ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న థియేట్రికల్ వ్యవస్థపై మంత్రి పేర్ని నాని ఉన్నదున్నట్టుగా స్పందించారు. నిబంధనలు పాటించకుండా థియేటర్లు మూసేసి, స్వచ్ఛంధంగా మూసేసినట్టు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. టికెట్ రేట్ల అంశాన్ని, థియేటర్లపై జరుగుతున్న దాడుల్ని వేర్వేరుగా చూడాలన్నారు. ఇక త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందిస్తూ.. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా ఏపీలో ఎలాంటి సడలింపులు, మినహాయింపులు ఉండవన్నారు నాని.
“ప్రభుత్వం మనిషిని బట్టి మారదు. చట్టం, రూల్స్ అందరికీ ఒకటే. జగన్ సర్కారు వద్ద వివక్ష అస్సలు ఉండదు. గతంలో అలాంటిది ఉండేది. బామ్మర్ది (బాలకృష్ణ) సినిమా తీస్తే ఒక రకం, బామ్మర్ది కాకుండా వేరేవాళ్లు సినిమా తీస్తే మరో రకంగా ఉండేది చట్టం. ఇప్పుడు అలాంటివేం ఉండవు. బాలకృష్ణ చారిత్రాత్మక సినిమా తీస్తే పన్ను మినహాయింపు ఇచ్చారు. అదే చిరంజీవి తీస్తే ఇవ్వలేదు. సినిమాకు, సినిమాకు రూల్స్ మారవు.”
ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య తనకు ఫోన్ చేశారన్న మంత్రి.. ఆ విషయాల్ని కమిటీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. చిరంజీవి, ఏపీ సీఎం జగన్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నారనే అంశంపై తన దగ్గర సమాధానం లేదన్నారు.
ఇక ఏపీలో బీజేపీ చేస్తున్న హంగామాపై కూడా నాని విరుచుకుపడ్డారు. ఏపీని వంచించింది కాకుండా, ఇప్పుడు సభలు కూడా పెడుతున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులకు ఏపీ బీజేపీని లీజుకు ఇచ్చేసి, వాళ్లు చెబుతున్నట్టు ఆడుతున్నారని విమర్శించారు.
“సాధారణంగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. ఇదో విచిత్రం. జాతీయపార్టీ కూటమిలో ప్రాంతీయ పార్టీలుంటాయి. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ కూటమిలో బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఇద్దరు పెద్ద మనుషులకు లీజుకు ఇచ్చేశారు. సుజనా చౌదరికి, సీఎం రమేష్ కు ఏపీ బీజేపీని లీజుకు ఇచ్చేశారు. పార్టీ ఖర్చు ఈ ఇద్దరిదే. వాళ్లిద్దరూ ఏం చెబితే ఏపీ బీజేపీ నేతలు అదే చేస్తారు. వాళ్లిద్దరూ చెప్పినట్టు పార్టీని నడుపుతున్నారు.”
2019 వరకు అమరావతిని స్కామ్ క్యాపిటల్, రియల్ ఎస్టేట్ కాపిటల్ అంటూ విమర్శించిన ఏపీ బీజేపీ నేతలు.. ఇప్పుడెందుకు అమరావతిపై మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని నాని.