విజయనగరంలో పూసపాటి వంశీకులకు తిరుగులేదు. అది 2004 వరకూ అలాగే హవా సాగింది. అయితే 2004లో మాత్రం కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ నాటి టీడీపీ మంత్రి అశోక్ గజపతిరాజుని ఓడించేశారు. ఆ తరువాత 2019లో మరోసారి అశోక్ కి విజయనగరం ఎంపీ సీట్ లో దారుణమైన ఓటమి ఎదురైంది.
ఇక అదితిగజపతిరాజుని కూడా ఇదే కోలగట్ల వీరభద్రస్వామి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తండ్రీ కూతుళ్ళ మీద గెలిచిన అరుదైన రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నారు.
ఇక ఇపుడు అశోక్ గజపతిరాజు కుటుంబానికి ఎటూ అన్న కూతురు సంచయిత గజపతిరాజు నుంచి ప్రతిఘటన ఉంది. ఆ పోరాటంతో మాన్సాస్ చైర్మన్ గిరీ వ్యవహారాలూ కధ గత ఏడాదికాలంగా కొనసాగుతూ వస్తోంది.
ఇపుడు అదే టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా పూసపాటి రాజాల మీదనే తన బాణాలను ఎక్కుపెట్టడమే అతి పెద్ద ట్విస్ట్. ఆమె ఒకసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా చేశారు. ఇక 2019లో టికెట్ రాలేదు. ఇపుడు ఆమె టీడీపీలోనే ఉంటూ సొంత దుకాణం తెరవడం పార్టీలో చర్చగా ఉంది.
ఆమె సొంత ఆఫీస్ పెట్టడం ద్వారా అదితి గజపతిరాజు మీద ప్రత్యక్ష పోరాటానికి దిగిపోయారని అంటున్నారు. అంటే ఓ వైపు సంచయిత, మరో వైపు గీత..మొత్తానికి రంజు అయిన రాజకీయమే రాజుల కోటలో నడుస్తోంది.