ డ్రైవర్‌ కారణంగా! ఇలాటిది మన రాష్ట్రంలో పీడకలలో కూడా జరగని సంగతి. డ్రైవర్‌ యిలా వున్నాడేమిటి అని ఫిర్యాదు చేయబోతే 'అసలు యిక్కడ చాలామంది జాయింట్‌ సెక్రటరీలకు యింటినుండి కారులో తీసుకువచ్చే సౌకర్యమే లేదు. నీకెలా యిచ్చారో మరి! సంతోషించకపోగా ఇంకా సణుగుడు కూడాను…' అన్నారు.

వసతులు, సిబ్బంది యిలా వున్నారు కాబట్టి పై వాళ్లు చూసీ చూడకుండా వూరుకుంటారా అంటే అదీ లేదు. రాష్ట్రంలో అయితే వ్యవహారాలు సంసారపక్షంగా వుంటాయి. 'అయ్యో మోహన్‌ అలాటివాడు కాడు, ఇవాళ ఏం జరిగిందో పాపం' అనుకునే వెసులుబాటు వుంటుంది. అక్కడ అదేమీ లేదు. అక్కడ పర్శనల్‌ టచ్‌ అనేదే లేదు. నువ్వు ఆ క్షణానికి ఏం చేయగలిగితే, ఏం కంట్రిబ్యూట్‌ చేయగలిగితే దాన్ని బట్టే నిన్ను అంచనా వేస్తారు, గౌరవిస్తారు. ఇప్పుడిలా వున్నాడు కానీ గతంలో ఏదో ఊడపొడిచాడట అంటే అదంతా తీసిపారేయ్‌ అంటారు. 

xxxxxx

 రాష్ట్రంలో వుండగా ఏదైనా పొరబాటు జరిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం వుంటుంది. 'ఆ కాగితం ఏదో కన్‌ఫ్యూజన్‌లో నీకు పంపించానయ్యా, వెనక్కి పంపేయ్‌' అంటే వచ్చేస్తుంది. 'ఆ ఫైల్లో ఏదో చిన్న తప్పు దొర్లినట్టుంది, ఏదీ చూడనీ'' అని వెనక్కి తీసుకుని సరిచేసి యిచ్చినా చెల్లుతుంది. అక్కడ ఆ పప్పులేమీ ఉడకవ్‌. మన టేబుల్‌ మీద నుండి కాగితం వెళ్లిందంటే అంతే. దాని మీద ఏం రాస్తే దాన్ని బట్టే తరువాతి కథన్నమాట. బ్రహ్మరాత లాటిది. తుడుపులు, కొట్టివేతలు, హంసపాదులు కుదరవ్‌.

ఇక్కడ సహోద్యోగి ఎవరితోనైనా యిబ్బంది వస్తే చీఫ్‌ సెక్రటరీతోనో, మంత్రితోనో, మరీ అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా చెప్పించవచ్చు. వాళ్లు చొరవ తీసుకుని మనకూ అవతలివాళ్లకూ సయోధ్య కుదురుస్తారు. అవసరమైతే నచ్చచెపుతారు. అక్కడ యిలాటివి ఏవీ వుండవు. ఒక్కొక్క మినిస్ట్రీ ఎంత పెద్దదంటే అక్కడి సెక్రటరీ ర్యాంక్‌ మన చీఫ్‌ సెక్రటరీ ర్యాంక్‌తో సమానం. అంటే ఒక్కో శాఖా ఒక్కో రాష్ట్ర సెక్రటేరియట్‌తో సమానమన్నమాట! అంతేకాదు రాష్ట్రానికి వున్నంత స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి (అటానమీ) దానికి వుంటుంది. ఇవి కాకుండా దేశం మొత్తానికి సంబంధించిన వ్యవహారాలు – పార్లమెంటులో క్వశ్చన్స్‌, పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీకి సమాధానం చెప్పుకోవడాలు – అదనంగా వుంటాయి.

అంటే సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో ఓ భయానక వాతావరణం వుంటుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అక్కడ ఓ క్లినికల్‌ ఎట్మాసిఫియర్‌ వుంటుంది. సెన్సిటివిటీ తక్కువ. అంతా నిర్మోహంగా, శాస్త్రప్రకారం జరుగుతున్నట్టు వుంటుంది. అయినా ప్రతి ఐయేయస్‌ అధికారి తన కెరియర్‌లో ఒకసారైనా సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో జాయింట్‌ సెక్రటరీ హోదాలో పనిచేయాలనే అంటాను. ఎందుకంటే అక్కడ మీలో అనేక లక్షణాలకు – మీ తెలివి, జ్ఞానం, సమయస్ఫూర్తి, అనుభవం, నిజాయితీ, చురుకుతనం – వీటన్నిటికీ ఏకకాలంలో పరీక్ష జరుగుతుంది. దానిలో గెలిచి వస్తే మీరు హమ్మయ్య 'నేనూ ఫర్వాలేదన్నమాట' అని భుజం తట్టుకోవచ్చు. 

కొసమెరుపు – మా అన్నయ్య నాకంటె 15 యేళ్లు పెద్దవాడు. హాస్యప్రియుడు. నా మీద జోకులేయడమంటే మరీ యిష్టం.   ఓసారి మా యిద్దరి మధ్యా పెద్ద వాగ్వివాదం జరిగాక 'ఏరా నేన్చెప్పింది నీకర్థమయ్యిందా?' అన్నాడు. 'అయిందిలే' అన్నాను విసుగ్గా. 'అయితే నేను చెప్పినది తప్పయి వుండాలి' అన్నాడు మొహం బద్దలయ్యేట్టు. 

పెద్దయినా ఆ వెటకారం పోలేదు.  చీఫ్‌ సెక్రటరీగా వుండే రోజుల్లో ఎలాగోలా తీరిక చేసుకుని ఓ రోజు వాళ్లింటికి వెళ్లాను. వచ్చేస్తూ వుంటే నన్ను సాగనంపుతూ – 'కమ్‌ ఎగైన్‌ వెన్‌ యూ డోంట్‌ హేవ్‌ సో మచ్‌ టైమ్‌ టూ స్పేర్‌'  (నీకు మరీ యింత తీరిక లేనప్పుడు మళ్లీ రా) అన్నాడు. ఢిల్లీ సెక్రటేరియట్‌లో వుండాల్సిన మనిషి అని మీకనిపిస్తోందా? యూ ఆర్‌ రైట్‌ !!    

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by
kinige.com
please click here for audio version