అశోక్ ని తప్పించారా లేక?

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్ లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం…

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్ లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం ఇదే మొదటిసారి. 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అశోక్.

అది లగాయితూ ఆయన ఎనిమిది సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచారు. అలాగే రెండు సార్లు ఎంపీగా పోటీ చేస్తే ఒకసారి గెలిచారు. ఆయన టీడీపీ కంటే ముందే ఎమ్మెల్యే అయిన వారు. రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడు. టీడీపీ ఫౌండర్లలో ఒకరు. చంద్రబాబు సీఎం కావడానికి ఆయన ముఖ్య కారకుడు.

అంతటి సీనియర్ నేత ఎందుకు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు అన్నది అయితే ఆయన అనుచరులు అభిమానులలో చర్చకు దారి తీస్తోంది. అశోక్ వయోభారం రిత్యా పోటీ నుంచి తప్పుకున్నారు అని ఒక ప్రచారం సాగుతోంది. కానీ ఆయన చంద్రబాబు కంటే కూడా వయసులో చిన్నవారు అని చెబుతారు.

ఆయన ఈ రోజుకీ ఫిట్ గానే ఉంటున్నారు. ఆయన కంటే పెద్ద వారు ఎందరో రాజకీయాల్లో ఇంకా ఉంటూ పోటీ చేస్తున్నారు. కానీ అశోక్ ఎందుకు దూరంగా ఉన్నారు అంటే ఆయనను దూరం పెట్టారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.

ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ తనకూ తన కుమార్తెకు రెండు టికెట్లు అశోక్ అడిగారు అని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ప్యాక్ లేదు అని చెప్పి ఒక్కటే టికెట్ ఇచ్చారు అని అంటున్నారు. అశోక్ పార్టీ పోకడల పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారని అందుకే ఆయన దూరం జరిగారు అని అంటున్నారు.

ముక్కుసూటిగా రాజకీయాలు చేసే అశోక్ కి విజయనగరంలో కుల మతాలకు అతీతంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రజలు ఎపుడూ ఆయనను రాజుగా చూడలేదు. ఆయన కూడా అందరితో కలసిపోతూ వచ్చారు. అలాంటిది విజయనగరం సీటు విషయంలో సామాజిక సమీకరణలు అంటూ కొత్త లెక్కలతో టీడీపీ అడుగులు వేస్తోంది. ఇలాంటివి చాలా చూసిన మీదటనే తాను దూరంగా ఉంటే బెటర్ అనే అశోక్ తప్పుకున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలోనే పెద్దాయనగా నిజాయతీపరుడిగా మంచి నేతగా చెప్పుకునే అశోక్ పోటీలో లేకుండా జరుగుతున్న ఎన్నికలు బాగా లోటుగానే ఉందని అంటున్నారు.