తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ శానససభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని నియమించే అవకాశాలున్నట్టు తెలు స్తోంది. అదే జరిగితే…తనకు పార్టీ అత్యున్నత పదవి దక్కడానికి కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను తప్పక పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే….అసలు అచ్చెన్నకు ఆ పదవి అప్పగించాలనే ఆలోచన చంద్రబాబు చేసి ఉండేవారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఇటు బీసీల్లోనూ, అటు ఉత్తరాంధ్రలోనూ ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అచ్చెన్న దూకుడు కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని బాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రస్తుత తరుణంలో గట్టి వాయిస్ ఉన్న అచ్చెన్న లాంటి వాళ్లే కరెక్ట్ అని టీడీపీ వర్గాలు….ఆయన నాయకత్వంపై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే గ్రామ, మండలస్థాయి పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకున్న టీడీపీ…మున్ముందు లోక్సభ నియోజకవర్గాల దారీగా కూడా కమిటీలను నియమించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. రెండు వారాల్లో పార్లమెంటరీ కమిటీల ప్రకటన తర్వాత …. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి చేసే అవకాశం ఉంది.