అనకాపల్లి రాజకీయ చైతన్యం కలిగిన లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ చాలా పట్టింపులు ఉన్నాయి. ముఖ్యమంగా బలమైన సామాజిక వర్గాల సమాహారం ఈ సీటు. గవరలు, వెలమలు, కాపులు ఎక్కువగా ఉంటారు. ఈ మూడు సామాజిక వర్గాల మధ్యనే అనకాపల్లి సీటు ఎపుడూ పోటీ పడుతూ వస్తోంది.
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ భీశెట్టి సత్యవతి ఎంపీగా వైసీపీ తరఫున నెగ్గారు ఆనాటి ఎన్నికల్లో టీడీపీ కూడా గవర సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయించింది. పోటా పోటీగా సాగిన సమరంలో వైసీపీ గెలిచింది.
ఈసారి చూస్తే అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో ప్రధాన పార్టీలు ఇతర సామాజిక వర్గాల వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గం వైపు వైసీపీ టీడీపీ చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీకి పొత్తులో ఈ సీటు ఇచ్చినా లేక టీడీపీ పోటీ చేసినా వెలమలకు ఇవ్వాలని చూస్తోంది. లేకపోతే కాపులకు ఇవ్వాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది.
బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీలో ఉంటారు అని అంటున్నారు. ఆయన కాకపోతే టీడీపీ నుంచి ఒక కాపు సామాజిక వర్గ పారిశ్రామికవేత్త పేరు వినిపిస్తోంది. వైసీపీ నుంచి చూస్తే వెలమలకే టికెట్ అని అంటున్నారు. రేసులో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పేరు వినిపిస్తోంది. ఆయన కాకపోతే ఆయన కుమార్తె జెడ్పీటీసీ అయిన ఈర్లె అనూరాధ పేరు కూడా ఉంది.
అయితే ఇక్కడే గవర సామాజిక వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ టికెట్ ని తమ సామాజిక వర్గానికి ప్రధాన పార్టీలు కేటాయించాలని వారు కోరుతున్నారు. గతంలో ఎంతో మంది అదే సామాజిక వర్గానికి చెందిన వారు గెలిచారు అని గుర్తు చేస్తున్నారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వకపోతే తమ సహకారం కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు. దీని మీద ప్రధాన పార్టీలు ఏమి చెబుతాయో చూడాల్సిందే అంటున్నారు.