మోహన: ‘జై ఆంధ్ర’ – చీకటి రాత్రిలో కేంద్రమంత్రి….

అనుభవాలూ – జ్ఞాపకాలూ:డా|| మోహన్‌ కందా  Advertisement  'జై ఆంధ్ర' – చీకటి రాత్రిలో కేంద్రమంత్రి…. 1972  ''జై ఆంధ్రా'' ఉద్యమం.. నెలల తరబడి సాగింది. ఆంధ్రప్రాంతమంతా అట్టుడికినట్టు ఉడుకుతోంది. ఉడుకురక్తం వున్న యువకులు,…

అనుభవాలూ – జ్ఞాపకాలూ:డా|| మోహన్‌ కందా 

 'జై ఆంధ్ర' – చీకటి రాత్రిలో కేంద్రమంత్రి….

1972  ''జై ఆంధ్రా'' ఉద్యమం.. నెలల తరబడి సాగింది.

ఆంధ్రప్రాంతమంతా అట్టుడికినట్టు ఉడుకుతోంది. ఉడుకురక్తం వున్న యువకులు, విద్యార్థులు మరీనూ..

ప్రఖ్యాత ఇంజనీరు, అజాతశత్రువు, విజయవాడ పార్లమెంటు సభ్యులు అయిన డా|| కె.ఎల్‌.రావు గారు కేంద్రంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కాబినెట్‌ మంత్రిగా వున్నారు. అవేళ రైల్లో ఢిల్లీ వెళుతున్నారు. 

ప్రధానిగా వున్న శ్రీమతి ఇందిరా గాంధీ రాష్ట్రవిభజనకు అంగీకరించకపోవడంతో ఆందోళనకారుల ఆగ్రహం కాంగ్రెస్‌ మంత్రులపై  మళ్లింది. ఇందిరా గాంధీగారికి సన్నిహితుడుగా వుండి కూడా ఉద్యమానికి వత్తాసు పలకలేదని డా|| రావు గారిపై యువకుల ఆగ్రహం. చీరాల రైల్వే స్టేషన్‌ ఔటర్లో రైలు ఆపేశారు. రావుగారు రైలు దిగి ''జై ఆంధ్రా'' నినాదం యివ్వాలని పట్టుబడుతున్నారు. 

అప్పట్లో ఒంగోలులో సబ్‌ కలక్టర్‌గా వున్న నాకు కబురందింది. కారు డ్రైవరు లేడు, జీపు లేదు. ఆర్‌టిసి బస్సులో వెళ్లాను. రైలు చుట్టూ వందలాదిమంది ఆవేశంతో నినాదాలు యిస్తున్న యువకులు. లోపల గౌరవనీయులైన కేంద్రమంత్రి. చుట్టూ చీకటి. సమీపంలో రాళ్లకుప్పలు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చు. 

ఈ సమయంలో వాళ్లకు ఎలా నచ్చచెప్పాలి? చెప్పినా వింటారా? విన్నా అందరూ వింటారా, ప్రశాంతంగా వెళ్లిపోతారా? ఎవరిస్తారు గ్యారంటీ?

xxxxxx

త్యాగరాజస్వామి ''సాధించెనే మనసా''  కీర్తనలో చెప్తారు – విష్ణువు ఒక్కొక్క అవతారంలో ఆ యుగానికి తగినట్లుగా, సమయానికి తగు  మాటలాడాడని. రామావతారంలో ఒక శైలి, కృష్ణావతారంలో మరో శైలి. అందుకే సమయం, సందర్భం చూసి  దానికి అనుగుణంగా మాట్లాడమంటారు పెద్దలు. కొన్ని సన్నివేశాల్లో మెత్తగా మాట్లాడాలి, మరి కొన్ని ఘట్టాల్లో గట్టిగా మాట్లాడాలి, కొందరికి విపులంగా చెప్పాలి, మరి కొందరికి క్లుప్తంగా చెప్పాలి. సందర్భశుద్ధి తెలిసి మాట్లాడడంలో హనుమంతుడిని మించినవాడు లేడంటారు. 

