ఎమ్బీయస్‌ : చెన్నారెడ్డితో పోలికెందుకు?

కాంగ్రెసుతో విలీనమవుతారా? అని అడిగితే 'మరో చెన్నారెడ్డి కాబోను' అన్నారు కెసియార్‌. చెన్నారెడ్డి చేసినదేమిటి? ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో ఉధృతంగా ఉద్యమం నడిపి తెలంగాణ ప్రజా సమితి పేర 1971 ఎన్నికల్లో ఘనవిజయం…

కాంగ్రెసుతో విలీనమవుతారా? అని అడిగితే 'మరో చెన్నారెడ్డి కాబోను' అన్నారు కెసియార్‌. చెన్నారెడ్డి చేసినదేమిటి? ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో ఉధృతంగా ఉద్యమం నడిపి తెలంగాణ ప్రజా సమితి పేర 1971 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, తర్వాత తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసేసి, తనూ, తన అనుచరులు పదవులు అనుభవించారు. దరిమిలా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తెలంగాణ విడిగా వుండాలని 1956లో సైతం వాదిస్తూ వచ్చిన ఆయన ఒకసారి తను ముఖ్యమంత్రి కాగానే 'తెలంగాణ అంశం ముగిసిపోయింది' అని డిక్లేర్‌ చేశారు. తన నెవరైనా విభజనవాది అంటే కోపం తెచ్చుకునేవారు. అంటే తనకు ముఖ్యమంత్రి పదవి తప్ప తెలంగాణ అనేది సమస్యే కాదని ఆయన భావం. 

మరి కెసియార్‌ అలాగ కాదే! తనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారన్న విషయం నిజమే అయినా కేంద్రమంత్రి పదవి వచ్చాక కూడా ఉద్యమం ఆపలేదే! పైగా ఆ పదవి వదిలేసి, రాష్ట్రంలో కూడా తన అనుచరుల చేత పదవులు త్యాగం చేయించి, ఉద్యమం కొనసాగించారు. అది కూడా ఎన్నో ఒడిదుడుకులతో నడిచింది. ఒక థలో దాదాపు మూతపడింది. కాంగ్రెసు అంతర్గత రాజకీయాల వలన మళ్లీ ఊపిరి పోసుకుంది. కెసియార్‌ పుష్కరం పాటు ఓపిగ్గా వేచి చూశారు. నిరంతరం అదే ధ్యాసలో వుండి, తెలంగాణలో రాజకీయం చేయదలచిన ప్రతి నాయకుడు విభజనకు అనుకూలంగా మాట్లాడవలసిన అగత్యాన్ని కల్పించారు. విభజనకు ప్రతికూలంగా వున్నవారు మౌనంగా వుండవలసిన ఆవశ్యకతను సృజించారు. చెన్నారెడ్డి విలీనం చేసి తెలంగాణ విభజనను విస్మరించారు. కెసియార్‌ విభజన విస్మరించలేదు సరికదా, తెలంగాణపై ప్రకటన వెలువడినా పార్టీని విలీనం చేయడానికి సరేననటం లేదు. మరి పోలిక ఎక్కడ? సామాన్య ప్రజలెవరూ అలా ఆరోపించలేదు, కెసియార్‌ వ్యతిరేకులు సైతం చెన్నారెడ్డి పోకడలు పోతున్నావని అనలేదు. మరి ఎవరికీ లేని డౌటు కెసియార్‌కు ఎందుకు వచ్చింది?

కాంగ్రెసు పార్టీలో విలీనమైతే టిడిపి నెత్తిపై పాలు పోసినట్టే అన్నారు కెసియార్‌. ఎందుకంటే యాంటీ-ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఓటంతా టిడిపికి పోతుంది. జీవచ్ఛవంలా వున్న టిడిపికి ఆయువు పోసి, బతికించడం దేనికి? అని పాయింటు లాగారు. ఈ ముక్క నాబోటివాడికి కూడా ఎప్పుడో తెలిసినప్పుడు యిన్నాళ్లూ కెసియార్‌కు తట్టలేదా? ఈ విషయం ఆలోచించకుండానే 'తెలంగాణ యిస్తే … కాంగ్రెసులో విలీనం' ఆఫర్‌ యిచ్చారా? ఆయన ఆఫర్‌ యివ్వడం తరవాయి, టి-కాంగ్రెసు వాళ్లు అది నమ్మేసి, సోనియాకు చెప్పడం జరిగాయి. తెలంగాణ యిస్తే కెసియార్‌ యింటి దగ్గర ముగ్గురికి మించి (కొడుకు, కూతురు, మేనల్లుడు అని భావం కాబోలు) వుండరని హనుమంతన్న గంతులేయడమూ జరిగింది. ఇప్పుడు ఆయనే 'కాంగ్రెసులో చేరండయ్యా బాబూ' అని తెరాస వారిని బతిమాలుతున్నాడు. ఊరూరా తిరుగుతూ కాంగ్రెసు ఓటు బ్యాంకు పెంచేస్తానంటూ ఆయన మొదలెట్టిన బస్సుయాత్ర ఏమైందో తెలియలేదు. తెలంగాణ తెచ్చేమని ప్రదర్శనలు చేయమని టి-కాంగ్రెసు నేతలకు హై కమాండ్‌ ఎంత చెప్పినా వాళ్లు కదలటం లేదు. అంతిమంగా ఎన్నికలకు ముందుగా తెలంగాణ వస్తుందో లేదోనన్న భయం వాళ్లనూ పీడిస్తోంది. పైగా తెరాసను కలిపేసుకున్నా, లేక పొత్తు కుదుర్చుకున్నా తమకు టిక్కెట్టు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో సొంత డబ్బుతో ఎవరు ర్యాలీలు నిర్వహిస్తారు?

