ఒకటికి రెండు సార్లు మోసపోవడం అంటే అది మనతప్పే అంటారు. కానీ డైరక్టర్ ఆర్జీవీ చేతిలో మన ప్రేక్షకులు సదా మోసపోతూనే వుంటారు. గతంలో ఫుల్ లెంగ్త్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు సింగిల్ ఇన్సిడెంట్ లతో బుల్లి, బుచ్చి సినిమాలు తీస్తున్నారు.
పట్టుపని పాతిక నిమషాలు లేని సినిమాలు తీసి జనం మీదకు వదుల్తున్నారు. వంద రూపాయిలు టికెట్ పెట్టి ఈ సినిమా చూసుకోవాలి. లేటెస్ట్ గా వదిలిన సినిమా థ్రిల్లర్. ఈ సినిమా కోసం సోషల్ మీడియా లో పదుల సంఖ్యలో ఫొటోలు వదిలారు. మళ్లీ అవి అలాంటి ఇలాంటి ఫొటొలు కాదు. కండోమ్ ప్రకటనకు బాబుల్లా కనిపించే ఫొటోలు.
అప్సర అనే కొత్త హీరోయిన్ ను ఎంతలా చూపించాలో అంతలా చూపించిన ఈ ఫోటొలు చూసి జనం ఇప్పటికే లొట్టలు వేసేసుకున్నారు. కానీ తీరా సినిమా చూస్తే పదుల సంఖ్యలో వున్న ఫొటొల్లో ఒక్క ఫొటో సీన్ కూడా సినిమా లో లేదని బోగట్టా. పైగా ఓ చిన్న ఇన్సిడెంట్ ను పట్టుకుని అరగంట లోపు ముగిసిపోయే సినిమా తీసి, చివర్న ఓ మెసేజ్ పేస్ట్ చేసాడట వర్మ.
ఫేక్ థ్రిల్స్ కోసం ట్రయ్ చేస్తే కిల్ అయిపోవచ్చు అన్నది ఆ మెసేజ్…కానీ వర్మ కూడా ఈ మేసేజ్ అను అర్థం చేసుకని అన్వయించుకోవాలి. ఫేక్ పబ్లిసిటీతో సినిమాలు ఆడవు అని ఆయన ఎప్పుడు తెలుసుకుంటారో?