కాలం కలిసిరాకపోతే సమస్యలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ ఉండే గొడవే అయినా, ఇప్పుడే జరుగుతున్నట్టు అనిపిస్తాయి. దేశం పురోగమిస్తోందని ప్రభుత్వం లెక్కలు చెబుతుంటే ప్రతిపక్షాలు కొన్ని సంఘటనలను చూపించి “అంతా ఉత్తిది–అసలు విషయం ఇది” అని చెబుతుంటాయి.
మనమిప్పుడు చెప్పుకునేది నిరోద్యోగ సమస్య గురించి. దేశానికి ఆర్ధిక వెన్నెముకలైన రాష్త్రాలేవిటి అంటే మహారాష్ట్ర, గుజరాత్ మొదటి స్థానంలో నిలుస్తాయి.
తాజాగా ముంబాయి ఏయిర్‌పోర్టులో లగేజ్ లోడర్స్ ఉద్యోగానికి వాకిన్ ఇంతర్వ్యూలు నిర్వహించారు ఎయిర్ ఇండియా వారు. మొత్తం వేకన్సీలు 2216 ఉంటే వచ్చిన యువకులు దాదాపు 25,000 మంది. 1:10 నిష్పత్తి అనేది ఇలాంటి ఉద్యోగాలకి సర్వ సధారణం. ఈ ఉద్యోగానికి ఇచ్చే వేతనం నెలకి రూ 22,500.
“అయ్యో..ఆ కాస్త జీతం కోసం ఇంతమంది యువకులు పడిగాపులు కాస్తున్నారంటే దేశం అధోగతిలో ఉంది. నిరుద్యోగం తాండవిస్తోంది” అంటూ ప్రతిపక్షాలు గేలి చేస్తున్నాయి. ఆ దిక్కున ఉండే మీడియాలు కూడా వీటిని హైలైట్ చేసి చూపిస్తున్నాయి.
అది “కాస్త జీతం” ఎందుకవుతుంది? ఎవరికవుతుంది? నెలకి 22,500 అంటే ఓవర్ టైం అలోవెన్సులు కలిపి రూ 30,000 వరకు వస్తాయని ఈ ఉద్యోగానికి వచ్చిన వాళ్లే చెబుతున్నారు. వీళ్ల పని ఫ్లైట్ లోంచి లగేజ్ తీసుకొచ్చి బెల్ట్ మీద వేయడం. బెల్ట్ మీద బ్యాగులు ఎక్కువుంటే వాటిని తీసి పక్కన జాగ్రత్తగా పేర్చడం. దీనికి వారి విద్యార్హతలు పెద్దగా అవసరం లేదు. వినయం, శరీర దారుఢ్యం, ఎక్కువగా అలసిపోని తనం మాత్రం తప్పనిసరి.
తరచూ రావు గానీ, ఎప్పుడైనా ఏ లగేజ్ ఇష్యూలోనో అదనపు సాయం అడిగి ఎంతో కొంత టిప్ చేతుల్లో పెట్టే ప్రయాణీకులు కూడా ఉంటారు. ఎలా చూసుకున్నా నెలకి రూ 30,000 అనేది చిన్న జీతం కాదు. సిటీల్లో కొన్ని ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ పనిచేసే డ్రైవర్ల జీతాల కంటే ఎక్కువే.
ఒకవేళ ఇక్కడ అధికమైన విద్యార్హత అడిగి ఆ జీతమనుంటే ఆర్గ్యుమెంటుకి వేల్యూ ఉండేది.
కానీ ఆ వచ్చిన వారిలో డిగ్రీ, పీజీ చదివిన వాళ్లు కూడా ఉన్నారని ఒక గోల. డిగ్రీ చదివినంత మాత్రాన స్కిల్ ఏముంది అన్న దానిని బట్టి జాబులొస్తాయి తప్ప డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్ చూపించేస్తే ఉద్యోగాలిచ్చేసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా ఉండదు.
