ఎన్నికల సంఘం వెనక్కు తగ్గాల్సిందేనా?

ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినా సరే హైకోర్టు తీర్పు అంతిమం కనుక.. ఈసీ తమ నోటిఫికేషను వెనక్కి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

రాజ్యాంగబద్ధమైన రెండు వ్యవస్థల మధ్య ఇప్పుడు చిన్న ప్రతిష్టంభన ఏర్పడింది. న్యాయవ్యవస్థ- ఎన్నికల సంఘం ఆదేశాల మధ్య చిన్న పీటముడి పడింది. కానీ కాస్త లోతుగా గమనించినప్పుడు.. ఎన్నికల సంఘం వెనక్కు తగ్గవలసి వచ్చేలా ఉంది.

ఈసీ తమ ఆదేశాలను, ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా విజయనగరం స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన గొడవ.

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వైసిపి మండలి చైర్మన్ కు గతంలో ఫిర్యాదు చేసింది. ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారని వారికి అనుమానం. రఘురాజు కు కనీసం వివరణ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.

అక్కడ టోటల్ 723 ఓట్లలో వైసీపీకి 500 పైగా ఓట్లున్నాయి. గెలుపు గ్యారంటీ అని వారి నమ్మకం. జగన్ జిల్లా నాయకులతో మీటింగ్ పెట్టుకుని.. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈలోగా ట్విస్ట్ ఏమిటంటే.. రఘురాజు తన మీద వేసిన అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టుకు వెళ్లారు. ఆయనకు వివరణ చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా అనర్హత వేటు వేసినందుకు హైకోర్టు అభ్యంతరం చెప్పింది. మండలి చైర్మన్ నిర్ణయం చెల్లదని తీర్పు ఇచ్చింది. రఘురాజును ఎమ్మెల్సీగా కొనసాగించాలని కూడా స్పష్టంగా పేర్కొంది.

ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినా సరే హైకోర్టు తీర్పు అంతిమం కనుక.. ఈసీ తమ నోటిఫికేషను వెనక్కి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం షాక్ అని చెప్పాలి.

5 Replies to “ఎన్నికల సంఘం వెనక్కు తగ్గాల్సిందేనా?”

Comments are closed.