విదేశీ విచిత్రం -కామెడీకి, కాంబినేషన్‌కే..

తెలుగు సినిమా పరిధి గత అయిదారేళ్లలో బాగా పెరిగింది. ప్రతి ఏరియా మార్కెట్‌ గణాంకాల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఓవర్సీస్‌’ మార్కెట్‌లో తెలుగు సినిమా రేంజ్‌ అమాంతం రెండింతలైంది. ఇంత రేంజ్‌లో మరెక్కడా…

తెలుగు సినిమా పరిధి గత అయిదారేళ్లలో బాగా పెరిగింది. ప్రతి ఏరియా మార్కెట్‌ గణాంకాల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఓవర్సీస్‌’ మార్కెట్‌లో తెలుగు సినిమా రేంజ్‌ అమాంతం రెండింతలైంది. ఇంత రేంజ్‌లో మరెక్కడా బిజినెస్‌ పెరగలేదు. అయితే ఈ మార్కెట్‌ని నమ్ముకోడానికి లేదు. ఎందుకంటే స్టాక్‌ మార్కెట్‌లాగా ఇది కూడా పడుతూ లేస్తూ ఉంటుంది తప్ప పట్టుమని కొన్ని నెలలైనా అలా కుదురుగా ఓ చోట ఉండదు. దీంతో ఓవర్సీస్‌ బయ్యర్లు ఏ సినిమాపై ఎక్కువ పెట్టుబడి పెట్టొచ్చో, దేని విషయంలో జాగ్రత్త పాటించాలో తెలియక పిల్లిమొగ్గలు వేసేస్తున్నారు. 

ఒక సినిమాతో రెండు కోట్ల లాభం వచ్చిందని సంబరపడితే తదుపరి కొన్న సినిమాతో మూడు కోట్లు ఆంఫట్‌ అయిపోతుంది. ఫలానా హీరో గత సినిమా అదరగొట్టేసింది కదా అని అతని మలి చిత్రాన్ని కొంటే అది హడలగొట్టి పెట్టిన డబ్బు హారతి కర్పూరం చేసేస్తుంది. మరి ఈ మార్కెట్‌కి ముక్కు తాడు వేసి దారికి తెచ్చుకునేది ఎలా? ఈ మార్కెట్‌పై పూర్తి అధికారం సాధించి ఓవర్సీస్‌ కింగ్స్‌ అయ్యేదెలా? 

కొన్నేళ్ల నుంచి ఇక్కడి ట్రెండ్‌ని పరిశీలించినట్టయితే ఏ హీరోపై పెట్టుబడి పెడితే సేఫ్‌గా ఉండొచ్చు. ఎలాంటి సినిమాలతో అయితే లాభాలు రాబట్టుకోవచ్చు. ఎవరి కాంబినేషన్‌పై అయితే నిర్భయంగా కోట్లు కుమ్మరించవచ్చు అనేది అర్థం చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. ఓవర్సీస్‌ మార్కెట్‌ వరకు మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌ కింగ్స్‌. వీరిద్దరి సినిమాలపై బయ్యర్లు కాన్ఫిడెంట్‌గా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలా అని వీరిద్దరూ ఎవరితో చేసినా కానీ వర్కవుట్‌ అయిపోతుందా అంటే… అలా జరుగుతుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే వీళ్లిద్దరూ నటించిన రీసెంట్‌ మూవీస్‌లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఓవర్సీస్‌లో బయ్యర్స్‌కి నష్టాలు తెచ్చిపెట్టాయి. అంటే ఇక్కడ వీరు చేస్తున్న జోనర్‌ ఆఫ్‌ మూవీస్‌తో పాటు డైరెక్టర్‌ బ్రాండ్‌ వేల్యూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. 

డైరెక్టర్‌ బ్రాండ్‌ వేల్యూ ఏమిటనే సందేహం రావచ్చు. ఓవర్సీస్‌ మార్కెట్‌ని కొందరు డైరెక్టర్లు శాసిస్తున్నారు. ఫలానా దర్శకుడి సినిమా అంటే కార్లేసుకుని మైళ్ల దూరం వచ్చేసి సినిమా చూసేస్తారు. వీళ్ల సినిమాలపై రివ్యూల ఎఫెక్ట్‌ కూడా తక్కువే. మినిమమ్‌ 3 రేటింగ్‌ వచ్చిందంటే చాలు… ఫలానా దర్శకుడి సినిమా సరదాగా చూసేయవచ్చని అక్కడి వారి నమ్మకం. ఓవర్సీస్‌ పరంగా రూలర్స్‌ ఎవరు? త్రివిక్రమ్‌, శ్రీను వైట్ల, రాజమౌళి, శేఖర్‌ కమ్ముల… ఈ దర్శకుల సినిమాలకి అక్కడ గిరాకీ బాగా ఎక్కువ. ఈ దర్శకులకి పవన్‌కళ్యాణో, మహేష్‌బాబో జత కలిసాడు అనుకోండి.. ఇక ఆకాశమే హద్దు! ఉదాహరణకి మహేష్‌, వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘దూకుడు’, పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చి అక్కడ చరిత్ర సృష్టించిన ‘అత్తారింటికి దారేది’ ఉండనే ఉన్నాయి. 