సీతాదేవిని వెతికి రమ్మనమని రాముడు పంపించాడు. హనుమంతుడు సముద్రం లంఘించి, వెళ్లి సీతాదేవిని చూసి వచ్చి రాముడితో చెప్పాలి. రాముడు ఏమైందో తెలుసుకోవాలన్న ఆతృతతో వున్నాడు. ఆ సన్నివేశంలో హనుమంతుడు తాను ఎంత కష్టపడి సముద్రతీరందాకా వెళ్లాడో, మొదట్లో ఎలా అధైర్యపడ్డాడో, ఆ తర్వాత అందరూ ప్రోత్సహిస్తే ఎలా ఎగిరాడో, అక్కడ సీతకోసం ఎన్నెన్ని వనాలు వెతికాడో..యివన్నీ ఏకరువు పెట్టలేదు. రాముణ్ని చూస్తూనే ''దృష్ట్వాన్‌ దేవీ..'' (చూశాను దేవిని) అని చెప్పేశాడు. రెండే ముక్కలు చెప్తూ మళ్లీ అందులో 'చూశాను' అనేదానికి ప్రాధాన్యత యిస్తూ దాన్ని ముందుపదంగా వుపయోగించాడు.

రాముడి ఆదుర్దా పోగొట్టడానికి ఆ ఒక్క ముక్క చాలు. అది చెప్పిన తర్వాత ఎలా వెళ్లాడు,  ఏం మాట్లాడాడు, ఏం 'కాల్చి వచ్చాడు' – అన్నీ చెప్పాడు. అది వేరే విషయం. కానీ అర్జంటుగా కావలసిన సమాచారాన్ని ఇప్పుడు ఉత్తరాల్లో సబ్జక్ట్‌ అని మొదట్లోనే రాసేసినట్టు, విషయం చెప్పేసి అవతలి వాళ్లను కూల్‌ చేశాడు. అదీ సందర్భోచిత సంభాషణ.

అదే విధంగా సీత వద్ద హనుమంతుడు సంభాషించిన విధానం చూద్దాం. వెతికి వెతికి అశోకవనంలో సీతను చూశాడు ఆంజనేయుడు. ఆమె సీత అని తనకు తెలిసింది కానీ తను శ్రేయోభిలాషి అన్న విషయం ఆమెకు తెలియదు కదా. ఎలా చెప్పాలి? వెళ్లి ఎదుట పడితే మాయావి అయిన రావణుడు మారువేషంలో వచ్చాడని భ్రమపడి ఆమె కేకలు పెడితే రాక్షసులంతా లేచి వచ్చి రసాభాస కావచ్చు. అందువలన చెట్టుకొమ్మ మీదే వుండి రాముని కథంతా తనలో తను మాట్లాడుకుంటున్నట్టు చెప్పసాగాడు. అది విన్న సీత అయోమయంలో పడింది. కలేమో అనుకుంది. తలెత్తి చూస్తే వానరుడు. విస్మయంలో మునిగి వున్న సమయంలో హనుమంతుడు చెట్టుదిగి నమస్కారం పెట్టి 'నువ్వెవరివమ్మా? అమరకాంతవా? లేక రావణుడు అపహరించి తెచ్చిన మా రామపత్నివా?' అని అడిగాడు. అప్పుడు సీతకు నమ్మకం కుదిరింది. హనుమంతుడితో సంభాషించింది.

చెప్పవచ్చేది ఏమిటంటే – నమ్మకం కుదురుకోవాలంటే అవతలివాళ్లకు రుచించే ప్రస్తావన చేసి, వాళ్ల మూడ్‌, వాళ్ల కష్టసుఖాలు అర్థం చేసుకున్నట్టు సంభాషణ ప్రారంభించాలి. సందర్భశుద్ధితో, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ సానునయంగా మాట్లాడాలి. క్రమేపీ విశ్వాసం పాదుకునేట్లు చేయాలి. ఈ పద్ధతి ఎవరి విషయంలోనైనా వర్తిస్తుంది కానీ విద్యార్థులతో మాట్లాడినపుడు మరీ జాగ్రత్తగా మాట్లాడాలి. వారితో వ్యవహరించడం కత్తిమీద సాము వంటిది. వారు అతి త్వరగా ఆవేశానికి లోనవుతారు. మెత్తగా చెపితే అంతే వేగంగా చల్లబడతారు. కాస్త ఖచ్చితంగా మాట్లాడితే యింకా విరుచుకుపడతారు. వాళ్ల మీద గట్టిగా యాక్షన్‌ తీసుకోవడానికి చేతులు రావు – ఎందుకంటే మనమూ ఆ థ దాటి వచ్చినవాళ్లమే కాబట్టి. వాళ్ల కెరియర్‌ను దృష్టిలో పెట్టుకుని సంయమనంతో వుండమని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాం. కొన్ని సందర్భాల్లో దాన్ని అలుసుగా తీసుకుని విద్యార్థులలోని రౌడీ ఎలిమెంట్స్‌ రెచ్చిపోయారని లాఠీ చార్జి చేయిస్తే దెబ్బలు తినేది – పాపం మెతక కుర్రాళ్లూ, వేడుక చూద్దామని నిలబడినవాళ్లూ, ఏ పాపమూ తెలియక దారిన పోయే దానయ్యలూ…