కాంగ్రెసులో విలీనమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపి పట్టుకుపోతుందని కెసియార్‌ చెప్తున్నారు. అందువలన పొత్తుతో సరిపెడతామంటున్నారు. పొత్తు పెట్టుకున్నా యీ భావమే ప్రజల్లోకి వెళుతుంది కదా. అధికారపార్టీతో పొత్తు పెట్టుకున్నాక, ప్రభుత్వవైఫల్యాల గురించి వారిని ఎలా విమర్శించగలరు? మరి అలా అయితే పొత్తు ఎందుకు పెట్టుకున్నావ్‌? అని ఓటర్లు అడుగుతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటె తెలంగాణ యిచ్చిన కృతజ్ఞత ఎక్కువ ఓట్లు తెస్తుందని అనుకుంటేనే విలీనం గురించి కానీ, పొత్తు గురించి కానీ ఆలోచించాలి. ఈ మాట కెసియార్‌కి తోచకుండా వుండదు. ఇదీ చెప్తారు – ఎన్నికల ప్రకటన వచ్చాక! విలీనం అని ఆశ పెట్టి కాంగ్రెసును యిక్కడిదాకా తీసుకుని వచ్చారు కదా. ఇప్పుడు దాన్ని పలుచన చేసి పొత్తు అంటున్నారు. పార్లమెంటులో బిల్లు పాసయ్యాక పొత్తు కుదరదంటూ యీ కారణాలు చెప్తారు. 

మాటవరసకి పొత్తుకు సరే అన్నా చర్చలు ముందుకు సాగడం చాలా కష్టం. తెరాస లక్ష్యం 100 ఎసెంబ్లీ సీట్లు, 15 పార్లమెంటు సీట్లు. తెలంగాణ వచ్చింది కదాని అది సంతృప్తి పడి కూర్చోదు. మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చి తెచ్చిన తర్వాత కాంగ్రెసు పార్టీ దుకాణం మూసేసిందా? అధికారానికి ఎగబడింది కదా! తగినన్ని సీట్లు రాకపోతే ప్రకాశం గారికి సిఎం పదవి ఎర వేసి, వెనకనుండి చక్రం తిప్పింది. తెరాస కూడా రాజకీయపార్టీయే! 2014లో రాబోయే సంకీర్ణప్రభుత్వం నుండి కావలసినంత పిండుకోవడానికి చాలా సీట్లు తెచ్చుకోవాలి. నిలబడిన చోటల్లా నెగ్గడం అసంభవం కదా. కనీసం 12 పార్లమెంటు సీట్లు గెలవాలంటే 15 సీట్లలోనైనా నిలబడాలి, అలాగే 80 ఎసెంబ్లీ సీట్లు కావాలంటే 100 చోట్ల నిలబడాలి. ఉన్న 119 సీట్లలో కాంగ్రెసు అభ్యర్థుల్లో సిటింగ్‌ వాళ్లే దాదాపు 50 మంది వున్నారు. కొందరు పార్టీ విడిచిపోయినా, ఆశావహులు వుంటారుగా.  కొద్ది మార్జిన్‌లో ఓడిపోయిన వారు కూడా టిక్కెట్లు ఆశిస్తారు. అందువలన మహా అయితే కాంగ్రెసు సగం, సగం బేసిస్‌పై 60 సీట్లు ఆఫర్‌ చేస్తే తెరాసకు ఏం సరిపోతాయి? 