వైట్ల శ్రీను కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ నటిస్తే ‘బాద్‌షా’ మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. మాస్‌ హీరో అయిన ఎన్టీఆర్‌కి ఓవర్సీస్‌లో ఎప్పుడూ అంత కలెక్షన్‌ రాలేదు. ఆ సినిమాతో ఎన్టీఆర్‌ రేంజ్‌ కూడా పెరిగిందిఅని వాదించే అవకాశం లేకుండా అతని మలి చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ పల్టీ కొట్టింది. బాద్‌షాకి 75 లక్షల వరకు లాభం వచ్చిందని ‘రామయ్యా వస్తావయ్యా’పై నమ్మకంగా పెట్టుబడి పెడితే దీంతో మూడు కోట్లకి పైగా నష్టం చవిచూడాల్సి వచ్చింది. ‘అత్తారింటికి దారేది’ సినిమా కొన్న వాళ్లే ‘రామయ్యా వస్తావయ్యా’ కూడా కొన్నారు. ‘అ.దా’తో దాదాపు మూడు కోట్ల లాభం చూస్తే దానికి మించిన నష్టాన్ని దీంతో చవిచూడాల్సి వచ్చింది. ఏది కొనాలో, ఏది వదిలేయాలో అనేది కూడా ఈ మార్కెట్‌లో కీలకాంశం. ఇక్కడి వ్యాపారం అచ్చంగా గ్యాంబ్లింగ్‌ని తలపిస్తుంది. టెక్సాస్‌ హోల్డెమ్‌ పోకర్‌లో ఏ కార్డులపై బెట్‌ వేస్తే గెలుస్తామో, వేటిపై వేస్తే కోల్పోతామో అన్ని కార్డులు తిరిగే వరకు తెలీదు. తెగించి రిస్క్‌ చేస్తే లాభం భారీగా చూడొచ్చు లేదా మొత్తానికి మునిగిపోవచ్చు. ఓవర్సీస్‌ బిజినెస్‌ అంటే ‘సరైన కార్డులని ఎంచుకోవడం… వాటిపై మీ చిప్స్‌ పెట్టడమే’. పైన చెప్పిన హీరోలు, దర్శకులు అయితే ఏసెస్‌ అన్నమాట. వారిపై బెట్‌ వేస్తే గ్యారెంటీ ఎక్కువ. మిగతా వారితో మాత్రం అయితే అటు లేదంటే ఎటో!

దీనికో ఉదాహరణగా ‘బలుపు’ సినిమాని చెప్పుకోవచ్చు. రవితేజ వరుసగా ఫ్లాప్‌లిస్తున్నాడు. ‘బలుపు’కి దర్శకత్వం వహించిన మలినేని గోపీచంద్‌కి కూడా పెద్ద చెప్పుకోతగ్గ ట్రాక్‌ రికార్డ్‌ ఏమీ లేదు. మరి ఈ సినిమాపై పెట్టుబడి పెట్టొచ్చా. రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఎక్కువ ఇన్‌వాల్వ్‌ అయిన ఈ సినిమాపై పెట్టుబడి మరీ ఎక్కువ పెట్టక్కర్లేదు. పోతే కొంత పోతుంది… కాని కొడితే కొండ కదిలొస్తుంది. ఆ రిస్క్‌ తీసుకున్న బయ్యర్‌కి అది బ్రహ్మాండంగా పే చేసింది. తొంభై నాలుగు లక్షల రూపాయల లాభం తెచ్చిపెట్టింది. ఇది చూసి గుడ్డిగా రవితేజ నెక్స్‌ట్‌ సినిమాపై ఎక్కువ పెట్టాశారనుకోండి. రిజల్ట్‌ ఏమవుతుందనేది సదరు పెట్టుబడిదారుని అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ‘గుండెజారి గల్లతయ్యిందే’ది కూడా ‘బలుపు’ బాపతు కథే. దీనిపై బెట్టింగ్‌ వేసిన బయ్యర్‌ 74 లక్షల రూపాయల లాభం చవిచూసాడు. ఒక చిన్న రేంజ్‌ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే స్థాయిలో ఫలితమిది. ఇంతకుముందు చెప్పుకున్న దర్శకుల లిస్ట్‌లో చంద్రశేఖర్‌ ఏలేటికి కూడా చోటివ్వవచ్చు. ఇతని సినిమాలన్నా అక్కడి వారికి గురి. అందుకే ‘సాహసం’ లోకల్‌గా ఫ్లాప్‌ అయినా ఓవర్సీస్‌లో మాత్రం ఇరవై లక్షలకి పైగా ప్రాఫిట్‌ చూసింది. 

