ప్రజలతో నిత్యం మమేకం అయి ఉంటున్న వాలంటీర్లు అందరూ కూడా తమకు ఇలాంటి ఉద్యోగావకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి పట్ల కృతజ్ఞతతో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ.. ప్రభుత్వ పథకాల సంక్షేమాన్ని ఆయా లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. అలాంటి పనిలో భాగంగా ఆ ప్రజలు అడిగితే జగన్ సర్కారు గురించి నాలుగు మంచి మాటలే చెప్పే అవకాశం ఉంటుంది. అలాంటి వాలంటీర్లను ప్రలోభపెట్టి.. వారిద్వారా కూడా తనకు అనుకూల ప్రచారం చేయించుకోవడానికి చంద్రబాబునాయుడు స్కెచ్ వేస్తున్నారు.
చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుని ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవైపు వాలంటీర్ల మీద నిత్యం విషం కక్కుతూ ఉంటారు. వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ చేసే వారిగా చిత్రీకరించిన దుర్మార్గపు బుద్ధి పవన్ కల్యాణ్ ది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు వ్యవస్థే ఉండదన్నట్టుగా ఆయన నిప్పులు చెరగుతుంటారు. అదే సమయంలో.. వాలంటీర్లతో పెట్టుకుంటే పతనం తథ్యం అనే అవగాహన ఉన్న చంద్రబాబునాయుడు మాత్రం.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అని నమ్మించడానికి మాటలు చెబుతున్నారు.
అయితే తాజాగా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మరింతగా వారిని మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్న సంగతి కనిపిస్తోంది. మీలో ప్రతిభ ఉన్న వారికి యాభైవేలు లక్షరూపాయలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెబుతున్నారు. ఏంటి ఈ మాయ అనేది ప్రజలకు అర్థం కావడంలేదు.
ప్రతిభ ఉన్న వారికి, టేలెంట్ ఉన్న వారికి యాభైవేల ఉద్యోగం రావొచ్చు గాక.. కానీ అందుకు చంద్రబాబునాయుడు ఏం చేస్తారనేది మాత్రం చెప్పడం లేదు. ప్రతిభ ఉన్నవారు ఇప్పుడు మాత్రం యాభైవేల ఉద్యోగాలు దక్కించుకుంటే.. జగన్ వారిని ఏమైనా అడ్డుకుంటున్నాడా? లేదు కదా..!
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో బాండ్లు రాయించుకుని- ఇన్ని సంవత్సరాల పాటూ ఈకొలువు వదలి వెళ్లడానికి ఆంక్షలు పెడితే అప్పుడు జగన్ తీరును తప్పుపడితే అర్థముంది. అలాంటిది లేనప్పుడు.. నిరుద్యోగులకు ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మాత్రేమే జగన్ అందించారు. వాళ్లకు మంచి అవకాశాలు వచ్చి మానేసి వెళితే ప్రభుత్వంలో ఎవ్వరూ అడ్డుకోవడం లేదు.
ఇక్కడ ఇంకోసంగతి కూడా గమనించాలి. ఉద్యోగాలకల్పన చేస్తాను అనే ముసుగులో వాలంటీర్లకు చంద్రబాబు ఆ మాట చెబుతుండవచ్చు. కానీ.. ఉద్యోగాల కల్పన అనేది కేవలం వాలంటీర్లకు మాత్రమే కాదు కద. అలాంటప్పుడు మీకు యాభైవేలు, లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తా అనడం కేవలం మోసపూరితమైన మాటలు మాత్రమే. ఇలాంటి మాటలను వాలంటీర్లు నమ్మే అవకాశం లేదని ప్రజలు అనుకుంటున్నారు.