టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మాటలెక్కువ, చేతలు తక్కువ. బహుశా ఇప్పటికి ఆయన వరుసగా ఐదు సార్లు ఓడిపోయారు. ఆరోసారి సర్వేపల్లిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సోమిరెడ్డి గెలిస్తే, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినట్టే అని నెల్లూరు జిల్లాలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.
తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో అధికారంలోకి వచ్చేశామన్న అహంకారం కనిపించింది. పనిలో పనిగా వైసీపీ నేతలకు ఆయన హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సోమిరెడ్డి ప్రత్యేకత ఏమంటే… ఎన్నిసార్లు ఓడిపోయినా ఏ మాత్రం సిగ్గుపడరు. పైగా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తుంటారు. గురువారం కూడా అదే పని చేశారు.
ఎన్నికల తేదీ 13వ తేదీ అయిపోయిందని, ఇక జూన్ 4 మిగిలి వుందని అన్నారు. ఫలితాలు ఏ విధంగా వుంటాయో చూడండని ఆయన హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తున్నామని ఆయన ప్రకటించారు. కడపలో కూడా మెజార్టీ స్థానాలను కైవశం చేసుకుంటామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు హద్దుల్లో వుండాలని ఆయన హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే, రెండో చెంప చూపడానికి తాము గాంధీ మహాత్ములం కాదని ఆయన హెచ్చరించడం గమనార్హం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో విజయ కేతనం ఎగుర వేస్తామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సోమిరెడ్డి ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజానీకం లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆయన ఓడిపోవడానికే పోటీ చేస్తుంటారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. టీడీపీ కడప ఇన్‌చార్జ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ జిల్లాపై కూడా ఆయన మాట్లాడారు. తానే ఐదు దఫాలుగా విజయం కోసం శ్రమిస్తున్నా ఫలితం లేదని తెలిసి కూడా… ప్రత్యర్థుల్ని హెచ్చరించడం సోమిరెడ్డికే చెల్లింది. అందుకే గప్పాలు కొట్టడం మాని, ముందు మీరు గెలవండి సామి అంటూ సోమిరెడ్డిపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.