ఆడ పిల్లను ఆటబొమ్మగా చూసినంత కాలం ఈ సమాజంలో మహిళలకు రక్షణ ఉండదు. పెళ్లి చేసుకుంటాడని నమ్మితే, ఏకంగా ప్రాణాలు తీశాడు ఓ దుర్మార్గుడు. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మైనార్టీ కూడా తీరని ఓ అమ్మాయి తన ప్రాణాలు కోల్పోయింది.
పాపన్నపేట మండలం ఎల్లుపేటలో పదో తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలికపై స్థానికంగా ఉంటున్న ఆటోడ్రైవర్ కుమ్మరి వీరేశం కన్నేశాడు. ఎలాగైనా ఆమెను తనదాన్ని చేసుకోవాలనుకున్నాడు. దాని కోసం రోజూ ఆమెను ఫ్రీగా స్కూల్ వద్ద ఆటోలో దింపేవాడు. అలా పరిచయం పెంచుకొని బాలికను ముగ్గులోకి దింపాడు.
తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చాడు. వట్టినాగులపల్లిలో కాపురం పెట్టాడు. కొన్ని నెలలుగా ఆమెతో తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరించాడు. అసలు కారణం ఏంటంటే.. వీరేశంకు ఆల్రెడీ పెళ్లి అయింది. ఒకటి కాదు, ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఈ ఆటోడ్రైవర్.
ఈ విషయం తెలియని మైనర్ బాలిక, పెళ్లి చేసుకోమని పోరు పెట్టడంతో ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. గాజులగూడెం శివార్లలోని మంజీరా బ్రిడ్జిపైకి తీసుకొచ్చి అక్కడ్నుంచి ఆమెను నదిలో తోసి చంపేశాడు. 3 రోజులుగా తమ కూతురు ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అదే సమయంలో మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం గుర్తించారు పోలీసులు.
ఆ మృతదేహం తమ కూతురిదే అని తల్లిదండ్రులు గుర్తించడంలో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వీరేశంను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో.. ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది.