ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజగురువు, టీడీపీ అనుకూల మీడియాధిపతి దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబానికి వ్యతిరేకంగా రామోజీరావు మీడియా ఏ విధంగా పని చేస్తున్నదో అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆఖరి శ్వాస వరకూ రామోజీరావు కృషి చేశారు.
రామోజీరావు సంస్మరణ సభకు సంబంధించి రాష్ట్ర సమాచారశాఖ ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు చోటు దక్కలేదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫొటో, అలాగే ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
నిజానికి ఈ సంస్మరణ సభకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూడా ముఖ్య అతిథే. ఎందుకనో ఏపీ సమాచారశాఖ పవన్‌కల్యాణ్‌ను విస్మరించింది. పవన్‌కల్యాణ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం తన చర్యల ద్వారా చాటుకుంటోంది. దీనిపై టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పవన్‌ను నెత్తిన పెట్టుకుంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే ఆవకాశం వుందని టీడీపీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అందుకే పవన్‌కు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గించడానికి టీడీపీ ఆలోచిస్తోంది. బహుశా ఇందులో భాగంగానే వాణిజ్య ప్రకటనలో పవన్‌కు ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో వచ్చిన మార్పును జనసేన జాగ్రత్తగా గమనిస్తోంది.