ఓవర్సీస్‌ మార్కెట్‌లో సినిమాలు పల్టీ కొట్టేస్తాయో లేదో చెప్పడానికి కొన్ని బండ గుర్తులు ఏమిటంటే… హీరో కత్తి పట్టి పరుగెడుతున్నట్టు, నెత్తురోడుతున్న పోస్టర్లు, అచ్చమైన మాస్‌ మసాలా సినిమా అనిపించే టైటిల్‌ ని బట్టి ఫలానా సినిమా వర్కవుట్‌ కాదని ముందే ఫిక్స్‌ అయిపోవచ్చు. రచ్చ, నాయక్‌ సినిమాలు ఇక్కడ బ్రహ్మాండంగా ఆడేసాయి. ఇండస్ట్రీ టాప్‌ సినిమాలతో సమానంగా ఇక్కడ ఫేర్‌ చేసాయి. కానీ ఓవర్సీస్‌లో ఎందుకు ఫ్లాప్‌ అయ్యాయి. రీజన్‌ చాలా సింపుల్‌. ఓవర్సీస్‌ ఆడియన్స్‌కి ‘షుగర్‌ కంటెంట్‌’ ఎక్కువ ఉండాలి. కారాలు, మిరియాలు, మసాలాలు వీలైనంత తక్కువ ఉండాలి. ఈ బ్యాలెన్స్‌ పాటించి, పోటీ లేని సమయం దొరికితే మిర్చి లాంటి కమర్షియల్‌ సినిమా కూడా ఓవర్సీస్‌లో 70 లక్షల లాభం చవిచూసింది. 

విమర్శకుల ప్రశంసలు పొందిన చిన్న చిత్రాలు ఓవర్సీస్‌లో ఆదరణకి నోచుకున్నాయి. భారీ లాభాలు చూడకపోయినా, స్వామిరారా, ప్రేమకథా చిత్రమ్‌, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లాంటి చిన్న చిత్రాలు అక్కడ బయ్యర్లని సంతోషపెట్టాయి. లోకల్‌ మార్కెట్‌లో తమ ప్రభావాన్ని కోల్పోయినట్టే సీనియర్‌ హీరోలు ఓవర్సీస్‌లో కూడా పూర్తిగా ప్రభావం కోల్పోయారు. వెంకటేష్‌ షాడో, మసాలా బయ్యర్లకి గుండు కొట్టాయి. నాగార్జున గ్రీకువీరుడు, భాయ్‌ కూడా అదే బాట పట్టాయి. ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఆదినుంచీ స్ట్రగుల్‌ అవుతున్న చరణ్‌ ‘తుఫాన్‌’తో మర్చిపోలేని డిజాస్టర్‌ ఇచ్చాడు. చరణ్‌లాంటి మాస్‌ హీరోకి ఓవర్సీస్‌ మార్కెట్‌ పెరగాలంటే ఒకటే దారి. త్రివిక్రమ్‌, శ్రీను వైట్లలాంటి దర్శకులతో పని చేయాలి. లేదంటే ఇక్కడ ఎంత ప్లస్‌లో ఉన్నా అక్కడ మైనస్‌కి కూడా రెడీ అయిపోవాలి. 

ఓవర్సీస్‌ మార్కెట్‌ని నైజాం, సీడెడ్‌, వైజాగ్‌ తదితర మార్కెట్లతో బేరీజు వేసి బిజినెస్‌ చేయడానికి లేదు. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌ మార్కెట్‌. కామెడీ బాగుంటుందనే నమ్మకం ఉన్న సినిమాలు, కాంబినేషన్స్‌ బాగున్న చిత్రాలు, ఈ ఆర్టికల్‌ ఆరంభంలో చెప్పుకున్న హీరోలు, దర్శకుల చిత్రాలు అయితే బయ్యర్లు రేటు అటు ఇటు అయినా తెగించే సాహసం చేయవచ్చు. కానీ మాస్‌ సినిమాలు, వర్కవుట్‌ అవుతాయనే నమ్మకం లేని సినిమాల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించాలి. అలాంటి సినిమాలపై తెగించి రిస్క్‌ చేసినట్టయితే తెగిపోయాక తల్లడిల్లాల్సి ఉంటుంది. చేతులు కాలాక చేసేదేమీ ఉండదు కాబట్టి కాలకముందే జాగ్రత్తలు తీసుకుంటే పొరపాటున నష్టమొచ్చినా అది మరీ నడ్డి విరిగే స్థాయిలో ఉండదు. మిగిలిన అన్ని మార్కెట్ల కంటే ఓవర్సీస్‌ మార్కెట్‌ని స్టడీ చేయడం, ఫలానా సినిమా రేంజ్‌ ఎంత ఉంటుందనేది పర్‌ఫెక్ట్‌గా అంచనా వేయగలగడం కీలకం. ఏమాత్రం విశ్లేషించుకోకుండా, గుడ్డెద్దు చందంగా డబ్బులు వెదజల్లితే మాత్రం మిగిలేది శూన్యం. 

– గణేష్‌ రావూరి

[email protected]

twitter.com/ganeshravuri