ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఉన్నది విశ్వసనీయత. ఆయన మాట ఇస్తే నిలబడతారు అన్నది అందరికీ తెలుసు. ఆయన రాజకీయ జీవితమే దానికి నిదర్శనం. ఇదిలా ఉంటే విశాఖలో దాదాపు రెండు రోజుల పాటు బస చేసిన జగన్ ఎండాడలో తన క్యాంపులో అనేక మందిని కలసి కీలక అంశాలు చర్చించారు.
ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు జగన్ ని కలిసినప్పుడు ఆయన ఉక్కు లాంటి హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానీయమని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా తాను ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పార్టీగా ప్రభుత్వంగా చేసిన కార్యక్రమాలను వారికి వివరించారు.
తమ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ విషయం మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. అంతే కాకుండా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయకుండా ఇతర మార్గాల ద్వారా లాభార్జన చేసే విధంగా కీలక సూచనలు చేస్తూ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. అదే విధంగా ప్రధానికి ఈ విషయం చెప్పి తమ పార్టీ స్టాండ్ ఏంటో తెలియచేశామని అన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేట్ కాకుండా రాజీలేని పోరాటమే తమ పార్టీ మొదటి నుంచి చేస్తోందని జగన్ వారికి వివరించారు. ఈసారి కేంద్రంలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాకపోతే వైసీపీ మద్దతు కచ్చితంగా అవసరం పడుతుందని అప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని జగన్ హామీ ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలోకి వచ్చే గాజువాకలో వైసీపీని గెలిపించడం ద్వారా బీజేపీ- టీడీపీ- జనసేనలకు చెక్ పెట్టాలని జగన్ వారిని కోరారు. గాజువాకలో కనుక కూటమి అభ్యర్ధి గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రజలు కార్మికులు సానుకూలంగా ఉన్నారు అన్న సంకేతాలు పంపించినట్లు అవుతుందని జగన్ వారికి సూచించారు.
అందువల్ల వైసీపీని గెలిపించండని కోరారు. స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులతో పాటు లాభాల బాట పట్టే విధంగా తమ పార్టీ తమ ప్రభుత్వం కృషి చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. ఉక్కు విషయంలో వైసీపీ అవలంబిస్తున్న స్పష్టమైన వైఖరి కచ్చితంగా కూటమికి దెబ్బ తీసేలా ఉందని అంటున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు కూటమిని కంటే వైసీపీనే నమ్మే విధంగా జగన్ వారికి ఇచ్చిన హామీలు ఉన్నాయని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే విషయంలో వైసీపీ చిత్తశుద్ధి ఏమిటి అన్నది జగన్ క్లారిటీ విడమరచి చెప్పడం విశేషం.