టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు. ఆయన అలా రాజకీయాల నుంచి తప్పుకునేలా టీడీపీ అధినాయకత్వమే చేసింది అన్నది ఆయన మాటలలో వ్యక్తం అవుతోంది. పెందుర్తి టికెట్ ని ఆశించిన బండారు అది దక్కకపోవడంతో చాలా బాధపడ్డారు. అనారోగ్యం పాలు అయి ఆసుపత్రికి వెళ్ళి మరీ బెడ్ మీద రోజుల తరబడి ఉన్నారు.
ఆయన తాజాగా పరవాడ మండలంలోని తన సొంత ఊరు వెన్నెలపాలెంలో తన అనుచరులు అభిమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వలేదని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనది టీడీపీతో నాలుగు దశాబ్దాల పైగా ఉన్న అనుబంధం అని ఆయన అన్నారు.
తాను ఏ తప్పు చేశానని టికెట్ నిరాకరించారు అని అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇరవై ఆరు రోజులుగా తాను తీరని వేదనతో ఉంటే కనీసం ఎవరూ మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. పార్టీలు మారిన వారికి టికెట్లు ఇస్తారా అంటూ వైసీపీ నుంచి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.
తన బంధువులు సన్నిహితులు మరణించినపుడు కూడా ఇంతటి బాధ అనుభవించలేదు తేరుకున్నానని ఇపుడు తనను నిలువునా అవమానించడం దహించి వేసిందని బండారు అంటున్నారు. తనకు ఏ పదవి ఇస్తారన్న ఆశలు అయితే లేవని అధినాయకత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు.
అందువల్ల తన కోసం పనిచేస్తూ తన వెంట ఉన్న క్యాడర్ కూడా ఏ ఆశలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. తన రాజకీయ సమావేశం ఇదే చివరిది అని బండారు చెప్పారు. తాను ఇక మీదట క్రియాశీల రాజకీయాల్లో పాలు పంచుకోనని ఆయన తీవ్ర నిర్ణయాన్ని ప్రకటించారు. కార్యకర్తలు మాత్రం అందుబాటులో ఉంటానని వారిని తాను తోచిన సాయం చేస్తాను అని ఆయన అన్నారు.
తనకు వైసీపీ లాంటి పార్టీలు భారీ ఆఫర్లు ఇచ్చాయని అయిన నిబద్ధత కలిగిన నేతగా పార్టీని మారడం లేదు అని బండారు చెప్పారు. తాను రాజకీయాలు చేయను అని తన భవిష్యత్తు ఎలా ఉండాలో అనుచరులు అభిమానులే నిర్ణయించాలని ఆయన కోరడం విశేషం. ఇవన్నీ చూసిన మీదట బండారు బాగా విసిగిపోయారు అని అంటున్నారు.
టీడీపీ అధినాయకత్వం ఇన్నాళ్ళ తరువాత ఆయనకు కబురు పంపించింది. రాజకీయాలకు ఒక దండం పెట్టిన బండారు వెళ్తారా లేదా అన్నది చూడాలని అంటున్నారు. బండారు అయితే తాను ఏమి తక్కువ అని మధనపడుతున్నారు ఉత్తరాంధ్రాలో సీనియర్ నేతలు అందరికీ తలో విధంగా న్యాయం చేసిన అధినాయకత్వం బండారుకు మాత్రం మొండి చేయి చూపించింది. దాంతో ఆయన రగిలిపోతున్నారు. టీడీపీకి బండారు డెసిషన్ షాక్ అని అంటున్నారు. పెందుర్తిలో కూటమికి కూడా దెబ్బ పడేలా ఉందని అంటున్నారు.