తెలుగు సినిమా.. నిర్వేదాలు, నిట్టూర్పులే!

థియేట‌ర్లో ఎంత‌టి స్టారుడి సినిమా అయినా వారానికి మించి ఊసులో ఉండ‌టం లేదు.

ఎప్పుడో రెండు మూడేళ్ల‌కు ఒక చిన్న సినిమా మెరుస్తుంది! ఒక పెద్ద హీరోలు పొదుపుగా రెండు మూడేళ్ల‌కు ఒక రొటీన్ సినిమాతో వ‌స్తారు. త‌మ ఫ్యాన్స్ అన్నాళ్లూ కూడ‌బెట్టుకున్న సొమ్ముతో వీళ్లు క‌లెక్ష‌న్ల లెక్క‌లు చెబుతారు! అన్ని వంద‌ల కోట్లు, ఇన్ని వంద‌ల కోట్లు అంటూ ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయి. తీరా చూస్తే ఏరియాల వారీగా న‌ష్టాలు అనే మాట వినిపిస్తుంది! సినిమా హిట్టో, ఫ‌ట్టో అర్థం కాని స్థితిలో వార్త‌ల నుంచి తెర‌మ‌రుగు అవుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఓటీటీలో కూడా వెల‌వెల‌బోతోంది!

ఇప్ప‌టికే థియేట‌ర్లో ఎంత‌టి స్టారుడి సినిమా అయినా వారానికి మించి ఊసులో ఉండ‌టం లేదు. ఆ వారం రోజుల్లో భారీ టికెట్ల ధ‌ర‌కు భ‌య‌ప‌డి చాలా మంది సినిమా థియేట‌ర్ల‌కు దూరం అయ్యారు. మ‌రి కొంద‌రు ప్రేక్ష‌కులు ఈ రొటీన్ రొట్ట కొట్టుడు సినిమాల‌కు భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌కు దూరం అయ్యారు! ఇప్పుడు ఆ వారం అయినా థియేట‌ర్ల వ‌ద్ద హ‌డావుడి చేస్తోంది వీరాభిమానులు! చిన్న చిన్న ప‌ల్లెల్లో కూడా హీరోల అభిమాన సంఘాలు వెలిశాయి.

ఐదొంద‌ల జ‌నాభా ఉన్న ఊర్లో కూడా ఒక సంఘం, దానికో సెక్ర‌ట‌రీ, స‌భ్యులందరికీ త‌లా ఒక హోదా! సినిమా విడుద‌ల తేదీ నాడు థియేట‌ర్ మీద ఒక ఫ్లెక్సీ! గ‌తంలో బ్యాన‌ర్లు క‌ట్టుకునే వాళ్లు, ఇప్పుడు ఫ్లెక్సీలు క‌ట్టుకుంటున్నారు. అభిమాన సంఘాల సంస్కృతి మాత్రం తెలుగునాట కొన‌సాగుతూ ఉంది. త‌రాలు మారుతున్నా.. అభిమాన సంఘాలు కూడా వార‌స‌త్వంగా కొన‌సాగుతూ ఉన్నాయి. ఇంత‌కీ సినిమా ఎలా ఉంది అంటే మాత్రం! నిర్వేదాలు, నిట్టూర్పులే!

పెద్ద హీరోల సినిమాలు గ‌తంలో టాక్ తో నిమిత్తం లేకుండా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను అయినా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగేవి. అయితే క్ర‌మంగా ఆ వాటా కూడా త‌గ్గిపోతూ ఉంది. దీనికి అనేక కార‌ణాలు, అందులో ఒక‌టి టికెట్ల ధ‌ర‌లు అని ప‌దే ప‌దే చాలా మంది చెబుతూ ఉన్నారు. న‌గ‌రాల్లో మ‌రీ ఊసుపోక సినిమాల‌కు వెళ్లే వాళ్లే త‌ప్ప‌, లేదంటే సినిమా సూప‌ర్ గా ఉందంటే వెళ్లే వాళ్లే త‌ప్ప .. ఓ పెద్ద హీరో సినిమా కాబ‌ట్టి అదెలా ఉన్నా చూడొచ్చు అనే భావ‌న కంప్లీట్ గా మిస్ అవుతూ ఉంది.

