ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…2

ఇక్కడే నెల్సన్‌ మండేలా ఔదార్యం కనబడుతుంది. 28 ఏళ్లు తెల్లవారి జైళ్లలో మగ్గినా కక్షసాధింపు చర్యలు చేపట్టలేదాయన. విప్లవ నాయకుడిగా వెలుగొందిన ఆయన రాజ్యాధికారం చేపట్టిన తర్వాత గొప్ప స్టేట్స్‌మన్‌గా, ఉదారవాదిగా వన్నెకెక్కాడు. పొరుగున…

ఇక్కడే నెల్సన్‌ మండేలా ఔదార్యం కనబడుతుంది. 28 ఏళ్లు తెల్లవారి జైళ్లలో మగ్గినా కక్షసాధింపు చర్యలు చేపట్టలేదాయన. విప్లవ నాయకుడిగా వెలుగొందిన ఆయన రాజ్యాధికారం చేపట్టిన తర్వాత గొప్ప స్టేట్స్‌మన్‌గా, ఉదారవాదిగా వన్నెకెక్కాడు. పొరుగున ఉన్న జింబాబ్వే (ఒకప్పటి రొడీషియా)లో వలె నల్ల-తెల్ల జాతుల చిచ్చు రగలకుండా క్షమాగుణం ప్రదర్శించి, అందరినీ కలుపుకువచ్చే ప్రయత్నాలు చేశాడు. జాతి వివక్షలో మగ్గిన దక్షిణాఫ్రికాకు ఇది ఒక కొత్త అనుభవం. నల్లవారి నుండి భయం లేదని తెల్లవారికి నమ్మకం కలిగించడం, తెల్లవారిపై పగ తీర్చుకోనక్కరలేదని నల్లవారికి నచ్చచెప్పడం, పూర్వ ప్రభుత్వానికి వత్తాసు పలికినా, ఈ ప్రభుత్వం వేధించదని ఇతర జాతీయులకు విశ్వాసం కలిగించడం –  ఇవన్నీ మండేలా తన నిజాయితీతో, చాకచక్యంతో సాధించిన అద్భుత విజయాలు! 

వైషమ్యాలు, పాత కక్షలు మర్చిపోయి అందరూ కలిసి భావికేసి సాగేలా చేసే ఆ కృషిలో భాగమే ఈ సత్యనిర్ధారక, సమన్వయ సమితి స్థాపన. ఆనాటి సంఘటనల నిజానిజాలు వెలికిదీసి, సంబంధిత వ్యక్తుల చేత యదార్థాలు చెప్పించి, తిరిగిరాని గతంతో సమాధానపడి, 'జరిగినదేదో  జరిగినది. ఇక వాటిని మర్చిపోదాం' అనే స్ఫూర్తితో జాతుల మధ్య సమన్వయం సాధించడానికే ఆ సమితి ఏర్పడింది.  క్రైస్తవ మతంలో ఉన్న ఒప్పుకోలు (కన్ఫెషన్‌) అనే సదాచారానికి అనుగుణంగా ఉన్న ఆ సమితికి ఛైర్మన్‌గా వున్నది క్రైస్తవ మత గురువైన ఆర్చి బిషప్‌ డెస్మాంట్‌ టుటు. 

1980లో దక్షిణాఫ్రికాలో నల్లవాళ్లు, అత్యధిక సంఖ్యలో నివసించే సొవేటోలో ఏం జరిగిందో నిజం తెలుసుకోవడానికి విన్నీ సహాయం కోరిందా సమితి. 1980లలో రాజకీయ పరిస్థితులు వేరు. జాత్యహంకార తెల్లప్రభుత్వం అధిక సంఖ్యాకులైన నల్లవారిని చిత్రహింసలు పెట్టింది. వారు ఏర్పరచుకున్న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెసు (ఎ.ఎన్‌.సి.)ను నిషేధించింది. వారి నాయకులను చెరబట్టింది, వేధించింది. నల్ల వారిని కేసుల్లో ఇరికించి వారి జీవితం దుర్భరం చేసింది. వారిలో వివిధ తెగలవారికి విభేదాలు ఏర్పరచి తగవులాడుకునేట్టు చేసింది. దానికి ప్రతిగా నల్లవారు హింసను హింసతో ఎదుర్కొన్నారు. తెల్లవారితో, రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం సాగించారు. నల్లవారిలో కొందరిని పోలీసు ఏజెంట్లుగా ప్రభుత్వం ప్రవేశపెడితే, తెల్లవారిని ఏదో విధంగా అప్రతిష్టపాలు చేసి రాజకీయ యుద్ధానికి ఊతమివ్వాలని పథకాలు వేశారు నల్లవారు. ఈ యుద్ధ వాతావరణంలో అమాయకులు కూడా బలయిపోయారు. పరస్పర సందేహాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఒక్కొక్కసారి విప్లవాన్ని తప్పుదోవ పట్టించాయి. ఆ విషపూరిత వాతావరణంలో జరిగిన పొరపాట్లను తెలుసుకొని, సత్యాన్ని నిర్ధారించి, నీతిని ప్రతిష్ఠాపించాలనే ఉద్ధేశ్యంతోనే ఆ సమితి పని చేస్తోంది.

