జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల ప్ర‌చార టీమ్ ఏదీ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ళ్లు మూసి తెరిచే లోపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చి ప‌డేలా వుంది. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనే అంద‌రి దృష్టి వుంది. ఈ నెల 30న ఎన్నిక‌లు,…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ళ్లు మూసి తెరిచే లోపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చి ప‌డేలా వుంది. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనే అంద‌రి దృష్టి వుంది. ఈ నెల 30న ఎన్నిక‌లు, డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డితే, ఇక చ‌ర్చంతా ఏపీపైనే వుంటుంది.

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వెన్నుద‌న్నుగా నిలిచే నాయ‌క‌త్వాన్ని చూడొచ్చు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ అభ్య‌ర్థుల త‌ర‌పున ఆయ‌న కుమారుడైన మంత్రి కేటీఆర్‌, మేన‌ల్లుడైన మంత్రి హ‌రీష్‌రావు, అక్క‌డ‌క్క‌డ కుమార్తె క‌విత విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. మ‌రోసారి బీఆర్ఎస్‌నే ఎందుకు ఎన్నుకోవాలో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ఆక‌ట్టుకునే ప్ర‌యత్నం చేస్తున్నారు. అలాగే వివిధ టీవీ చాన‌ళ్ల‌కు వెళుతూ గ‌త 9 సంవ‌త్స‌రాల్లో త‌మ పాల‌న‌లో జ‌రిగిన మంచి ప‌నులేంటో వారు వివ‌రిస్తున్నారు.

తెలంగాణ అధికార పార్టీకి ప్ర‌చార‌క‌ర్త‌లుగా కేసీఆర్‌కు దీటుగా ఆయ‌న ర‌క్త సంబంధీకుల‌ను చూస్తున్న నేప‌థ్యంలో, స‌హ‌జంగానే సీఎం జ‌గ‌న్‌కు ఎవ‌రున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. సీఎం జ‌గ‌న్ కాకుండా, వైసీపీ త‌ర‌పున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఎవ‌రున్నార‌నే ప్ర‌శ్న‌కు… ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేర‌నే స‌మాధానం వ‌స్తోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు తోడుగా ఎవ‌రూ లేక‌పోవ‌డమే పెద్ద లోప‌మే.

గ‌తంలో జ‌గ‌న్‌కు వెన్నుద‌న్నుగా ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి వైఎస్ ష‌ర్మిల రాష్ట్ర న‌లుమూల‌లా తిరిగి విస్తృతంగా ప్ర‌చారం చేశారు. బైబై బాబు అంటూ ష‌ర్మిల ప్ర‌చారాన్ని హోరెత్తించారు. ఐదేళ్లు తిరిగే స‌రికి వాళ్లు తెలంగాణ‌లో స్థిర‌ప‌డ్డారు. మ‌రీ ముఖ్యంగా ఏపీతో త‌న‌కు సంబంధం లేద‌న్న‌ట్టు ష‌ర్మిల చెబుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి విజ‌య‌మ్మ వ‌స్తారో?  లేదో?   తెలియ‌ని ప‌రిస్థితి.

ఇక అయిన దానికి, కాని దానికి త‌గ‌దున‌మ్మా అంటూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొస్తుంటారు. తాము జ‌గ‌న్‌ను ఎన్నుకుంటే, స‌జ్జ‌ల ప‌రిపాల‌న సాగిస్తున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో వుంది. అంతేకాదు, స‌జ్జ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తే, వైసీపీకి ప‌డే ఓట్లు కూడా పోతాయ‌ని భ‌య‌ప‌డే అధికార పార్టీ నేత‌లు లేక‌పోలేదు.

కేసీఆర్ బంధువులు ప్ర‌భుత్వంలో ఎలా ఉన్నారో, జ‌గ‌న్‌కు అలా లేక‌పోలేదు. జ‌గ‌న్ సోద‌రుడు వైఎస్ అవినాష్‌రెడ్డి క‌డ‌ప ఎంపీగా, మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి క‌మ‌లాపురం ఎమ్మెల్యేగా, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి రెండు నెల‌ల క్రితం వ‌ర‌కూ నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మ‌న్‌గా, ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర వైసీపీ ఇన్‌చార్జ్‌గా, మ‌రో బంధువు బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్‌గా దుగ్గాయ‌ప‌ల్లె మ‌ల్లికార్జున‌రెడ్డి ఉన్నారు. అయితే వీళ్ల వ‌ల్ల జ‌గ‌న్‌కు లాభం లేక‌పోగా న‌ష్ట‌మే అని వైసీపీ నేత‌లు అంటుంటారు.

జ‌గ‌న్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బంధువులు ల‌బ్ధి పొంద‌డ‌మే త‌ప్ప‌, ఆయ‌న‌కు న‌యాపైసా కూడా ఉప‌యోగ‌ప‌డ‌ర‌నే చ‌ర్చ వుంది. మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు వ‌లే జ‌నంలోకి వెళ్లి ప్ర‌చారం చేసేందుకు జ‌గ‌న్ బంధువుల్లో స‌మ‌ర్థులెవ‌రూ లేరు. దీపం వుండ‌గానే ఇంటిని చ‌క్క‌దిద్దుకోవాల‌నే చందాన‌… జ‌గ‌న్ అధికారంలో వుండ‌గానే ఆర్థికంగా, ప‌ద‌వుల ప‌రంగా ల‌బ్ధి పొందాల‌నేది జ‌గ‌న్ బంధువుల భావ‌న అనే విమ‌ర్శ బ‌లంగా వుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ బంధువులు గ‌త నాలుగున్న‌రేళ్ల‌లో వ్య‌వ‌హ‌రించారు.

జ‌గ‌న్ అధికారం క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డికి వివేకా హ‌త్య కేసులో ఊర‌ట పొందేందుకు ప‌నికొచ్చింద‌ని ప్ర‌తిప‌క్షాలు నిత్యం విమ‌ర్శిస్తున్నాయి. అలాగే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి సొంత ప‌నులు చ‌క్క‌దిద్దుకోడానికి త‌ప్ప‌, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోర‌నే విమ‌ర్శ వుంది. వైవీ సుబ్బారెడ్డి విష‌యానికి వ‌స్తే హాయిగా నాలుగేళ్ల‌పాటు టీటీడీ చైర్మ‌న్‌గా కాలం గ‌డిపారు. ఆయ‌న త‌న‌యుడు విక్రాంత్‌రెడ్డికి ఉత్త‌రాంధ్ర‌లో మైనింగ్ వ్యాపారానికి జ‌గ‌న్ అధికారం ఉప‌యోగ‌ప‌డుతోంది. బాలినేనికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అది పోగానే ప్ర‌భుత్వంపై నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు.

జ‌గ‌న్ అధికారం ఆయ‌న బంధువుల‌తో పాటు మ‌రో ఐదారుగురికి మాత్రమే ప్ర‌యోజ‌నం క‌లిగింది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల దోపిడీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అది వేరే ఎపిసోడ్‌. ఇప్పుడు కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప‌నికొచ్చే వారెవ‌ర‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఇలాగైతే జ‌గ‌న్ ఎన్నిక‌ల గండం నుంచి గ‌ట్టు ఎక్కేదెట్టా?