టికెట్ ల సంగతి తేలినట్లేనా?

ఆంధ్రలో టికెట్ ల సమస్య విషయంలో ఓ అడుగు ముందుకు పడింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్ఙిబిటర్లు వెళ్లి మంత్రి పేర్ని నానిని కలిసారు. రేట్లు ఎలా వుంటే తమకు కిట్టుబాటు అవుతుందో ఆ మేరకు వినతి…

ఆంధ్రలో టికెట్ ల సమస్య విషయంలో ఓ అడుగు ముందుకు పడింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్ఙిబిటర్లు వెళ్లి మంత్రి పేర్ని నానిని కలిసారు. రేట్లు ఎలా వుంటే తమకు కిట్టుబాటు అవుతుందో ఆ మేరకు వినతి పత్రం ఇచ్చారు. నిజానికి ఈ రేట్లు నిర్మాతలకు అంతగా రుచించేవి కావు. కానీ అంతకు మించి అడిగితే వ్యవహారం మొదటికే చెడే ప్రమాదం వుంది. అందుకే మధ్యే మార్గంగా ఈ రేట్ల ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా వుంటే కోర్టు పేర్కొన్న అభ్యంతరాలను దృష్టిలో వుంచుకుని ఓ కమిటీ వేసారు. ఆ కమిటీ మీటింగ్ లు కనీసం ఒకటి రెండు అయినా, మొక్కుబడికి అయినా జ‌రగాల్సి వుంది. ప్రభుత్వం అనుకున్న రేట్లను ఆ మీటింగ్ ల్లో మమ అని అనిపించాల్సి వుంటుంది.

ఇప్పటికి నెలాఖరు వచ్చేసింది. అందువల్ల ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు వుంటుందో చూడాలి. ఫస్ట్ మీటింగ్ లో డిస్కషన్ల తరువాత పద్దతిగా మరో సమావేశం ఏర్పాటు చేయాలి. దానికి కనీసం రెండు మూడు రోజుల గ్యాప్ వుంటుందేమో? అప్పుడు తీర్మానం చేసి, నివేదికను మంత్రికి అందించాల్సి వుంటుంది.

మంత్రి ఆ నివేదికను సిఎమ్ కు అందించాలి. ఆయన ఆమోద ముద్ర వేయాలి. అప్పుడు కానీ జీవో బయటకు రాదు. ఇది ఆరవ తేదీ లోపు వస్తేనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉపయోగం లేదంటే ఆంధ్రలో ఆ సినిమాకు చాలా ఇబ్బంది అవుతుంది. 140 కోట్ల మార్కెట్. ఈ రేట్లతో ఆంధ్రలో 140 కోట్లు చేయాలంటే వారాల తరబడి ఫుల్స్ రావాలి.

మరి ఏం జ‌రుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే థియేటర్ల మీద దాడులు కాస్త ఆగాయి. మూసినవి మూసినట్లే వున్నాయి. తెరవడానికి సినిమాలు కూడా లేవు. అందువల్ల ఆర్ఆర్ఆర్ వచ్చేవరకు బాక్సాఫీస్ చాలా స్తబ్దుగా వుంటుంది.