రాజమౌళికి, ఇతర దర్శకులకి తేడా ఏవిటి? అతను వైఫల్యం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. దానికి కారణం పూర్తిగా తన మేకింగ్ టాలెంటేనా? కచ్చితంగా కాదు.
ప్రతి సినిమాకి స్క్రిప్ట్ ఉంటుంది.
కానీ రాజమౌళి సినిమాకి మార్కెటింగ్ స్క్రిప్ట్ ఉంటుంది..
ప్రతి సినిమాకి సంప్రదాయబద్ధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వగైరాలుంటాయి.
కానీ రాజమౌళి సినిమాలకి ఏ పంక్షన్ ఎప్పుడు చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఎలా చేయాలి, ఎవరు ఎలా మాట్లాడాలి, సోషల్ ఇంఫ్లుయన్సెర్స్ ని ఎలా వాడాలి మొదలైనవన్నీ ఒక స్క్రిప్ట్ మాదిరిగా ఉంటాయి.
అందుకే ప్రతి రాజమౌళి సినిమా ప్రజల హృదయాలకి దగ్గరగా వెళిపోతుంది. విడుదల రోజే ఎగబడి చూసెయ్యాలన్న ఫీలింగ్ కలగజేస్తుంది.
అదే రాజమౌళి ప్రత్యేకత. అంటే తానే తన సినిమాలకి వ్యూహకర్త.
అదే విధంగా ఎన్నికలప్పుడు పార్టీలకి వ్యూహకర్తలు అవసరం.
మీరడగొచ్చు… దేశానికి మంచి చేసే నాయకులు కావాలి కానీ, ఎవడ్నో నాయకుడ్ని మార్కెటింగ్ చేసి గద్దెనెక్కించే వ్యూహకర్తవల్ల దేశానికేం ప్రయోజనం అని..!
ఇదే విషయం ఇప్పుడు చర్చించుకుందాం.
వ్యూహకర్త పని ముఖ్యంగా క్షేత్ర స్థాయి నుంచి, పార్టీ నరనరానా ఉన్న లోటుపాటుల్ని నిస్సంకోచంగా అధినాయకుడికి తెలియజెప్పడం. ఈ పని వ్యూహకర్త తప్ప ఇంకెవ్వడూ చేయలేడు.
సాధారణంగా ప్రతి పార్టీ తమ జిల్లా పార్టీ ప్రెసిడెంటుల్ని నమ్ముకుంటుంది. వాళ్లు ఇచ్చిన రిపోర్ట్స్ ని విశ్వసిస్తుంది.
“మన జిల్లాలో మన పార్టీకి ఢోకా లేదు” అని పార్టీ జిల్లా ప్రెసిడెంటు చెప్పేస్తే నమ్మేస్తుంది అధినాయకత్వం. అలా చెప్పే ప్రెసిడెంట్లకి రకరకాల వ్యక్తిగత అవసరాలు, ప్రాపకాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. దాంతో వారు కోరుకున్న కాండిడేట్ కి టికెటివ్వడం దగ్గర్నుంచి తప్పుల్ని కప్పి పుచ్చడం, ప్రజాభిప్రాయం పైకి వెళ్లకుండా చూడడం లాంటి పనులు చేస్తారు.
అదే స్థానికేతర వ్యూహకర్త సీన్లోకొస్తే పరిస్థితి వేరు. అతనికిక్కడి వారితో ఏ రకమైన వ్యక్తిగత లావాదేవీలు ఉండవు. ఉన్నదున్నట్టు నిఖార్సైన డయాగ్నోసిస్ రిపోర్ట్ ఇచ్చేస్తాడు. అప్పుడు చెయ్యాల్సిన వైద్యం చేయొచ్చు.
భారతదేశంలో ప్రశాంత్ కిషోర్ కి ముందు “ఎన్నికల వ్యూహకర్త” అనే పొజిషనొకటొస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏ పార్టీకాపార్టీ సొంతగా వ్యూహాలు రచించుకుంటూ పోయేవి. గాలివాటంలో ఎవరు గెలిస్తే వారు గద్దెనెక్కేవారు.
