ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఏపీలో అప్పులపై మీడియా దాగుడుమూతలు ఆడుతోంది. జగన్ సర్కార్ ఉన్నంత వరకూ రాష్ట్రం అప్పులు లేనిదే పూట గడవదంటూ పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. జగన్ సర్కార్ భారీగా అప్పులు చేస్తుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజం శ్రీలంక, వెనుజులా దేశాల సరసన చేరుతోందనే భయాన్ని క్రియేట్ చేయడంలో టీడీపీ అనుకూల మీడియా తలమునకలైంది.
జగన్ పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాల్ని అమలు చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆ మీడియా తమకు అనుకూలురైన ప్రముఖులతో ఇంటర్వ్యూలు ఇప్పించింది. సీన్ కట్ చేస్తే… ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే తాము ఎక్కువగా సంక్షేమ పథకాలన్ని అందిస్తామని చంద్రబాబు నమ్మబలికారు. ఆయన్ను జనం నమ్మారు. అయితే జగన్ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాల్ని అమలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తావనే ప్రశ్నకు.. తనకు రాజకీయ, పరిపాలనానుభవం వుందని, సంపద సృష్టిస్తానని భారీ డైలాగ్లు కొట్టారు.
చంద్రబాబు సంపద సృష్టించే సంగతి దేవుడెరుగు! ప్రతినెలా అప్పులు లేనిదే, సర్కార్ బండి ముందుకు నడవని దయనీయ స్థితి. దీన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. ఇది తప్పని సరి. అయితే చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చే అప్పుల్ని ఆయన అనుకూల మీడియా దాచి పెడుతోంది. ఒకప్పుడు జగన్ సర్కార్ అప్పు తెస్తే, ఫస్ట్ పేజీలో ప్రముఖంగా ఆ మీడియా ప్రచురించేది. అప్పుడు జగన్ మీడియా అప్పుల్ని దాచి పెట్టేది. ఇప్పుడు సీన్ రివర్స్.
చంద్రబాబు ప్రభుత్వ అప్పుల్ని జగన్ అనుకూల మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఎవరికీ కనిపించకూడదనే తాపత్రయంతో ఎక్కడో ఒకమూల రెండు ముక్కల్లో రాసి మమ అనిపిస్తోంది. తాజాగా రూ.5,200 కోట్ల అప్పునకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ కేబినెట్ తీర్మానించిన వార్తను వైసీపీ మీడియా పతాక శీర్షికతో ప్రచురించింది.
ఇదే చంద్రబాబు మీడియా విషయానికి వస్తే, ప్రాధాన్యం వేరే. అసలు అప్పు అనేది పెద్ద అంశమే కాదన్నట్టు, లోపలి పేజీల్లో ఎక్కడో ఓ మూల కనిపించీ, కనిపించనట్టు ప్రచురించడాన్ని గమనించొచ్చు. పాలకులు తమకు ఇష్టమైనోళ్లు అయితే ఒక లెక్క, కానివారైతే మరో లెక్క అన్నట్టుగా ఏపీ మీడియా వైఖరి వుంది. అయితే ఇవన్నీ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.