రాములమ్మకు మంత్రి పదవి ఇస్తారా?

హైకమాండ్ ఆశీస్సులతో నేరుగా పదవి తెచ్చుకున్న విజయశాంతి.. తనకు కేబినెట్ బెర్త్ పై ఆశలు పెట్టుకుంది.

మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉందో లేదో తెలియని, పార్టీ వైపు కన్నెత్తి చూడని, టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరించిన విజయశాంతి అలియాస్ రాములమ్మ అనూహ్యంగా, సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలియకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిపొయింది. నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ మంత్రాంగం సాగించి ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో తన పేరు వచ్చేలా చూసుకుంది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి విజయశాంతిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఎందుకంటే తెలంగాణ పీసీసీ పంపిన లిస్టులో కానీ, సీఎం రేవంత్ చేసిన సిఫారసుల్లో కానీ విజయశాంతి పేరు లేదు. ఇంతకీ ఈ అవకాశాన్ని రాములమ్మ ఎలా దక్కించుకుంది? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరైనా ముఖ్య నేతల సిఫారసు వల్లే విజయశాంతికి ఈ అవకాశం దక్కి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆమె 2009 నుంచి 2014 వ‌ర‌కు పార్లమెంటు సభ్యురాలిగా సేవలు అందించారు. విజయశాంతి కూడా 2009 నుంచి 2014 మధ్యకాలంలోనే పార్లమెంటు సభ్యురాలిగా వ్యవహరించింది . బహుశా అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉంటుంది. విజయశాంతి తరువాతి టార్గెట్ మంత్రి పదవి అంటున్నారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇచ్చే విషయం అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పింది. అంటే ఆమెకు మంత్రి కావాలని ఉందన్నమాట. తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు పదవుల కోసం ఏడాదిగా హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకు రావాలో అంతటి ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు మాత్రం ముందుకు పడటం లేదు.

అసలు పదవులు భర్తీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. కానీ హైకమాండ్ ఆశీస్సులతో నేరుగా పదవి తెచ్చుకున్న విజయశాంతి.. తనకు కేబినెట్ బెర్త్ పై ఆశలు పెట్టుకుంది. అయితే మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇవ్వకపోవొచ్చు అని అన్నారు. శాసనమండలిలో చాలామంది సీనియర్లు ఉంటారని, ఒకరికి పదవి ఇస్తే పోటీ పెరుగుతుందని అన్నారు.

అసలు మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవొచ్చని కూడా అన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం కనుసన్నల్లో మెలిగే ముఖ్యమంత్రి అధిష్టానం ఏం చెబితే అది చేయాల్సిందే కదా. సీఎం ప్రమేయం లేకుండా నేరుగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతి అధిష్టానం తలచుకుంటే మంత్రి కాకుండా ఉంటుందా?

2 Replies to “రాములమ్మకు మంత్రి పదవి ఇస్తారా?”

Comments are closed.