2014 ఎన్నికల్లో మోదీని సోషల్ మీడియా ద్వారా జనాలకి చేరువ చేసింది ప్రశాంత్ కిషోర్ టీం. దేశంలో మూల మూలలకు కాంగ్రెస్ వ్యతిరేకతని పెంచి మోదీపై సానుకూలతని పెంచిన ఘనత వ్యూహకర్తదే.
అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి వ్యూహకర్త లేకుండా సొంతంగా బరిలోకి దూకాడు. గెలవాల్సి ఉన్నా ఓడిపోయాడు. కానీ 2019లో ఆ తప్పు చేయకుండా వ్యూహకర్తతో ముందుకెళ్లాడు. గెలిచాడు.
ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం.
వ్యూహకర్త వల్ల 2014లో మోదీ ప్రభుత్వం వచ్చింది… అది కూడ ఊహించనంత మెజారిటీతో. అదే మళ్లీ 2019లో పునరావృతమైంది.
దేశంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
నోట్ల రద్దుని విమర్శించినా…ఇప్పుడు దేశం మొత్తం డిజిటల్ మనీదే ఏలుబడి.
సగటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఆ పై స్థాయిల ఇళ్లల్లో కూడా కరెన్సీ నోట్లు గతంలోలాగ కనిపించడంలేదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, పేపర్ బిల్లు కూడా డిజిటల్ గానే పే చేస్తున్నవారు పెరిగిపోయారు.
ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది.
దొరికితే కొంత దొరకచ్చు కానీ, గణనీయంగా బ్లాక్ మనీని ఇంతకంటే గొప్పగా అరికట్టడం ఎవరివల్ల అవుతుంది?
గతంలో రిటైల్ వ్యాపారులు కొంత క్యాష్ ని పక్కనపెట్టుకుని కావాల్సినంతే బ్యాంకుల్లో తమ అకౌంట్స్ లో కట్టేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. అధికశాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావడంతో ప్రతిదీ అకౌంట్లోకొచ్చేస్తున్నాయి.
ఇక ఆర్టికల్ 370 రద్దు కూడా మోదీ హయాములోనే జరిగిందనేది మర్చిపోకూడదు.
జీ.ఎస్.టీ వల్ల దేశం కుదేలవకుండా నిలబడి ఉంది.
ప్రతికూల పరిస్థితుల్లో కూడా డాలర్ విలువ కూడా అమాంతం దూకేయకుండా అదుపులో ఉంది.
కరోనా కష్టకాలాన్ని కూడా ఇంత పెద్ద దేశం ఆర్థికంగా చితికిపోకుండా నిలబడగలిగింది.
ఇవి మంచి వైపైతే పెట్రోల్ ధరలు పెరగడమొక్కటీ చెప్పుకోవాల్సిన అతి పెద్ద మైనస్. ప్రతి ప్రభుత్వం వల్లా మంచి, చెడు రెండూ జరుగుతాయి.
ఒక వ్యూహకర్త ఇలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి దోహదపడ్డాడు. ఇప్పుడదే వ్యూహకర్త పార్టీ మార్చి ప్రత్యర్థుల శిబిరాన్ని గెలిపించడానికి కూడా వెనుకాడడంలేదు. అంటే ఏవిటి? ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఒకే శక్తి రాజ్యమేలకూడదనే ప్రాధమికమైన అంశం.
దేశం ఒక పార్టీనుంచి మరొక పార్టీకి చేతులు మారినప్పుడే ప్రజలందరి మనసులకూ సమన్యాయం జరుగుతుంది. కొందరు తమకిష్టంలేని ప్రభుత్వంలో కొన్నేళ్లు గడిపినట్టే, మిగిలిన వారు తమకిష్టం లేని రాజ్యంలో కొన్నేళ్లు బతకాల్సిన రోజులు కూడా వస్తాయి.
వ్యూహకర్తలు పార్టీలకి అవసరం. పార్టీలు దేశానికి అవసరం. ఈ సరికొత్త రంగంలో ఒకరే కాకుండా మరింత మంది యువత ముందుకు రావాలి. బలమైన పభుత్వాల్ని ఎన్నుకోవడానికి దారులు వేయాలి.
– శ్రీనివాసమూర్తి