భీమిలీ హాట్ ఫేవరేట్ సీటు అని కోరి సంపాదించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆ సంతోషం లేకుండా సొంత పార్టీతో పాటు మిత్ర పార్టీ కూడా చేస్తోంది. గంటా నాన్ లోకల్ ఆయనకు భీమిలీ టికెట్ ఎలా ఇస్తారు అని టీడీపీలోని నాయకులతో పాటు జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేన నుంచి టికెట్ ఆశించిన పంచకర్ల సందీప్ ని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.
గంటాను భీమిలీలో ఓడించి తీరుతామని జనసేన నేతలు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. గంటా గతంలో భీమిలీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని వారు విమర్శించారు. పార్టీ కోసం కష్టపడుతూ జనంలో ఉన్న సందీప్ కి టికెట్ నిరాకరించడం దారుణం అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ జనసేన అధినాయకత్వాలు పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ భీమిలీ ఇంచార్జి కోరాడ రాజబాబు అయితే గంటాకు టికెట్ రావడం పట్ల మండిపడుతున్నట్లుగా భోగట్టా. పార్టీ కోసం జెండా మోసిన తమకు అధినాయకత్వం తీరని అన్యాయం చేసిందని ఆయన అనుచరులతో అన్నట్లుగా చెబుతున్నారు. కోరాడ రాజబాబుకు 2009 నుంచి టీడీపీ హ్యాండ్ ఇస్తూనే ఉంది. అప్పట్లో ఆంజనేయరాజుకు టికెట్ ఇచ్చారు.
ఆ తరువాత ఆయన 2014, 2019లలో కూడా టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈసారి ఖాయం అనుకుంటే గంటా చివరి నిముషంలో సీటును దక్కించుకున్నారు. దాంతో ఏమి చేయాలి అన్నదాని మీద కోరాడ తన అనుచరులతో చర్చిస్తున్నారు. కోరాడకు సొంత పార్టీలో గంటా వ్యతిరేక వర్గం నేతల మద్దతు ఉంది అని అంటున్నారు. గంటా గెలుపునకు ఆయన మనస్ఫూర్తిగా సహకరించకపోతే ఇబ్బందులే వస్తాయని అంటున్నారు.
గంటాకు గతంతో పోలిస్తే భీమిలీలో గ్రాఫ్ తగ్గింది అని అంటున్నారు. ఆయన ఈసారి ఏ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతారు అన్న ప్రశ్నలు కూడా ప్రత్యర్ధులు వేస్తున్నారు. భీమిలీ సీటులో గెలిచి మంత్రి కావడం తప్ప నియోజకవర్గానికి చేసిన గట్టి మేలు ఏదో చెప్పాలని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య గంటా భీమిలీలో ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సొంత పార్టీ మిత్ర పార్టీలలోని విభేదాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది.