ఆత్మ గౌరవ నినాదం మరో మారు తెర మీదకు వచ్చింది. ఆ నినాదం దశాబ్దాలుగా విశాఖలో సాగి చివరికి పీల గొంతుకతో వినిపించకుండా పోయింది. విశాఖలో నాన్ లోకల్స్ కి ఎంపీ టికెట్ ఇవ్వడమే ఒక అర్హత అన్నది అన్ని పార్టీలు కలసి కూర్చిన రాజ్యాంగం అయిపోయింది. నాన్ లోకల్స్ కి విశాఖ ఎంపీ సీటు రిజర్వ్ అయిపోయింది అని జనాలు కూడా రాజీ పడలేదు కానీ మౌనంగా రోదించే పరిస్థితి ఉంది.
అనకాపల్లి విషయం అలా కాదు, అక్కడ ఎపుడూ లోకల్స్ కే పట్టం కడుతున్నారు. ఇపుడు కడప నుంచి డైరెక్ట్ గా అనకాపల్లిలో దిగుమతి అయిన బీజేపీ ఎంపీ అభ్యర్ధి మీద అనకాపల్లిలో మేధావులు గొంతు విప్పుతున్నారు. అనకాపల్లి భౌగోళిక సామాజిక పరిస్థితుల మీద అవగాహన లేని వారికి టికెట్లు రాజకీయ పార్టీలు ఇచ్చి జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు అని మండిపడుతున్నారు.
ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కి కనీసం అనకాపల్లి జిల్లా సరిహద్దులు కూడా తెలియవు అని అనకాపల్లి ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ గుడాల సత్యనారాయణ ముదిరాజ్ మండిపడ్డారు. తనకు టికెట్ అనకాపల్లిలో ఇచ్చారని సీఎం రమేష్ గుర్తించి కనీసం తానుగా అనకాపల్లికి వచ్చి జిల్లా స్థానిక పరిస్థితుల మీద అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత కూడా మరవడం బాధాకరం అన్నారు.
దానికి విరుద్ధంగా స్థానిక టీడీపీ బీజేపీ నేతలు పనిగట్టుకుని మరీ సీఎం రమేష్ కోసం అనకాపల్లి పొలిమేరలలో గంటల తరబడి వేచి ఉండడం అనకాపల్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అని ఆయన ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా ప్రజలకు ఆత్మగౌరవం లేవని వీరంతా భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
స్థానికేతరుడికి ఘన స్వాగతాలు పలకడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని మేధావులు అంటున్నారు. సీఎం రమేష్ ని మించిన ఎంపీ అభ్యర్థి అనకాపల్లిలో లేరని జనాలకు చెప్పదలిచారా అని వారు నిలదీస్తున్నారు. మేమంతా నీకు బానిసలమని మొక్క్దే ఈ విధానాన్ని ఎలా అలవాటు చేసుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి ప్రజలకు నిండుగా ఆత్మాభిమానం ఉందని వారి రాజకీయ చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే బోల్తా కొట్టినట్లే అని కూడా మేధావులు హెచ్చరిస్తున్నారు. కేవలం అంగబలం అర్ధబలం ఉందని సీఎం రమేష్ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న నాయకులు జనాలకు జవాబు చెప్పుకోవాల్సి ఉందని అంటున్నారు. ఓటేసేది నాయకులు కారని గుర్తుంచుకోవాలని అంటున్నారు.
అనకాపల్లి ఆత్మగౌరవ నినాదం స్థానిక నినాదం క్రమంగా ఊపందుకుంటోంది. ఇది కనుక ఎన్నికల నాటికి కీలకంగా మారితే కూటమికి భారీ ముప్పు తప్పదని అంటున్నారు. అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్ కి ఒక సీఎం స్థాయిలో కూటమి నేతలు స్వాగతం పలకడం పట్ల జనంలోనూ భిన్న తీరులలో స్పందన వస్తోంది.