గ‌తంలో యావ‌రేజ్ అనిపించుకున్న సినిమాలు ఓ మోస్త‌రు టౌన్ల‌లో యాభై రోజులు ఆడేవి! అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు జ‌నాభా మ‌రింత పెరిగింది, ప్ర‌జ‌ల వ‌ద్ద ఆర్థిక శ‌క్తీ పెరిగింది. ఓ మోస్త‌రు టౌన్ల‌లో వంద‌, నూటాయాభై రూపాయ‌ల టికెట్ అనుకున్నా పెద్ద‌ది కాద‌నే అనుకున్నా.. థియేట‌ర్ల ముందు క్యూలు క‌న‌ప‌డ‌కుండా పోయాయి! క‌రోనా త‌ర్వాత తిరిగి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తున్నామ‌ని చెప్పుకోవ‌చ్చు ఇండ‌స్ట్రీ.

అయితే ప్రేక్ష‌కులు ఏమీ పంతం క‌ట్టుకోలేదు. సినిమా బాగుందంటే వ‌చ్చే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఎటొచ్చీ బాగుంద‌ని అనిపించుకునే సినిమాల వాటా బాగా త‌గ్గిపోతూ ఉంది. మంచి టాక్ పొంది థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించ‌డం అనేది కేవ‌లం చిన్న సినిమాల బాధ్య‌తే త‌ప్ప పెద్ద సినిమాలు తీస్తోంది అందుకు కాదు అనే భావ‌న అటు నిర్మాత‌ల్లోనూ, ద‌ర్శ‌కుల్లోనూ, హీరోల‌కూ బాగా ఒంట‌బ‌ట్టిన‌ట్టుగా ఉంది.

పెద్ద హీరో సినిమా అంటే భారీత‌నం ఉండాలి, మాస్ మ‌సాలా ఉండాలి, ఐటం భామ లాంటి హీరోయిన్ ఉండాలి, అదిరిపోయే బీజీఎం ఉండాలి, అద‌ర‌గొట్టే ఫైట్లు ఉండాలి! అయితే వీట‌న్నింటి మ‌ధ్య‌న ఉండే క‌థ మాత్రం ప‌ర‌మ రొటీన్ గా, ప‌సిపిల్లాడు కూడా ఊహించ‌గ‌లిగేలా ఉండాలి! అస‌లు ఈ మ‌ధ్య అయితే ట్రైల‌ర్లు చూసి.. క‌థ‌ను చెప్పేసుకుంటున్నారు యూట్యూబ్ లో! ట్రైల‌ర్ చూసి సినిమాకు రివ్యూ ఇవ్వడం అన్యాయ‌మే కావొచ్చు, అయితే అలాంటి అవ‌కాశాన్ని ఇస్తున్నది మాత్రం నిస్సందేహంగా సినీ ప‌రిశ్ర‌మే!

క‌నీసం నెల‌కు ఒక మంచి సినిమాను, ప్రేక్ష‌కుడి చూపు స్క్రీన్ మీదే నిల‌ప‌గ‌లిగే సినిమాను వ‌దులుతోంది మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌. అయితే తెలుగులో మాత్రం ఒక సినిమా హిట్ అని చెప్పుకోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. చాలా లెక్క‌లు ఒప్ప‌జెప్పాలి.