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. దాంతో ఏం సాధిస్తున్నారో మరి! అది వేరే విషయం.
అయినా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా లోకజ్ఞానంతో టెక్నికల్ స్కిల్ ని, కమ్యూనికేషన్ స్కిల్ ని పెంపొందించుకుని పెద్ద ఉద్యోగాలు పొందుతున్న వాళ్లు దేశంలో కోకొల్లలు. అలాంటి వాళ్లు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు.
చదివిన చదువుకి తగ్గ ఉద్యోగాలు దేశం కల్పించలేకపోతోంది అనే విమర్శ అర్ధం లేనిది. స్కిల్ ఉన్నవాడిని ఎవడూ అపలేడు. లేనివాడిని అప్పణంగా ఉద్యోగమిచ్చి ఎవ్వడూ పైకి లేపలేడు. “సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్” సూత్రం ఇక్కడ వర్తిస్తుంది.
అయినా ఏం చదువు చదివావు అని కాకుందా, ఈ రోజుల్లో కూడా శరీర బలాన్ని లెక్కేసి దానికి తగ్గ ఉద్యోగాలు ఉండనే ఉంటున్నాయి. అందులో ఒకటి ఈ లగేజ్ లోడర్ జాబ్.
ఆ ఉద్యోగాలకి వచ్చిన జనం, వెంటనే ఇంటర్వ్యూ అవ్వక ఆపసోపాలు పడ్డారుట..అదొక వార్త. అయినా ఆ ఉద్యోగానికి కావాల్సిన ప్రాధమిక లక్షణమే ఓపిక, ఊరికే అలసిపోకపోవడం. అంటే అక్కడికొచ్చిన వాళ్లల్లో కూడా ఆ ఉద్యోగానికి తగిన లక్షణం లేని వాళ్లు చాలామంది ఉన్నారన్నమాట. ఆ యాంగిల్లో ఎందుకు చూడకూడదు ఈ విషయాన్ని?
అలాగే గత వారం గుజరాతులోని అంకలేశ్వర్ లో 10 ఉద్యోగాల కోసం 1800 మంది లైన్లోకొచ్చి నిలబడ్డారని, రైలింగ్ కూలిపోయిందని, దేశంలో నిరుద్యోగం ఇలా తాండవిస్తోందని ప్రతిపక్షాలు తాండవించాయి. అసలా ఉద్యోగాలేంటి? ఆన్లైన్ లో సీవీ పంపమనకుండా నేరుగా వాకిన్ ఎందుకు పెట్టారు? ఆ వచ్చిన వాళ్లల్లో ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం ఉండి మెరుగైన జీతం అని తెలిసి వచ్చినవాళ్లున్నారా? ఈ ప్రశ్నలు ఎవరు అడిగారో తెలియదు.
చేస్తున్న పనిలో సంతృప్తి లేక ఎక్కడ ఉద్యోగముందంటే అక్కడ అప్లై చేసుకునే బాపతు చాలామంది ఉంటారు. చేస్తున్న కంపెనీలో గ్రోత్ లేక కావొచ్చు, బాస్ నచ్చక కావొచ్చు..అంతే తప్ప వాకిన్ ఇంటర్వ్యూలో లైన్లో నిలబడ్డ ప్రతివాడూ నిరుద్యోగి అనుకుంటే ఎలా?
ప్రస్తుతం బీజేపీ కి ఆబ్సొల్యూట్ మెజారిటీ లేదు. గతం కంటే శక్తి క్షీణించింది. మహారాష్ట్రలో బైపోల్స్ వస్తున్నాయి. అందుకే ఇలాంటి వార్తలు హైలైటవుతున్నాయా? ఈ ఆలోచన కూడా చేయాలి కదా!
