తల్లిదండ్రులే హంతకులు

పధ్నాలుగేళ్ళ అమ్మాయి హత్యకు గురైంది. చంపింది ఆ ఇంట్లో పనిమనిషి హేమ్‌రాజ్‌ అని తొలుత ఆరోపణలు. అంతలోనే, ఆ అమ్మాయి హత్యకు గురైన మరుసటి రోజే హేమ్‌రాజ్‌ కూడా హత్యకు గురయ్యాడు. దాదాపుగా ఇద్దరూ…

పధ్నాలుగేళ్ళ అమ్మాయి హత్యకు గురైంది. చంపింది ఆ ఇంట్లో పనిమనిషి హేమ్‌రాజ్‌ అని తొలుత ఆరోపణలు. అంతలోనే, ఆ అమ్మాయి హత్యకు గురైన మరుసటి రోజే హేమ్‌రాజ్‌ కూడా హత్యకు గురయ్యాడు. దాదాపుగా ఇద్దరూ ఒకే తీరున హత్యకు గురయ్యారు. చంపిందెవరు.? చంపించిందెవరు.? ఇదో మిస్టరీ. ఐదేళ్ళ క్రితం నాటి యదార్ధ ఘటన ఇది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దోషులెవరో న్యాయస్థానం తేల్చింది. తమ కూతుర్ని చంపేశారంటూ మొసలి కన్నీరు పెట్టిన ఆమె తల్లిదండ్రులే దోషులు అని న్యాయస్థానం నిర్ధారించింది. సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ఎవరు హత్య చేశారో తేల్చే క్రమంలో సీబీఐకి సైతం ఏమీ అర్థంకాని పరిస్థితి.

ఎలాగైతేనేం, హత్యలు జరిగిన తీరు కారణంగా డాక్టర్లయిన కసాయి తల్లిదండ్రులే జంట హత్యలకు పాల్పడినట్లు సీబీఐ తేల్చింది. న్యాయస్థానం తనకు అందిన సాక్ష్యాధారాల్ని పరిశీలించి, దోషులెవరో స్పష్టం చేసింది. పధ్నాలుగేళ్ళ ఆరుషిని ఆమె తల్లిదండ్రులు నుపుర్‌ తల్వార్‌, రాజేష్‌ తల్వార్‌ హతమార్చారు.

‘నేను నా కూతుర్ని ఎందుకు చంపుకుంటాను.?’ అంటూ రాజేష్‌ తల్వార్‌ గతంలో మీడియా ముందు కంట కన్నీరు పెట్టేసరికి అంతా ఆయన ఆవేదనను అర్థం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ఆవేదన అంతా భూటకమని, తేనె మాటల వెనుక కసాయితనం వుందని తేలిపోయింది.