ఎంత‌సేపూ ఈ క‌లెక్ష‌న్ల లెక్క‌ల‌తో సినిమాల జ‌యాప‌జ‌యాల వాద‌న‌లే కానీ, క‌నీసం ఓటీటీలో అయినా ఆస‌క్తిదాయ‌కంగా చూసేంత ఆస‌క్తిని పెంపొందిస్తున్న సినిమాల సంఖ్య రోజురోజుకూ త‌గ్గిపోతోంది టాలీవుడ్ నుంచి! ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్ కు ఎలాగూ డ‌బ్బులు క‌ట్టేసి ఉంటాం, అయితే అక్క‌డ అయినా తెలుగు సినిమాలు చూసే ప‌రిస్థితి ఎంత ఉందో టాలీవుడ్ స‌మీక్షించుకుంటే విస్మ‌య‌మే క‌లుగుతుంది.

ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్ష‌కులు తెలుగు సినిమాల‌కు మించి అనువాద సినిమాల‌ను, ఇత‌ర భాష‌ల సినిమాల‌నే వీక్షిస్తూ ఉన్నారు! తెలుగు ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ గా చేసుకుని ఇత‌ర భాష‌ల సినిమాల‌ను పెద్ద ఎత్తున అనువ‌దించి లేదా డైరెక్టుగా వ‌దులుతున్నారు ఓటీటీ సంస్థ‌ల వాళ్లు. ఇది ఎంత వ‌ర‌కూ వ‌చ్చిందంటే.. ఇప్పుడు తెలుగు సినిమాను కొన‌డానికి ఓటీటీ సంస్థ‌లు పెద్ద ఆస‌క్తి చూప‌నంత వ‌ర‌కూ వ‌చ్చింది.

గ‌త ఏడాది కాలంలో ఓటీటీల్లో అద‌ర‌గొట్టిన తెలుగు సినిమాల సంఖ్య కూడా త‌క్కువే! మంగ‌ళ‌వారం వంటి కొన్ని సినిమాలు మాత్ర‌మే అక్క‌డ మంచి వ్యూస్ ను పొందిన‌ట్టుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. అదే మ‌ల‌యాళ‌, త‌మిళ సినిమాల విష‌యానికి వ‌స్తే పెద్ద పెద్ద జాబితాలు క‌నిపిస్తాయి. త‌మిళ సినిమా మ‌హరాజా రికార్డు వ్యూస్ ను పొందింది.

ఇక ఓటీటీల్లో మ‌ల‌యాళ సినిమాలు క్రేజ్ వేరే! ఆ మ‌హ‌రాజా సినిమా ఏమైనా అద్భుత‌మా అంటే, కొరియ‌న్ సినిమా ఓల్డ్ బాయ్ ఇన్ స్పిరేష‌న్ తో ఒక క‌థ అల్లుకున్నారంతే! అలాంటి ప్ర‌య‌త్నాలు కూడా తెలుగు వైపు నుంచి క‌నిపించ‌డం లేదు. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే, టాలీవుడ్ ఉనికే మ‌రింత కుంచించుకుపోయే అవ‌కాశాలున్నాయి.

20 Replies to “తెలుగు సినిమా.. నిర్వేదాలు, నిట్టూర్పులే!”

  1. తెలుగులొ top 20 కథానాయకులలో స్టార్ లు మాత్రమే ఉన్నారు………. నటులు లెరు.

    1. సరిగా ఉపయోగించుకుంటే.. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ తో మూవీ చేస్తే వారినుంచే మంచి సినిమాలు వస్తాయి.

        1. వారు చేస్తే మనం చూడం…. అందువల్ల వారు చేయరు. మన తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరేగా ఉంటుంది. పరభాషా నటులు చేస్తే చూస్తాం …. ఆహా ఓహో అంటాం గానీ … మనవారు చేస్తే మాత్రం చూడం. అలాంటప్పుడు వారు వారి కెరీర్ నీ సంపాదనని రిస్క్ లో పెట్టుకుని కళా ఖండాలు ఎందుకు తీస్తారు? పైకి నా నుంచి ప్రేక్షకులు ఇవి కోరుకోవడం లేదు అని వారికి కెరీర్ ఎదుగుదలకు.. సంపాదనకు ఉపయోగపడే సినిమాలు మాత్రమే చూస్తారు. నాకు తెలిసిన ఉదాహరణలు… రుద్రవీణ… ఆపద్బాంధవుడు..

