రాజకీయాల్లో పదవీ విరమణ అన్నది ఉండదు. ఎవరైనా ఓపిక ఉన్నంతకాలం పనిచేయాలనే అనుకుంటారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దాదాపుగా ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరోసారి దక్కింది.
పైగా కీలకమైన రెవిన్యూ శాఖను జగన్ ఆయనకు కేటాయించారు. ఇక క్యాడర్ ఆనందానికి అవధులు ఉండవు. వారు అభినందనలు తెలియచేశారు. బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ధర్మాన చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.
రాజకీయాల్లో కొనసాగాలని ఒక్కోసారి అనిపించదు. వయోభారం కూడా దానికి కారణం. కొత్త వారికి అవకాశాలు ఇచ్చి తప్పుకోవాలని ఉంటుంది. కానీ ప్రజల అభిమానంతోనే కొత్త ఉత్సాహం తెచ్చుకుంటున్నాను అని ధర్మాన అనడం పట్ల చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే రెవిన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయింది అని ఆయన సొంత శాఖ మీదనే తొలి కామెంట్స్ చేశారు.
అవినీతి పెరిగినందుకు అంతా సిగ్గుపడాలని కూడా ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నేరుగా నగదు బదిలీ పధకాన్ని అమలు చేస్తూ ఏపీలో అవినీతి లేకుండా చేయాలని ఎంత చూస్తున్నా కూడా ఇంకా ఆ జాడ్యం ఎక్కడో ఒక చోట ఉండడం బాధాకరం అన్నారు.
మొత్తానికి ధర్మాన కామెంట్స్ చూస్తే ఆయనకు పదవి వచ్చిన ఆనందంలో అభిమానులు ఉంటే సీరియస్ ఇష్యూస్ తో పాటు, తన రిటైర్మెంట్ విషయాన్ని ఆయన ప్రస్తావించడం గమనార్హం. మరి నిజంగా ధర్మానలో ఈ మాదిరి వైరాగ్యం వచ్చిందా. ఆయన వచ్చే ఎన్నికల నాటికి తప్పుకుంటారా. ఏమో చూడాలి.