ఏపీ సీఎం చంద్రబాబు కలల రాజధాని అమరావతిపై కీలక సూచనలు చేశారు జనసేన సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ. రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకుండా.. గుంటూరులోనే ఎగువ ప్రాంతాలలో రాజధాని నిర్మాణం చెపట్టాలని సూచిస్తూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను సైతం జత చేస్తూ ట్వీట్ చేశారు.
‘మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకు పోతున్న వాహనాలను చూశాం.. నిన్న ఉత్తరాఖండ్ లో గంగానది వరదల్లో వాహనాలు కొట్టుకు పోయాయి.. రేపు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే.. మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు.. గుంటూరులోనే ఎగువ ప్రాంతాలలో రాజధాని నిర్మాణం జరగాలి.
జరీబు భూములు కేవలం 3పంటలు పాండే ప్రాంతమే కాదు అవి ఇసుక తిన్నెలపై ఏర్పడ్డ ఒండ్రు మట్టి ప్రాంతం దానిని పంటలకు మరియు రాజధానికి నీరు మాత్రమే వినియోగించాలి. అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి.. అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయాలకి తట్టుకొని నిలబడుతుంది’. అంటూ ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోను జత చేస్తూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే ప్రభుత్వంలో పవన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కొంత మంది టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు కలల రాజధానిపై జనసేనలు సూచనలు ఇవ్వడంపై ఎలా రియాక్ట్ అవుతారో.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.