ప్రాంతీయపార్టీ, జాతీయ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నపుడు ప్రాంతీయపార్టీకి 75% అసెంబ్లీ సీట్లు, 25% పార్లమెంటు సీట్లు ఆఫర్‌ చేస్తూ వుంటారు. ఆ లెక్కన కాంగ్రెసు తెరాసకు 90 అసెంబ్లీ సీట్లు యిచ్చిందనుకుందాం. వాటిలో 70 గెలిచినా తెరాస ప్రభుత్వం ఏర్పరచగలదు. కానీ పార్లమెంటు సీట్ల వద్దకు వచ్చేసరికి 4 ఎంపీ సీట్లు మాత్రమే యివ్వచూపితే కెసియార్‌కు రుచించదు. ఎందుకంటే జాతీయస్థాయిలో ఆయన ఎన్‌డిఏ, మూడో ఫ్రంట్‌, యుపిఏ – ఏ ఆప్షన్‌ ఎంచుకోవలన్నా తగినన్ని సీట్లు చేతిలో వుండాలి. 4 యిస్తే వాటిలో మూడు గెలిచారనుకుంటే అవేం సరిపోతాయి? 2014 ఎన్నికలే తెరాసను శిఖరస్థానం. ఆ తర్వాత నుండి కిందకు దిగడం సహజం – తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పరచి అద్భుతంగా పాలించేస్తే తప్ప! ఈ 2014 అవకాశం మళ్లీ మళ్లీ రాదనుకున్నపుడు అసెంబ్లీ, పార్లమెంటు రెండిటిలోనూ 75% స్థానాలు తెరాస కోరవచ్చు. ఇక కాంగ్రెసుకు దక్కేదేముంది? ఇలా చూస్తే వారి మధ్య పొత్తు కుదిరే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి. 

అది మనసులో పెట్టుకునే కెసియార్‌ మడత పేచీలు పెడుతున్నారు. ఆయన ఆంక్షలు లేని తెలంగాణకు ఒప్పుకోవటం లేదు. కాంగ్రెసు పార్టీలో విలీనమైతే వాళ్లు చెప్పినట్టే వినాలి. తనకంటూ సొంత విధానం మిగలదు. విలీనానికి ముందు ప్రజారాజ్యం పార్టీది సమైక్యవాదం. కాంగ్రెసులో విలీనమయ్యాక వాళ్లు విభజన అంటే వీళ్లూ సరేననాల్సి వచ్చింది. కాంగ్రెసు వాళ్లది రాష్ట్ర విభజనతో ప్లస్‌ ఆంక్షలున్న తెలంగాణ! ఆంక్షలున్న తెలంగాణకు అంగీకరిస్తే తను మరొక చెన్నారెడ్డిని అయినట్టే అని కెసియార్‌ ప్రకటిస్తున్నారు. ఆయన చెన్నారెడ్డి తరహా కాదని మనకు తెలుసు కాబట్టి దీని అర్థం – ఆంక్షల తెలంగాణకు అంగీకరించినవారు చెన్నారెడ్డి వంటి వారే అని! అంటే హై కమాండ్‌ మాట విని ఆంక్షల తెలంగాణకు తలవూపిన టి-కాంగ్రెసు వారిని కెసియార్‌ తెలంగాణ ద్రోహులుగా ముద్ర కొట్టబోతున్నారు. '28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు తెలంగాణకు ఎందుకు? వారికో రూలు, మాకో రూలా? ఏం తెలంగాణ అంటే కాంగ్రెసుకు అంత చులకనగా వుందా!?' అన్న నినాదానికి ప్రజల్లోకి చొచ్చుకుపోయే శక్తి వుంది. దీనికి కొనసాగింపుగా కాంగ్రెసు అధిష్టానం సీమాంధ్ర పెట్టుబడిదారులకు బ్లాక్‌మెయిల్‌కు, వారి డబ్బుమూటలకు లొంగిపోయిందని చెప్తారు. తెలంగాణ వచ్చినా ఆంక్షల తొలగింపుకు మళ్లీ ఉద్యమం చేయవలసిన అవసరం వుందనీ, అది తెరాసకు మాత్రమే సాధ్యమనీ, సీమాంధ్రలో రాజకీయ అస్తిత్వం కోసం అలమటించే కాంగ్రెసు యీ ఉద్యమంలో పాలు పంచుకోలేదు సరికదా, దాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తుందని, అందుకని తాము సోనియాకు కృతజ్ఞత తెలుపుతూనే కాంగ్రెసుకు దూరంగా మసలు కుంటున్నామనీ కెసియార్‌ వాదించగలరు. దీన్ని తెలంగాణ కాంగ్రెసు ఎలా ఎదుర్కోగలదో వేచి చూడాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]