బాబు ఉండగానే కఠిన నిర్ణయం అంటున్న తమ్ముడు

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఆయన ఉంటుండగానే తాను కఠిన నిర్ణయం తీసుకుంటానని మాడుగులకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గవిరెడ్డి రామానాయుడు ప్రకటించారు. ఈ నెల 15న తన భవిష్యత్తు…

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఆయన ఉంటుండగానే తాను కఠిన నిర్ణయం తీసుకుంటానని మాడుగులకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గవిరెడ్డి రామానాయుడు ప్రకటించారు. ఈ నెల 15న తన భవిష్యత్తు మీద కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

మాడుగుల టీడీపీ టికెట్‌ని ఆశించిన గవిరెడ్డి తాజాగా మీడియా ముందు బోరున విలపించారు. చంద్రబాబుని ఎంత ప్రాధేయపడినా తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈసారి టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాను అని చెప్పినా తనకు పక్కన పెట్టారు అని ఆయన అంటున్నారు.

ఈసారి తాను ఎన్నికల బరిలో ఉంటాను అని గవిరెడ్డి స్పష్టం చేశారు. గవిరెడ్డికి మాడుగులలో బలం ఉంది. 2009లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి ఆయనకే టికెట్ వస్తుందని అనుచరులు అనుకున్నారు.

టీడీపీ అయితే ఎన్నారైకి టికెట్ ఇచ్చింది అని గవిరెడ్డి వర్గీయులు ఫైర్ అవుతున్నారు. ఆయనను ఇండిపెండెంట్ గా పోటీ చేయమని వత్తిడి తెస్తున్నారు. దాంతో గవిరెడ్డి తీసుకునే నిర్ణయం మీద ఉత్కంఠ నెలకొంది. ఆయన కనుక రెబెల్ గా పోటీలో ఉంటే మాడుగులలో గెలుపు అవకాశాలు ఇప్పటికే ఉన్న వైసీపీకి ఈ సీటు రాసిపెట్టుకోవచ్చు అని అంటున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రాలో ఉండగానే తమ్ముడు సీరియస్ డెసిషన్ దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది పసుపు శిబిరంలో అంతా తర్కించుకుంటున్నారు.