ప్రత్యేక వుద్యమం వంటి ఆందోళన రోజుల్లో అధికారులు ఎన్ని వొత్తిళ్ల మధ్య పనిచేస్తారో సామాన్యప్రజలు వూహించలేరు. 1972లో ఆంధ్రా వుద్యమం వచ్చేనాటికి నేను ఒంగోలులో సబ్‌ కలక్టర్‌గా పనిచేస్తున్నాను. అది అసలు వర్ణించతరం కాని అనుభవం. ఒక ఏడు నెలలపాటు అందరూ సమ్మె చేశారు. ఐయేయస్‌, ఐపియస్‌, పోలీస్‌ డిపార్టుమెంటు తప్ప ఎవ్వరూ పనులలో వుండేవారు కారు. ఒంగోలులోనే పోస్టింగు అయినా ఆందోళనకు కేంద్రంగా వున్న చీరాలలో వుండమని కలక్టరుగారి ఆదేశాలు. చీరాల, ఒంగోలు మధ్య తిరుగుతూండేవాణ్ని. కొన్ని వారాలపాటు ఒంగోలు వెళ్లేవాణ్నే కాను. 

నేను ఎమ్మెస్సీలో చేరకముందు ఓ మోటర్‌సైకిల్‌ యాక్సిడెంటు జరిగింది. అప్పటికి నయమైంది కానీ ఆరేళ్ల తర్వాత మళ్లీ మోకాలు బాధించడం మొదలు పెట్టింది. కొన్ని రోజులు ఓ చిన్న కర్ర పట్టుకుని కుంటూకుంటూ తిరిగేవాణ్ని. అది చూసి జాలో ఏమో తెలియదు కానీ ఎంత అలజడి చేస్తున్నా విద్యార్థులు నాతో మర్యాదగా వుండేవారు. వయసుకూడా ఎక్కువ లేకపోవడంవలనో (అప్పుడు నా వయసు 27) లేక స్వతహాగా నా పర్సనాలిటివలనో, ఎప్రోచ్‌ వలనో – నాకు విద్యార్థులతో ఎందుకో గాని ఒక విచిత్రమైన  అనుబంధం కలిగింది.  చేతిలో ఫోర్సు వున్నా ఉపయోగించేవాణ్ని కాను. ఎక్కడైనా గొడవ జరిగిందని విని వెళితే అంతా త్వరలోనే సర్దుకుపోయేది.

కానీ అవేళ మాత్రం ఓ పట్టాన సద్దు మణగలేదు. రోజు మొత్తం వూరంతా తిరిగి ధర్నాలు, వూరేగింపులు, హర్తాళ్లు అన్నీ చూసుకుని అలసి సొలసి చీరాలలో క్వార్టర్సు చేరాను. అంతలో కబురు – కేంద్ర మంత్రి కె.యల్‌.రావుగారు వెళుతున్న రైలుని విద్యార్థులు చీరాల స్టేషన్‌ అవుటర్‌లో ఆపేసారని. ఆందోళన సమయాల్లో ట్రెయిన్‌లు విద్యార్థులకు అంది వచ్చిన టార్గెట్‌లు. రావు గారికి ట్రెయిన్‌లో వెళ్లాలని ఎందుకనిపించిందో ఏమో విజయవాడలో రైలెక్కారు. అది విద్యార్థులకు ఉప్పందిపోయింది. రైలు చీరాల స్టేషన్‌లో ఆగినా ఏమీ చేయకుండా వూరుకుని, అక్కడేమీ చేయకుండా, స్టేషన్‌ బయట ఔటర్‌లో బాగా రాళ్లకుప్పలు వున్న చోట  ట్రెయిన్‌ ఆపేశారు. పెద్దాయన్ని కంపార్టుమెంటులోనుండి బయటకు వచ్చి 'జై ఆంధ్ర' అనమని పట్టుబట్టారు.

