వీళ్లా వైసీపీ వాయిస్‌ని వినిపించేది?

వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి అనేక కార‌ణాలున్నాయి. క‌ర్ణుడి చావుతో వైసీపీ రాజ‌కీయ మ‌ర‌ణాన్ని పోలుస్తూ అనేక విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి, వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో చేసిన మంచి ప‌నుల్ని చెప్పుకోలేకపోయింది. ఎన్నిక‌ల‌కు…

వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి అనేక కార‌ణాలున్నాయి. క‌ర్ణుడి చావుతో వైసీపీ రాజ‌కీయ మ‌ర‌ణాన్ని పోలుస్తూ అనేక విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి, వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో చేసిన మంచి ప‌నుల్ని చెప్పుకోలేకపోయింది. ఎన్నిక‌ల‌కు రెండు మూడు రోజుల ముందు ఒక ప్ర‌ముఖ తెలుగు న్యూన్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వైఎస్ జ‌గ‌న్ త‌న పాల‌న‌లో జరిగిన అభివృద్ధి ప‌నుల గురించి వివ‌రించారు. 

జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ చూశాక‌… ఔరా మ‌న పాల‌న‌లో ఇంత అభివృద్ధి జ‌రిగిందా? అని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సైతం ముక్కున వేలేసుకున్న ప‌రిస్థితి. ఈ దుస్థితికి ప్ర‌ధాన కార‌ణం… ఆ పార్టీ వాయిస్‌ని బ‌లంగా వినిపించే నాయ‌కులెవ‌రూ లేక‌పోవ‌డ‌మే. ఘోర ప‌రాజ‌యం త‌ర్వాతైనా కాస్త విష‌య ప‌రిజ్ఞానం, ప‌ద్ధ‌తిగా మాట్లాడ‌గ‌లిగే అధికార ప్ర‌తినిధుల్ని నియ‌మించుకోవాల‌నే స్పృహ వైసీపీలో ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

సులువుగా భాష‌లు నేర్చుకోవ‌డం ఎలా? ఈజీగా డ‌బ్బు సంపాదించ‌డం ఎలా? అనే స‌బ్జెక్టుల‌పై యూట్యూబ్‌లోనూ వీడియోలు వ‌స్తుంటాయి. వాటికి ఆద‌ర‌ణ బాగానే వుంటుంది. వైసీపీలో కూడా అలాంటి బాప‌తు క‌థే న‌డుస్తోంది. త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు, ప్ర‌త్య‌ర్థుల‌పై అవాకులు చెవాకులు పేలితే స‌రిపోతుంద‌నే ద‌గ్గ‌రి దారిని కొంద‌రు వైసీపీ చిల్ల‌ర నాయ‌కులు ఎంచుకున్నారు. అదేంటో గానీ, జ‌గ‌న్‌కు కూడా ఇలాంటివే ఇష్ట‌మ‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతుంటారు. 

కాస్త ప‌ద్ధ‌తిగా, రాజ‌కీయాల్ని రాజ‌కీయాలుగానే చూడాల‌ని, చేయాల‌ని చెబితే జ‌గ‌న్‌కు కూడా న‌చ్చ‌వ‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటుంటారు. అందుకే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకున్నామ‌ని ఇప్ప‌టికైనా జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలి.

ఇది ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌. నాయ‌కుల కంటే ప్ర‌జాభిప్రాయాలే రాజ‌కీయ పార్టీల స్థానాల‌ను నిర్ణ‌యిస్తాయి. వైసీపీ అంటే పెద్ద‌రికం లేని పార్టీగా గుర్తింపు తెచ్చుకుంద‌నేది చేదు నిజం. ఈ అభిప్రాయం నుంచి ఆ పార్టీ బ‌య‌ట ప‌డాల్సిన త‌క్ష‌ణావ‌స‌రం ఎంతైనా వుంది. అందుకే మీడియా డిబేట్ల‌కు వెళ్లే అధికార ప్ర‌తినిధుల్ని జాగ్ర‌త్త‌గా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ ఆ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. వైసీపీలో షార్ట్‌క‌ట్ దారుల్ని ఎంచుకున్న నాయ‌కులే ఎక్కువ‌.

ఇటీవ‌ల సాక్షి టీవీ డిబేట్‌లో వైసీపీ యువ నాయ‌కుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌పై ఎలా మాట్లాడారో చూశాం. ఆయ‌న గారి నోటి దురుసుకు యాంక‌ర్ల స్థానాల్లో వున్న వారే అవాక్క‌య్యారు. ఇలాంటి ధోర‌ణుల వ‌ల్లే వైసీపీ అభాసుపాలైంద‌ని తెలిసినా, ఇంకా అదే పంథా. అలాగే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఒకాయ‌న ప‌దేప‌దే చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఆయ‌న గారికి ఇంట్లోనే భార్య రూపంలో ప్ర‌త్య‌ర్థి ఉన్నారు. ఇక అలాంటి నాయ‌కులు చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం వైసీపీకి లాభ‌మో, న‌ష్ట‌మో పార్టీ పెద్ద‌లే ఆలోచించాలి. 

అలాగే ప్ర‌జల తిర‌స్క‌ర‌ణ‌కు గురైన మాజీ మంత్రులే మ‌ళ్లీమ‌ళ్లీ మీడియా ముందుకొచ్చి, ప్ర‌త్య‌ర్థుల‌పై అవే వెట‌కాలు, విమ‌ర్శ‌లు. వైసీపీ ఓడిపోయిన త‌ర్వాతైనా, కాస్త కొత్త ముఖాల్ని తెర‌పైకి తీసుకొచ్చేందుకు వైఎస్ జ‌గ‌న్ ఆలోచించాలి. వైసీపీలో విష‌య ప‌రిజ్ఞానం, గౌర‌వ‌ప్ర‌ద‌మైన నాయ‌కుల‌కు త‌క్కువేం లేదు. అయితే అమ‌ర్యాద‌స్తుల దూకుడు ముందు, వారు త‌ట్టుకుని నిల‌బ‌డ‌లేక‌పోతున్నారు. అధినాయ‌కుడికి వారి అవ‌స‌రం లేన‌ట్టుంది. అందుకే మ‌న‌కెందుకులే అని మౌనాన్ని ఆశ్ర‌యించారు.

ఇప్ప‌టికైనా జ‌గ‌న్ తీరిక చేసుకుని పార్టీకి గౌర‌వం తెచ్చే నాయకుల్ని మీడియా ముందుకు పంపాలి. ఆ ప‌ని త‌క్ష‌ణం చేయాల్సిన అవ‌స‌రం వుంది.