ఆనాటి విషయాలు విన్నీ కంటే ఎవరికి బాగా తెలుస్తాయి? ఆ పోరాటాన్ని సాగించిన నాయకురాలు ఆమే కదా. ఆ పోరాటంలో విజయం సాధించినమాట నిజమే. కాని పోరాటమార్గంలో జరిగిన పొరపాట్లకు బాధ్యత వహించాలిగా! ఆమె సమితిలో ఎదుర్కొన్న 18 కేసుల్లో ఎనిమిది కేసులు హత్యలకు సంబంధించినవి. వాటిలో ముఖ్యమైనవి నాలుగు. అవి విన్నీ స్థాపించిన మండేలా యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వర్యాన జరిగిన నేరాలు. 14 సంవత్సరాల స్టాంపీ అనే కుర్రాణ్ని పోలీసు ఏజంటు అనే అనుమానంతో చిత్రవధ చేసి చంపించిందని ఒక కేసు. అదే విధంగా తన సహచరుల జాడ పోలీసులకు చెప్పేసి వుంటాడన్న అనుమానంపై సోవో అనే యువకుణ్ణి చంపించిందనీ, తనడిగిన విధంగా సర్టిఫికెట్‌ ఇవ్వలేదన్న కారణంగా ఒక భారతీయ డాక్టరును చంపించిందనీ మరో రెండు కేసులు. వీటన్నిటిలోనూ సాకక్షులున్నారు. సమరరంగంలో విన్నీ పాత్రపై చేసిన ఆరోపణలివి.

విన్నీ తన 24వ ఏట తండ్రి మాటను కాదని, రెండో పెళ్లివాడైన 40 ఏళ్ల నెల్సన్‌ మండేలాను పెళ్లాడింది. వివాహమైన నాలుగేళ్లకే భర్త జైలుపాలయ్యేడు. 28 ఏళ్ల పాటు భర్త జైలులో మగ్గుతూండగా ఆమె బయట వుండాల్సి వచ్చింది. పోరాటంలో పాల్గొనే రోజుల్లోనే ఆమెకు తాగుడు అలవాటయింది. అనేకమందితో తిరిగేదని కూడా వార్తలు వచ్చేయి. 1990లో భర్త జైలునుండి బయటకు వచ్చేక ఇద్దరి మధ్య విముఖత పెరిగింది. ఏప్రిల్లో విడాకులు అనే మాట లేకుండానే తనూ, విన్నీ వేరువేరుగా నివసించడానికి నిశ్చయించుకున్నామని మండేలా ప్రకటించారు. తనకంటే 29 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తికి విన్నీ రాసిన పాత ప్రేమలేఖ పత్రికల్లో ప్రచురించడంతో ఆమె అభాసుపాలయింది. ఎ.ఎన్‌.సి.లోని అన్ని పదవులకు రాజీనామా చేసిందామె. తర్వాత 1994లో భర్త ప్రభుత్వంలో చేరినా, సంయమనం పాటించక భర్తను నానా తిప్పలు పెట్టింది. భర్త అన్ని జాతులను కలుపుకు రావడానికి కృషి చేస్తూంటే నల్లవారికి రావలసిన వాటా రావటం లేదనీ, ఈ ప్రభుత్వం కూడా నల్లవారికి ఒరగబెట్టినదేమీ లేదని దుమ్మెత్తిపోసింది. భరించలేక 1995లో భర్త ఆమెకు మంత్రిణిగా ఉద్వాసన చెప్పవలసి వచ్చింది. 

చివరకు 1996 మార్చిలో నెల్సన్‌ మండేలా విడాకులకై అర్జీ పెట్టుకున్నారు. భార్య శీలం మంచిది కాదనీ (అడల్టరీ), ఆదాయానికి మంచిన ఖర్చు పెడుతుందని ఆయన వాదన. విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత మండేలా మొజాంబిక్‌ దివంగత నేత సమోరా భార్యయైన 55 ఏళ్ల గ్రేసా మాషెల్‌తో ప్రేమలో పడ్డారు. విన్నీ విడాకులు పుచ్చుకున్న తర్వాత తన పుట్టింటివారి ఇంటిపేరైన 'మడికిజెలా'ను తన పేరుకు చేర్చుకుంది. ఇప్పుడామె విన్నీ మడికిజెలా మండేలా. సత్య నిర్ధారక సమితి ముందు వచ్చిన కేసుల్లో విన్నీ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో సభ్యుడైన ఒకతనిపై మనసుపడి అతని ప్రియురాలైన ద్లామిని అనే ఆమెను కొట్టించిందని ఒక ఆరోపణ వచ్చింది. సమితి విచారణ జరిగేటప్పుడు బాధితుల తరఫు న్యాయవాదులు విన్నీని అనేక ప్రశ్నలు వేసారు – 'నీకూ, నీ కూతురికి ఒకడే ఉమ్మడి ప్రియుడట కదా?', 'నువ్వు ఇద్దరు పోలీసుల వాళ్లతో ఒకేసారి శయనించావా?' – ఇటువంటివి. సమితి కార్యాలయం బయట చూస్తే విన్నీని బలపరుస్తూ ప్రజాప్రదర్శనలు, లోపల చూస్తే ఇలాటి ఆరోపణలు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)    

[email protected]

Click Here For Part-1