నాకు కబురు రాగానే కారు తీయమన్నాను. డ్రైవర్‌ లేడు. కరక్టుగా అదే సమయానికి జీపు కూడా లేదు. మా దగ్గర మా కోసం ఓ ఆర్‌.టి.సి. బస్సు వుండేది. అవేళ అదే వాడుతున్నాం. అందులో ఎక్కి  రైలు ఆపేసిన స్థలానికి వెళ్లాను. డా|| కె యల్‌ రావుగారు తన కంపార్టుమెంటు గుమ్మంలో నిలబడ్డారు. చుట్టూ గోల చేస్తూ విద్యార్థులు!  ప్రభుత్వం అప్పటికి రాష్ట్ర  విభజనపై ఏ నిర్ణయం తీసుకోలేదు. వీళ్లు చూస్తే రాష్ట్రవిభజన చేసి తీరాలంటున్నారు. విభజనోద్యమానికి సంకేతం అయిన 'జై అంధ్ర' నినాదంతో హోరెత్తించడమే కాదు, డా|| రావు గారు కూడా ఆ నినాదం యివ్వాలని పట్టుబడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో వుండి ఆయన ఆ నినాదం యివ్వలేక యిబ్బంది పడుతున్నారు. ఇవ్వకపోతే వీళ్లు వూరుకునేట్టు లేరు. ఎవడో ఒకడికి సహనం నశించి ఆ చీకట్లో రాయి విసిరితే దేశం గర్వించదగిన ఇంజనీరు కె.యల్‌.రావుగారి పరిస్థితి ఏమిటి?

 నేను అక్కడికి చేరగానే ఆ స్టూడెంట్స్‌లో ఎవరిదో తెలిసున్న మొహం కనబడింది ! మామూలు రోజుల్లో వీళ్లందరితో కలిసి నేను క్రికెట్‌ ఆడుతుండేవాణ్ని. వాళ్లంతా నన్ను వాళ్లలో ఒకడిగా చూస్తూండేవారు. (అప్పటి విద్యార్థి నాయకుల్లో యిప్పుడు రాజ్యసభ సభ్యులైన జె.డి.శీలంగారు కూడా వున్నారు) ఉద్యమం ప్రారంభమయ్యాక నన్నేదో వర్గశత్రువుగా చూస్తున్నారు. అయినా కాస్త మొహమాటం వుండిపోతుంది కదా!

అందుకే చనువు తీసుకుని అతన్ని పట్టుకుని ''ఏవయ్యా శ్రీరామమూర్తీ, ఎందుకయ్యా యీ అడావుడి' అంటూ పలకరించాను. 

మనం గమనించవలసిన విషయం ఏమిటంటే – వ్యక్తులు విడి విడిగా మంచివాళ్లు, సాధారణంగా సౌమ్యులు. కానీ ఒక సమూహంగా ఏర్పడినప్పుడు వాళ్ల ప్రవర్తన మారుతుంది. ఎంతటి అఘాయిత్యం చేయడానికైనా సాహసం వస్తుంది. కొన్ని సందర్భాల్లో యిదే సమూహం కావాలనుకుంటే మంచి పనులు తలపెట్టి సామాజిక సేవ చేస్తుంది. అప్పుడు తమ తమ వ్యక్తిగత స్వార్థాలను ప్రతివారూ పక్కన పెడతారు. ఇది ఉద్యమ సమయం కాబట్టి అందరూ 'వయొలెంట్‌'గా, పలకరిస్తే కరిచేట్టున్నారు. అయినా వ్యక్తిగతంగా ఎవరినైనా 'సింగిల్‌ ఔట్‌' చేసి (విడిగా తీసుకుని వచ్చి) 'డీల్‌' చేయడం ప్రారంభిస్తే బండి ముందుకు సాగుతుంది. (రైలు ఆపేసిన ఘట్టం కాబట్టి యీ సందర్భంలో రైలు ముందుకు సాగుతుంది అనాలేమో!) 

