ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారు. ఏపీ 16వ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. వాటి హక్కులను కాపాడాల్సి ఉంది. అయ్యన్న సొంత ఇలాకా నర్శీపట్నం నియోజకవర్గంలో చూస్తే కీలకమైన పదవిలో ప్రజా ప్రతినిధిగా ఉన్న ఒకామె తనకు రక్షణ కల్పించాలని కొత్త స్పీకర్ నే కోరుతున్నారు.
ఆమె నర్శీపట్నం మునిసిపల్ చైర్ పర్సన్. మునిసిపాలిటీకి ప్రధమ పౌరురాలు అన్న మాట. వైసీపీ తరఫున గెలిచి చైర్ పర్సన్ గా ఉంటున్న బోడపాటి సుబ్బలక్ష్మి తనకు ప్రాణ భయం ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది. అది కూడా టీడీపీ నేతల నుంచే అని ఆమె అంటున్నారు.
తాను ఒంటరి దళిత మహిళను అని ఆమె మీడియా ముందు తన బాధను వ్యక్తం చేశారు. తాను మున్సిపల్ చైర్ పర్సన్ అయినా తన వార్డులో సైతం తిరగలేక పోతున్నాను అని సుబ్బలక్ష్మి అన్నారు. తనకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సైతం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని మునిసిపల్ చైర్మన్ అని కూడా ప్రోటోకాల్ పాటించలేదని ఆమె అన్నారు.
తనకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సామాన్యురాలిగా చూశారని ఆమె అన్నారు. తనను ఏ సమయంలోనైనా టీడీపీ నాయకులు ఏమైనా చేసేలా ఉన్నారని ఆమె భయాందోళనలు మీడియా ముందే వ్యక్తం చేయడం విశేషం. అంతే కాదు తన మీద దాడికి కూడా తెగబడే అవకాశం ఉందని ఆమె అంటున్నారు.
తాను రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. తాను ఎపుడూ అయ్యన్న పాత్రుడు కుటుంబాన్ని దూషించలేదని ఆమె వివరణ ఇచ్చారు. దళిత మహిళను ఒంటరి మహిళను అయిన తనను రక్షించాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉందని ఆమె మీడియా ముందే చెప్పారు.
స్పీకర్ గా అయ్యన్నకు ఈ రకమైన విన్నపం రావడం విశేషం. వైసీపీ పాలనలో నర్శీపట్నం మున్సిపాలిటీ ఉంది. దానిని చేజిక్కించునేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంతో పాటు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగమే దళిత మహిళ అయిన మున్సిపల్ చైర్మన్ ఆవేదన. స్పీకర్ హోదాలో అయ్యన్న ఈ విషయం మీద స్పందించి ఆమె రక్షణ భరోసా ఇవ్వాలని వైసీపీ నేతలు అంటున్నారు. స్పీకర్ సొంత నియోజకవర్గంలోనే మున్సిపల్ చైర్మన్ స్థాయి మహిళకే రక్షణ లేదు అంటే అది ఇబ్బందికరమైన వార్త అవుతుందని కూడా అంటున్నారు.