  2. రవితేజ, రామ్, నితిన్ లాంటి హీరో ల సినిమాలు ప్లాప్ అయితే నేను OTT లో కూడా చూడడంలేదు! కల్కి, సలార్ సినిమా లకి కలెక్షన్స్ వచ్చాయి అంటే చూసాను కాని టైమ్ వేస్ట్ అనిపించింది.

    1. కల్కి థియేటర్ లో చూసినపుడు బాగానే అనిపించింది గురూజీ. కానీ OTT లో గొప్పగా అనిపించలేదు. Salar ఐతే అసలు థియేటర్ లో చూసే సినిమా నే కాదు. టైమ్ బొక్క.

        1. Nenu చెప్పేది అదే సర్. అన్ని సినిమాలూ థియేటర్ సినిమాలు కావు అని.

    2. కోవిడ్ ముందు… మూవీ ఎలా ఉంది రా అబ్బాయి అని చూసిన వాడిని అడిగితే ఒక సారి చూడొచ్చు అని సమాధానం వచ్చేది. గతి లేక ….వేరే వినోద సాధనం లేక … రిపీటెడ్ ఆడియెన్స్ ఉండేవారు. Jio వచ్చాక… ఇంటర్నెట్ చవకగా దొరకడం ఒక కారణం ఐతే… Covid వల్ల OTTs పరిచయం అవడం మరో కారణం . .. ఇలాటి కారణాల వల్ల రక రకాల వినోద సాధనాలు అరచేతిలోకి అందుబాటులోకి వచ్చాయి. నచ్చకపోతే ఫ్రీగా దొరికే 2 నిమిషాల reel కూడ సాంతం చూడట్లేదు జనాలు. అలాటిది థియేటర్ లో 2 to 3 అవర్స్ ఎవడు కూర్చుని చూస్తాడు. ఒకవేళ చూడాలని ఉన్నా… పాటలు ఫైట్స్ స్కిప్ చేసుకుని చూడగలిగే… వాడికి ఇష్టమైన టైమ్ లో చూడగలిగే OTT వైపే మొగ్గు చూపిస్తున్నాడు. ఏతా వాతా చెప్పేది ఏంటంటే… ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ ఉంటే ఒకటి రెండు వారాలు సినిమా బట్టకడుతుంది. లేదంటే 3 days fans హడావిడి తరువాత మూవీ టాటా చెప్పేస్తుంది.

  3. మనకున్న పీతమెదడు గాళ్ళు పరభాష సినీమాలని మక్కికిమక్కి దించెసి, పనికిమాలిన దానితొ గెంతులెస్యించి సంపాదన కొసం..ముందు టికెట్ ధరలని అదుపులో ఉంచాలి..

  4. నిర్మాత ఒక బ్రోకర్ లా కాకుండా, ఒక అభిరుచి కలిగి అనుకుని, రచయితకి చెప్పి రాయించి, దర్శకుడిని ఎంచుకుని, ఆ తరువాత పాత్రకి తగ్గ నటుడిని తీసుకుంటే మంచి సినిమాలు వస్తాయి.

    అది పోయి, ఒక దర్శకుడే రచయితగా మారి, ఒక హీరో కి తగ్గట్ట్లుగా అక్కడో ఎక్కడో దొరికిన రెఫరెన్స్ లు పెట్టుకుని అల్లుకున్న గజిబిజికి నిర్మాత అనేవాడు ఒక పెట్టుబడిదారు మాత్రమే..

    అసలు తెలుగు వాళ్ళల్లో కాస్త చదువుకున్న వాళ్ళు విదేశాల్లోనో, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో 6 అంకెల జీతాల్లోనో ఉన్నారు..

    ఇంటర్ చదివిన ప్రతీవాడూ ఫీజ్ reimbursment స్కీం లో ఇంజినీరింగ్ చదివితే, ఇంక సినిమా, సాహియ్తం, ఎక్కడ బ్రతుకుతాయి ?

Comments are closed.