కేసీఆర్‌కు పవన్ డెడ్ లైన్! లేకుంటేనా…?

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ చాలా స్ట్రాంగుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన రెండురోజుల డెడ్ లైన్ విధించారు. తాను స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు.…

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ చాలా స్ట్రాంగుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన రెండురోజుల డెడ్ లైన్ విధించారు. తాను స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈలోగా తాను సమస్యకు, సమ్మెకు పరిష్కారం తీసుకురాలేకపోతే గనుక ఇక ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతిస్తా అని కూడా హెచ్చరించారు.

27 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు.. తమ ఆందోళనలకు అన్ని పార్టీల నుంచి మద్దతు కూడగట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు రోజుల కిందట.. తెలంగాణలోని అన్ని పార్టీలతో ఒక భారీ సభ కూడా నిర్వహించారు. ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే.. ఆర్టీసీ కార్మికులు గతంలో కూడా ఒకసారి పవన్ ను కలవడమూ, ఆయన సమ్మెకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించడమూ జరిగింది.

అలా ప్రకటించారే తప్ప.. ఆందోళనకు జనసేన మద్దతు తెలిపిన ఘట్టం ఇప్పటిదాకా లేదు. ఇటీవలి సభకు కూడా జనసేన ప్రతినిధులు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె నాయకులు గురువారం పవన్‌ను మరోమారు కలిశారు. ఈ సందర్భంగా పవన్ వారికి మరింత గట్టి హామీ ఇచ్చారు.

ఒకవైపు కేసీఆర్ అంటే తనకు చాలా గౌరవం ఉన్నదని అంటూనే.. మరోవైపు హెచ్చరికలు కూడా చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మంచిది కాదన్న పవన్ కల్యాణ్, రెండురోజుల్లో తాను ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో సమావేశమై సమస్యను కొలిక్కి తీసుకువస్తానన్నారు. కేసీఆర్ పట్టించుకోకపోయినట్లయితే.. ఆర్టీసీ వారి ప్రత్యక్ష కార్యాచరణకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

మద్దతు ఇదివరకు కూడా ప్రకటించారు. ఇక ఆయన కార్యరంగంలోకి దిగడమే మిగిలింది. కేసీఆర్, పవన్ తో చర్చించి.. సమ్మెను కొలిక్కితెస్తారనేది భ్రమ. ఈ విషయం కోసం అడిగితే.. పవన్‌కు అపాయింట్మెంట్ కూడా అనుమానమే. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీ సమ్మెలో పవన్ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతారని.. కార్మికులు ఆశిస్తున్నారు.