అయితే ఆ శ్రీరామమూర్తి పలకలేదు. ఒక వ్యక్తిగా సబ్‌ కలక్టర్‌కు సమాధానం చెప్పడం ఎవరికైనా కష్టమే. గుంపులో అయితే అరిచేయవచ్చు. వెనక్కాల నుంచి – కనబడం అనుకుంటే – దుర్భాషలు కూడా ఆడేయవచ్చు. శ్రీరామమూర్తి స్థానంలో నేనున్నా, మీరున్నా అదే చేసేవాళ్లం.

శ్రీరామమూర్తి మాట్లాడలేదు కానీ అతని చుట్టూ వున్న విద్యార్థులందరూ గోలగోలగా అరిచారు – ''..మరేం చేస్తామండీ? ఆయన 'జై ఆంధ్రా' అనమంటే అననని భీష్మించుకుని కూర్చున్నాడు..'' అని.

నేను శ్రీరామమూర్తి మీదే చూపు నిలిపి ''ఆయననక పోతేనేం? మీరందరూ అంటున్నారు, ఆయన విన్నారు. వెళ్లి ఢిల్లీలో చెప్తారు – ''ఏమండోయ్‌, యిక్కడ కూచుని మీరేదేదో అనుకుంటే చాలదు. రాష్ట్రవిభజన గురించి అక్కడ విద్యార్థులు ఏమనుకుంటున్నారో  అది కూడా చూడాలి అని వాళ్లకు అర్థమయ్యేట్లు చెప్తారు…''

శ్రీరామమూర్తి నోరు విప్పాడు. ''.. నిజంగా చెప్తారంటారా?'' అడిగాడు సందేహంగా.

''..తప్పకుండా చెప్తారు. ఎట్‌లీస్టు, పరిస్థితి చాలా గంభీరంగా వుంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్తారు. మీకు తెలుసో తెలియదో ఇందిరా గాంధీ గారికి కె ఎల్‌ రావు గారంటే చాలా గౌరవం,…'' 

విద్యార్థుల సద్దు మణిగింది. అందరూ ఒకేసారి ఆలోచించడం మొదలు పెట్టారు. నేను అవకాశం దొరకబుచ్చుకుని ''..ఆయన చెప్పాలన్నా, మానాలన్నా.. అసలు ఢిల్లీ అంటూ వెళ్లాలి కదా ! మీరు యిక్కడ చీరాల ఔటర్‌లోనే కూర్చోబెడితే ఆయనేం వెళతాడు..? నిర్ణయాలు తీసుకునేది ఢిల్లీలో.. యిక్కడ కాదు కదా!'' అన్నాను.

రైలు వెళ్లనివ్వాలి అన్న సూచన రాగానే వాళ్లు మండిపడ్డారు. ''మీకేం సార్‌..అలాగే అంటారు. అయినా ఆయనకంత పంతం ఏమిటండీ, ' జై అంధ్రా' అని ఓ ముక్క అనేస్తే సరిపోతుంది కదా'' అన్నారు కోపంగా.

నేను నచ్చచెప్పడం మొదలెట్టాను – ''ఆయన యిబ్బందులు ఆయన కుంటాయి ! ఎంతైనా కేంద్రంలో మంత్రి. ఆందోళనకారులతో చేతులు కలిపి నినాదాలు యిచ్చారు అని ఢిల్లీకి వార్త చేరిందనుకో, యిక్కడి సీరియస్‌నెస్‌ గురించి యీయన ఎంత చెప్పినా నమ్మరు. ఈయనకి ఏదో ప్లాన్‌ వుండి, గోరంతలు కొండంతలు చేసి చెప్తున్నాడు అంటారు. ఆయన వలన మీ ఉద్యమానికి ఏదైనా ప్రయోజనం కలగాలి అనుకుంటే యింతకంటె ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. ఆయన ఢిల్లీలో వుంటారు. దీని గురించి పేపర్లో చదవడమే కానీ ప్రత్యక్షానుభవం లేదు. ఇవాళ మీ పుణ్యమాని ఆందోళన సెగ ఆయనకు తగిలింది. అక్కడకు వెళ్లి తప్పకుండా చెప్తారు. కనీసం రైలెందుకు ఆలస్యమైందో చెప్పుకోవడానికైనా చెప్తారు కదా. ఆ మేరకు సాధించారు కదా. ఆయన్ను ఢిల్లీ వెళ్లనిస్తే …''

