‘ఉక్కు’ చేపను చంపడం ఎలా?

భాజపా నేతలకు వున్నన్ని తెలివి తేటలు మరెవరికి వుండవు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో భాజపా ఎన్ని దాగుడు మూతలు ఆడుతోందో అందరికీ తెలిసిందే. Advertisement పార్లమెంట్ లోపల, బయట రకరకాల ప్రకటనలు. మరోపక్క…

భాజపా నేతలకు వున్నన్ని తెలివి తేటలు మరెవరికి వుండవు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో భాజపా ఎన్ని దాగుడు మూతలు ఆడుతోందో అందరికీ తెలిసిందే.

పార్లమెంట్ లోపల, బయట రకరకాల ప్రకటనలు. మరోపక్క ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ కు స్వంత గనులు ఇవ్వని వైనం. ఇప్పటి వరకు ఆర్ధికంగా ఆదుకోని పరిస్థితి. స్టీల్ ప్లాంట్ లో వున్న స్కూళ్లను వదులుకుని, జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసిన సంగతి. ఇవన్నీ ఇలా వుంటే హైదరాబాద్ లో వున్న భూములు, విశాఖలో వున్న విలువైన భూములు అమ్మకానికి పెట్టేసిన సంగతి కూడా తెలిసిందే.

ఇన్ని చేసిన తరువాత ఇప్పుడు తీరిగ్గా, కేంద్ర మంత్రి ఏం అన్నారు అంటే విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయము అన్నారు. నిజంగా మంచి వార్తే. కానీ ప్రయివేటీకరణ చేయరు. కానీ బతికిస్తారా? ఆ సంగతి చెప్పండి. డబ్బులు లేవు, ముడి సరుకు లేదు. సగం ఉత్పాదన జరుగుతోంది. ఆ ఉత్పాదన కూడా అప్పులు ఇచ్చిన వారు పట్టుకుపోతున్నారు. హైదరాబాద్ లో స్టాక్ యార్డ్ అమ్మకానికి పెట్టేసారు. మరి ఏం చేద్దామని.

చేపను ప్రత్యేకంగా చంపనక్కరలేదు. నీళ్లలోంచి తీసి బైట పడేస్తే చాలు. అదే చచ్చిపోతుంది. స్టీల్ ప్లాంట్ ను ప్రత్యేకంగా ప్రయివేటీకరణ చేయక్కరలేదు. ఇలా ఇలా నీరసింప చేసేస్తే చాలు. ఆఖరికి ఉత్పాదన ఆగిపోయి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నా, వాళ్లే కనీసం ప్రైవేట్‌కు ఇచ్చి అయినా తమను ఆదుకోమని అడిగే పరిస్థితి వచ్చాక, సరే, మీరే అడుగుతున్నారు కనుక ప్రైవేట్‌కు ఇచ్చేస్తాం అంటారా?

కేంద్ర మంత్రి ప్రకటన ఊరట కలిగించేదే. కానీ ఉక్కు ఫ్యాక్టరీకి కాదు. ఉక్కు ఫ్యాక్టరీకి ఊరట కలగాలంటే ఆర్థిక సాయం అందించాలి. స్వంత గనులు ఇవ్వాలి. ఈ రెండూ తక్షణం జరగాలి. అప్పుడే కేంద్రం చిత్త శుద్ది తెలుస్తుంది. లేెదంటే ఇవన్నీ కంటి తుడుపు ప్రకటనలే.