అన్నట్టు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త ప్రకటన చేసాడు. “లాడ్లా భాయి యోజన” కింద ఇంటర్ చదివి ఉద్యోగం లేకుండా ఉన్న యువకులకి నెలకి రూ 6000, డిప్లమా ఉన్న వాళ్లకి రూ 8000, డిగ్రీ ఉండి ఉద్యోగం లేని వారికి రూ 10000 ఇచ్చేస్తాడట…
“ప్రస్తుతం నిరోద్యోగ సమస్య ఎక్కువైపోయిందని అంటున్న ప్రతిపక్షాలకి ఇదే నా సమాధానం” అని అన్నాడు.
అంటే తాజా సంఘటనలని ప్రతిపక్షాలు ఎంతెలా హైలైట్ చేసాయి, షిండే ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఈ పథకాన్ని ఎలా ప్రకటించింది చూస్తే ఒక రొటీన్ సీన్ చుట్టూ అలముకున్న రాజకీయం అర్ధమవుతుంది.
ఇది బీజేపీ ప్రభుత్వానికి వంత పాడే వ్యాసం కాదు. నిరుద్యోగానికి విరుగుడు డబ్బు పంచడం కాదు. అలా ఇస్తామంటేనే ఓట్లేస్తారనే లెక్క మామూలే. తాజా ఎన్నికల్లో తెలంగాణా, కర్ణాటక, ఆంధ్రాల్లో మేనిఫెస్టోలు ఎంతటి పాత్ర పోషించాయో చెప్పక్కర్లేదు. అందుకే ముందు ప్రకటించేసి తరవాత సంగతి తర్వాత అన్నట్టుగా “లాడ్లా భాయి యోజన” ప్రకటించి ఉంటాడు షిండే.
ఇలాంటి వార్తలు ఇంకా వస్తాయి. యూట్యూబు నిండా ఇవే ఉంటాయి కొన్నాళ్లు. ఎందుకంటే మన దేశంలో వార్తలు కూడా అంటువ్యాధే. నిర్భయ రేప్ వార్త దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న రోజుల్లో వరసపెట్టి రేప్ వార్తలు వినపడేవి. దిశా సంఘటన తర్వాత కూడా అంతే.
ఇలా ఏ వార్తైనా ఒకటి మండుతున్నప్పుడు ఆ రకమైన వార్తలే కవరవుతూ ఉంటాయి. కవర్ అవ్వట్లేదంటే జరగట్లేదని కాదు. దేశంలో జరిగే ప్రతి వార్తని జనానికి చేరవేయాలంటే ఇంకో వెయ్యి చానల్స్ వచ్చినా పని జరగదు. అన్ని విషయాలు జరిగిపోతుంటాయి. అందుకే ఏ వార్త అయితే పీక్ లో ఉందో ఆ రకమైన వార్తలే వండి వార్చడం మీడియా లక్షణం.
ఇంతకీ బాటం లైన్ ఏంటంటే ప్రతి వాడికీ ఏదో ఒక ఉద్యోగం చేయగలిగే శక్తి ఉంటుంది. అలా వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకోవాలి తప్ప “నేను బీటెక్ చదివాను..నాకు ఉద్యోగం ఇవ్వలేని ప్రభుత్వం వేష్ట్” అనడం చేతకాని తనం. అంధులు, వికలాంగులే ఏదో ఒక రకమైన పని చేసుకుని బతుకుతున్నారు. అన్ని అవయవాలు పని చేసే యువకులు సోషల్ మీడియాకి, రీల్స్ కి పరిమితమైపోయి…తమ స్కిల్లేంటో తమకి తెలియకుండా, ఉద్యోగానికి తగిన ప్రయత్నాలు చేయకుండా సమాజాన్ని, ప్రభుత్వాన్ని తిట్టడం సరైనది కాదు. అలాగే ప్రతిపక్షాలు ఎత్తి చూపే ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసేసుకోకుండా, కాస్త ఆలోచించగలిగే బ్యాలెన్స్ మైండులో ఉండాలి.
హరగోపాల్ సూరపనేని