తామేదో సాధించామన్న ఆలోచన రాగానే వాళ్ల మొహాల్లో చిరునవ్వు వెలిసింది. గర్వంగా తలలూపారు. అదే అదననుకుని యింకాస్త చెప్పాను – ''చూడండి, ట్రెయిన్‌ ఆపారు. మీ వల్ల అందరికీ కొద్దో గొప్పో యిబ్బంది కలిగింది. ఈ విషయం రేపు పేపర్లో పేరు వస్తుంది. ఉద్యమంలో మీ పాత్ర గురించి అందరికీ తెలుస్తుంది. చాలు, అంతకంటే ఎక్కువ ఆశించకండయ్యా. మరీ ఓవరుగా చేశారనుకో, చెడ్డపేరు వస్తుంది. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు.'' అన్నాను.

''… అంతేనంటారా..?'' అన్నాడు శ్రీరామమూర్తి. 

''అంతే కదా …అయినా కాస్త ఆలోచించండి. ఈ రాత్రి ఇక్కడ చీరాల ఔటర్‌లో రైలు ఆపేసినంత మాత్రాన రేపటికి రేపు తెల్లారేసరికి ఆంధ్ర రాష్ట్రం వచ్చేస్తుందా? ఇంకా ఎక్కువసేపు ఆపితే ప్రయాణీకులందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు, అది చూసుకోండి…' అంటూ యీ ధోరణిలోనే కాస్త చెప్పి  నిదానంగా ఆలోచించడానికి వ్యవధి యివ్వడానికి నేను ''రావుగార్ని చూసి వస్తాను'' అంటూ వాళ్ల మానాన వాళ్లను వదిలేసి ఆయన కంపార్టుమెంటు వద్దకు నడిచాను. ఆయన గుమ్మంలో నిలబడి వున్నారు.

ఆయనకు నమస్కారం పెట్టి ''నాకు సాధ్యమైనంత చేశాను. మీరు స్థిమితపడి, కాస్త లోపలకి వెళ్లండి.'' అని లోపల కూర్చోబెట్టాను. అవీ యివీ మాట్లాడుతూండగానే విద్యార్థులు మనసారా నాలుగైదు సార్లు ఫుల్‌-త్రోటెడ్‌ నినాదాలు యిచ్చి చెల్లా చెదరవసాగారు. 

రైలు కదిలింది. 

xxxxx

బుడుగుకి పెద్దయ్యాక జట్కా తోలాలన్న కల వున్నట్టే – ఏ కామిక్స్‌ బుక్కో చూశానో ఏమో – నాకూ గుఱ్ఱమెక్కాలన్న కల చిన్నప్పటినుండీ వుండేది.  పెద్దయ్యాక మసూరీలో ఐయేయస్‌ ట్రెయినింగ్‌ సందర్భంగా గుఱ్ఱపుస్వారీ నేర్పారు. ఆ కల నెరవేరింది. అయితే యీ విద్య ఎలా వుపయోగపడుతుందా అని అనుకుంటూండేవాణ్ని. చీరాల ఔటర్‌నాటి సంఘటనలు జరిగినప్పుడు మంత్రివర్యులను స్థానిక కలక్టర్లు గుఱ్ఱం ఎక్కించి – నిస్సహాయ స్థితిలోవున్న కథానాయికను రాకుమారుడు తప్పించి తీసుకుని పోయినట్టు- సురక్షిత ప్రదేశానికి తీసుకుపోవాలన్న వుద్దేశంలో నేర్పించారేమో  అనిపించింది ఆ రాత్రి యింటికి తిరిగి వచ్చేటప్పుడు!

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version